వీచిక - 9





ఈతడేమో నరుడు. ఆతడు నరుణ్ణి కిరాతరూపంలో పరీక్షిస్తున్న నటుడు. నరుడికీ, నటుడికీ మధ్య హిమగిరి సానువులలో, ఘోరమైన మల్లయుద్ధం జరుగుతూంది. అర్జునః - అంటే సంస్కృతంలో తెల్లని వాడని అర్థం.  వేలుపు కూడా వెండివన్నె వాడే. వారిద్దరికి మధ్య వెండికొండల మధ్య యుద్ధం.

వాళ్ళిద్దరి ముష్టిఘాతాల శబ్దం పగులుతున్న బండరాళ్ళశబ్దం ఆ పర్వతసానువులలో మారుమ్రోగుతోంది. పార్థుని కరఘాతాలు శూలిని ఏమీ చేయలేకపోతున్నాయి. సముద్రపు అలలు వింధ్యపర్వతాన్ని తాకినట్టుగా. ఆ నేపథ్యంలో -

ఉమాపతి ఫల్గుణుని రెండు భుజాలపై ఒకేసారి కొట్టిన దెబ్బకు ఈతడు తూలి, పది అడుగుల వెనక్కు వెళ్ళిపడ్డాడు.  మహా రోషంతో, పరాక్రమంతో లేచి మౌళి భుజాలను బలంగా పట్టుకున్నాడు. ఇద్దరూ భూమిపై దొరలుతున్నారు. దేవగణం ఈ యుద్ధాన్ని విస్మయపడుతూ చూస్తున్నది.

ఆపై పైకి లేచిన మహేశ్వరుడు జబ్బలు చరిచి, సింహనాదం చేసి పైకెగిరాడు.

వియతి వేగపరిప్లుతమంతరా
సమభిసృత్య రయేణ కపిధ్వజః |
చరణయోశ్చరణానమితక్షితిః
నిజగృహే తిసృణాం జయినం పురామ్ ||

వియతి = ఆకాశానికి
వేగపరిప్లుతం = వేగంగా కుప్పించి ఎగసిన
తిసృణాం పురాం జయినమ్ = త్రిపురాంతకుని ఈశ్వరుని
చరణయోః = పాదద్వయాన్ని
కపిధ్వజః = పాండవమధ్యముడు
చరణాన్ = పాదములతో
అనమితక్షితిః = నేలదిశగా త్రొక్కిపట్టి
రయేణ = వేగంగా
సమభిసృత్య = సమీపించి
నిజగృహే = పట్టుకొన్నాడు.

జబ్బలు చరిచి, సింహనాదం చేసి పైకెగిరిన శంకరుని చూచి, కిరీటి తానూ పాదాలతో నేలను త్రొక్కిపట్టి పైకెగిరాడు. పాండవమధ్యమునికి ఆయన పాదాలు మాత్రమే అందినాయి. వాటిని పట్టుకున్నాడు.

అప్పుడు పరమేశ్వరునికి గొప్ప సంతోషం కలిగిందట. తన కాళ్ళు పట్టుకుని నేలకు కొట్టాలన్న అర్జునుని తపన చూసి మహేశ్వరుడు కరగిపోయాడు. గాఢంగా ఆతణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.

తపసా తథా న ముదమస్య యయౌ
భగవాన్యథా విపులసత్వతయా |
గుణసంహతేః సమతిరిక్తమహో
నిజమేవ సత్త్వముపకారి సతామ్ ||

శివుడు పార్థుని తపస్సుకన్నా, పరాక్రమానికి సంతోషించాడట. సత్పురుషులకు, వారి సహజమైన సత్వమే, ఇతరగుణాలకన్నా మంచి ఉపకారమవుతుంది.

ఇదే భావాన్ని భర్తృహరి - ’క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే’ - అని ఉటంకిస్తాడు.

భారవి కిరాతార్జునీయంలో చివరి ఆశ్వాసపు ఘట్టం ఇది. భారవేరర్థగౌరవమ్ - అని అభాణకం. చాలా గొప్ప అర్థాన్ని క్లుప్తమైన మాటల్లో చెప్పగల కవి భారవి.

భగవంతుడు - మానవుని ప్రయత్నానికి, పరాక్రమానికి సంతోషించినట్టుగా పూజాదికాలకూ, తపస్సుకూ కూడా సంతోషించడట! తపస్సుకన్నా మానవప్రయత్నంలోని విశిష్టత్వం గొప్పదట.

విశేషమేమంటే - విజయుడు కూడా ధర్మయుద్ధం చేయడానికి అస్త్రశస్త్రాలను అనుగ్రహించమని మాత్రమే భగవంతుని కోరతాడు! మహేశ్వరుడు విజయునికి పాశుపతాస్త్రాన్ని, ఆ అస్త్రానికి చెందిన ధనుర్వేదాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు.

నిజానికి ఈ శ్లోకశకలం భారవి అర్థగౌరవానికి సరైన న్యాయం చేయదు. స్థాలీపులీకన్యాయాన ఇక్కడ ఒక చిన్న ఉటంకింపు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు