సంస్కృత సౌరభాలు - 23


కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు వేల సంవత్సరాల నుండి సమాధానం శోధింపబడుతూనే ఉంది. ఆ ప్రశ్ననే తిరిగి వేసుకోవడం అర్థం లేని పని. కాకపోతే ఈ నిర్వచనాలను తరచి చూస్తే కవిత్వపు నిర్వచనాలు ఆయా మానసిక సంస్కారాలను బట్టి విభిన్న తలాలలో ఏర్పడినట్టు అనిపిస్తుంది. 

అందమైన శబ్దజాలం, చమత్కారం - .
అలంకారాలు, రీతి, శయ్య, పాకం ... -
ఔచిత్యం, అర్థవ్యక్తి...
వక్రోక్తి, గుణీభూతవ్యంగ్యం, వ్యంగ్యం -
రసప్రతీతి -

ఎన్నో కొలతలున్నా ఇంకా ఏదో వెలితి. పైని కొలతలన్ని మరచిపోయే కవిత్త్వం చాలా కొలది సందర్భాలలో మాత్రమే వెలువడుతుంది. అలాంటి సంస్కృతకవిత్త్వం అశ్వఘోషకవి రచించిన బుద్ధచరితం ఆరవ ఆశ్వాసంలో పలుకు పలుకునా కనిపిస్తుంది.

***********

నాలుగు దుఃఖకారకమైన విషయాలను చూసిన గౌతముడు, యశోధరను, శిశువు రాహులుణ్ణి వదిలి మహాభినిష్క్రమణం చేశాడు. ఛన్నుడనే ఒక యువకుడు కంథకమనే అశ్వం ద్వారా గౌతముణ్ణి రాజ్యం బయట తీసుకుని వచ్చి దింపాడు. ఆ తర్వాత -

అవతీర్య చ పస్పర్శ ’నిస్తీర్ణ’మితి వాజినమ్ |
ఛందకం చాబ్రవీత్ ప్రీతః స్నాపయన్నివ చక్షుషా ||

కిందకు దిగి, ఆ గుర్రాన్ని ఆప్యాయంగా నిమిరి "దాటాము" అన్నాడు. ఆపై ఛందకునితో అన్నాడు. "స్నాపయన్నివ చక్షుషా - ఇది మనసు త్రుళ్ళిపడే అద్భుతమైన ప్రయోగం. "కళ్ళతో స్నానం చేయిస్తున్నట్టుగా" చూశాడట గౌతముడు. ఆపై, ఛన్నుడికి కృతజ్ఞతలు చెబుతాడు. 

తరువాత గౌతముడు తన జటలను కత్తిరించుకుని శిరోమణిని ఛన్నుడికిస్తాడు. అతడితో చాలా స్పష్టంగా, తడబాటు లేకుండా చెబుతాడు. 

"ఛన్నా, నా శిగలోని ఈ మణిని తీసుకో. నా మాటలు స్పష్టంగా విని, మహారాజుకు నివేదించు. జరామరణ విముక్తి కనుగొనటం కోసం నేను తపోభూమికి వెళుతున్నాను. స్వర్గం కోసమో, మీమీద ఆదరణ లేకనో, లేక కోపంతోనో మిమ్మల్ని విడువడం లేదు. కాబట్టి నా గురించి శోకింపవద్దు. అలా కాక, అనంతకాలం నేను మీతో కలసి ఉన్నా కాలం సమీపించిన రోజు వియోగం ఎలాగూ తప్పదు. శోకానికి మూలమూ, అంతమూ కనుగొనే ప్రయత్నంలో పడిన నా కోసం శోకించటం అర్థరహితం. 

లోకంలో ఎవరైనా వ్యక్తి గతిస్తే, అతని డబ్బుకూ, వంశానికి వారసులు ఉంటారు కానీ, ధర్మానికి వారసులు ఉండరు. ఉన్నా దొరకటం దుర్లభం. పోనీ, ఇప్పుడు యవ్వనంలో సన్యసించటం తప్పని మహారాజు భావిస్తే - దానికి సమాధానం - జీవితం చంచలమైనది. నిర్ధారితమైనదేదీ లేదు."

ఇలా అనేక విధాలుగా నచ్చజెపుతాడు. ఆ తర్వాత ఛన్నుడు కన్నీళ్ళతో తన మనవిని చెబుతాడు. చిన్ని శిశువునూ, ప్రజలనూ, యశోధరనూ విడిచి వెళ్ళటం రాజ ధర్మం కాదని వేడుకుంటాడు. చివరన "సుమంత్రుడు రాముణ్ణి వదిలి వెనక్కు వెళ్ళినట్టు" నేనిప్పుడు వెనకకు పోలేనంటాడు. ఈతని వాదన చదువుతున్నప్పుడు ఒక సాధారణమైన పల్లెపట్టు యువకుని మాటతీరు కనిపించటం కవి నేర్పు!

ఈ ఘట్టంలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు హృదయం కదిలిపోతుంది. 


అమ్మ గురించిన ప్రస్తావనలో గౌతముడు చెబుతాడు -

మహత్యా తృష్ణయా దుఃఖైర్గర్భేణాస్మి యయా ధృతః |
తస్యా నిష్ఫలయత్నాయాః క్వాహం మాతుః క్వ సా మమ? ||

ఏ తల్లి మహనీయమైన అపేక్షతో, దుఃఖంతో నన్ను గర్భంలో దాల్చిందో,  నిష్ఫలప్రయత్నం చేసిన ఆ తల్లికి నేనెలా కొడుకునవుతాను?

ఒక తల్లిని అంతగా బాధపెట్టి, గర్భం ద్వారా బయటపడి, ఆ తల్లి మరణానికి కారణమైన ’ఈ జన్మ’ ఎందుకని ధ్వనిస్తుంది గౌతముని మాట. చాలా తీవ్రమైన, నిర్వేదమైన మాట ఇది. ఇది బహుశా మహాకవి అశ్వఘోషుని స్వీయఘోష కూడా కావచ్చు. 

పైని పలుకుల్లో తల్లి తాలూకు అపేక్ష (తృష్ణ) కూడా మహా ఆర్ద్రంగా ధ్వనిస్తుంది. షోపెన్ హూవర్ అనే ఆంగ్ల తాత్వికుడు తృష్ణ Will To live  అన్న మాటకు చెప్పిన నిర్వచనం ఇది.

తృష్ణ = Irrational, senseless, meaningless, directionless, purposeless, ever hungry, blind striving, restless, self-destructive, omnipotent universal energy is called 'will to live'.  

అశ్వఘోషుడు ఆ నాడు గౌతముని నోట పలికించిన మరొకమాట ఆధునిక మహాతాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి "Death" అనే ఒక ప్రవచనపు సారాన్ని స్ఫురింపజేస్తుంది.

సహజేన వియుజ్యన్తే పూర్ణరాగేణ పాదపాః |
అన్యేనాన్యస్య విశ్లేషః కిం న పునర్న భవిష్యతి||

తరువులు పండిపోయి ఎర్రనైన ఆకులను సహజంగా కోల్పోతాయి. ఇలా సహజంగా ఒకరికి మరొకరికీ మధ్య వియోగం మానవులలో ఎందుకు జరుగదు?

Why can't human beings dye with dignity like those red leaves? - Krishnaji

ఇతి తస్య వచః శృత్వా కంథకస్తురగోత్తమః |
జిహ్వయా లేలిహే పాదౌ బాష్పముష్ణాం ముమోచ చ||

అతని మాటలను విన్న కంథకమన్న ఆ అశ్వరాజం తన నాలుకతో గౌతముని పాదాలను నాకింది. ఆపైన వేడి కన్నీటి బొట్లను విడచింది.

జాలినా స్వస్తికాంకేన చక్రమధ్యేన పాణినా |
ఆమమర్శ కుమారస్తం బభాషే చ వయస్యవత్ ||

జాలితో స్వస్తి, చక్రము వంటి చిహ్నాలున్న కరతలంతో గౌతమకుమారుడు దానిని నిమిరాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దానితో మాట్లాడినాడు.

ఆపై గౌతముడు రాజోచితమైన దుస్తులు విడిచి కాషాయవస్త్రాలు తొడుగుకొని అరణ్యమార్గమనుసరించి పోయినాడు.

*********

అశ్వఘోషుని బుద్ధచరిత కావ్యం వాల్మీకి రామాయణ శైలిలో ఉంటుంది. ఈ కావ్యం కేవలం హృదయస్పర్శ. ధ్వని, వక్రోక్తి, వంటి కొలమానాలు చిన్నబోయిన మహత్తరమైన కవితాస్రవంతి.             

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు