వీచిక - 8
ఏతన్మందవిపక్వతిందుకఫల శ్యామోదరాపాణ్డర
ప్రాంతం హంత! పుళిందసుందరకరస్పర్శక్షమం లక్ష్యతే ।
తత్ పల్లీపతిపుత్రి! కుఞ్జరకులం కుంభాభయాభ్యర్థనా
దీనం త్వామనునాథతే కుచయుగం పత్రావృతం మా కృథాః (పత్రాంశుకం మా పిధాః) ||
అదొక శబరుల గ్రామం. ఆ గ్రామాధికారి కూతురు బహుచక్కనైనది. పెళ్ళయింది (బహుశా కొత్తగా). పెళ్ళయినా కూడా ఆమె మీద మనసు చంపుకోలేని మరొక యువకుడు ఆమె సొగసులను చూడాలన్న కాంక్షతో నర్మగర్భంగా అంటున్నాడు.
పల్లె అధికారి కూతురా! బాగా మాగిన తిందుకఫలం లా (ఎరుపు ఛాయ కలిసిన) తెలుపు, మధ్యన నలుపు - రంగుల్లో ఉన్న నీ పయ్యెద శబరవీరుని చేతి స్పర్శకు అనువుగా ఉంది. అక్కడ ఆకులతో కప్పబోకు. (అప్పుడు మీ ఆయన దృష్టి అక్కడ లగ్నమవుతుంది. ఆయన వేటకు వెళ్ళడం మానేస్తాడు.) అప్పుడు మాకు క్షేమం అని అనుకొని ఏనుగులు తమ కుంభస్థలాలను రక్షించుకోవడం కోసం దీనంగా నిన్ను ప్రార్థిస్తున్నాయి.
ఆమె పయ్యెదను కప్పుకోకపోతే ఏనుగుల సంగతేమో కానీ ఈ రోమియోకు దర్శన లాభం అన్న మాట. అదే ఆ రోమియో గారి అసలైన ఉద్దేశ్యం.
కాస్త ఘాటైన ఈ శ్లోకాన్ని అలంకారికులు చాలామంది ఉటంకించారు. భావమూ, అర్థమూ, శబ్దమూ, సృజన ఒకదానితో ఒకటి పోటీ పడిన ముచ్చటైన శ్లోకం ఇది.
కుంతకుడు అనే లాక్షణికుడు లావణ్యమనే శబ్దగుణానికి ఉదాహరణగా దీనిని ఉటంకించాడు. లావణ్యమంటే - ప్రతి సంయోగాక్షరం ముందూ, హ్రస్వము ఉండటమన్నమాట.
ఈ క్రింద ఎరుపు రంగు అక్షరాలను గమనించండి. ఆ అక్షరాల తర్వాత సంయోగాక్షరాలు ఉన్నవి. ఈ ప్రయోగాల వలన శబ్దానికి ఒక విన్యాసం ఏర్పడుతోంది. ఈ శబ్దలక్షణాన్ని ఉదారత్వం అని జగన్నాథ పండితరాయలు పేర్కొంటాడు.
ఏతన్మందవిపక్వతిందుకఫల ....పుళిందసుందరకరస్పర్శ....లక్ష్యతే తత్ పల్లీపతిపుత్రి! కుఞ్జరకులం...
అంతే కాదు మంద-తిందుక, ప్రాంత-హంత, పుళింద-సుందర - ఇలా వర్ణాల ఆవృత్తి కూడా ఈ శ్లోకాన్ని అందగింపజేస్తోంది. దీన్ని అనుప్రాస అని కొందరు అంటే కుంతకుడు వర్ణవిన్యాసవక్రోక్తి అని పేర్కొన్నాడు.
జాగ్రత్తగా గమనిస్తే లావణ్య, ఉదారత్వ గుణాలు సంస్కృతసమాసాలలో కూడితే - ఆ రచన (పద్యం లేదా శ్లోకం) నోటికి త్వరగా వచ్చేస్తుంది. (సుధాసముద్రాంత రుద్యన్మణిద్వీపసంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబకాంతారవాసప్రియే....).
వచనంలో పై గుణాలను అందంగా పొహళింపజేసిన సంస్కృత కవి దండి.
పై గుణాలను జొప్పిస్తూ అదనంగా, శబ్దశ్లేషనూ, గాఢతనూ సమాసాలలో పొదిగిన మహా శబ్దశిల్పి భట్టబాణుడు.
శబ్దపరంగానే కాక, భావ పరంగానూ పై శ్లోకం మహా ముచ్చటైనది. రెండవ పాదంలో హంత! అన్న అవ్యయం - చెప్పే భావాన్ని ఎవరికి వారు ఊహించుకోవలసిందే. (హా! చచ్చిపోయాను! అన్న అర్థంలో)
ఈ శ్లోకం చక్కదనానికి మాత్రమే కాక కావ్యదోషాలలో కూడా చోటు చేసుకోవడం ఒక విశేషం. చివరి పాదంలో అనునాథతే - అన్న ప్రయోగం వ్యాకరణ దోషమని, నాథ శబ్దాన్ని ఆత్మనేపదిలో ఉపయోగించటం - చ్యుతసంస్కృతి అనే కావ్యదోషానికి నిదర్శనంగా మమ్మటభట్టారకుడు పేర్కొన్నాడు.
శబరయువతుల గురించీ, వారి సౌందర్యాన్ని గురించి వర్ణించడంలో తెలుగు, ప్రాకృత, సంస్కృత కవులు ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టు కనిపిస్తుంది. మన ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో వర్ణన ఇది.
భక్తకన్నప్ప - శివుని తన ఉడుమూరికి రమ్మని ప్రార్థిస్తాడు. వస్తే అందమైన అమ్మాయిలసేవ ఏర్పాటు చేస్తాడట.
తే||
చుఱుకుఁజూపునఁ గాలిన కొఱఁత నుఱుకు
నుఱుకుఁ జూపులఁ బుట్టించు నెఱుకు వారి
ఇఱుకు వలిగుబ్బపాలిండ్ల యిగురుఁబోండ్ల
సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్య.
(౩-౭౧)
గాథాసప్తశతిలో కూడా శబరకాంతల వర్ణనల విషయంలో ఏ మాత్రమూ తగ్గలేదు. ఈ శబరకాంతలు రమణీయచిత్రకారుడు వడ్డాది పాపయ్య చేతిలో ఎంత అందంగా రూపుదిద్దుకున్నారో బొమ్మలో చూడండి!
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి