సంగ్రహంగా అనుమితివాదం - చర్చ
శబ్దమూ, అర్థమూ. అనిమితివాదమూ కొంత పరామర్శ.
వాక్కు ఎలా జనిస్తుంది? - ఈ విషయాన్ని నిరూపించడానికి సంస్కృతంలో "స్ఫోట" సిద్ధాంతం అని ఒకటి ఉన్నది. వాక్కునకు - పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ అని నాలుగు రూపాలు. "పరా" అన్న రూపం మూలాధార చక్రంలో అదృశ్యమైన జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. వాక్కు నకు మూలకారణమైన శక్తి రూపం "పరా". ఇది విష్ణు స్వరూపమని భావిస్తారు. ఈ "పరా" అనే వాగ్రూపం ప్రేరితమై హృదయానికి చేరి (పశ్యన్తీ అన్న) వాయురూపం పొంది, ఆ వాయువు గొంతుకు చేరి (మధ్యమ రూపం పొంది), ఆ గాలి తాలూకు పీడనం, గొంతు, నోటిలోపలి పలుభాగాలలో తగులడం వలన వైఖరి అన్న రూపంలో పరివర్తిస్తుంది. అలా బయటకు వెలువడిన వాక్కు ను "శబ్దం" అంటారు. ఇదీ సిద్ధాంతం.
ఈ స్ఫోట సిద్ధాంతాన్ని బౌద్ధులు అంగీకరించరు. నైయాయికులున్నూ అంగీకరించరు.
భాషలో ఒక శబ్దానికి అర్థం - అభిధ, లక్షణ, వ్యంగ్య రూపాలలో ఉంటుంది అని లాక్షణికులు.(ముఖ్యంగా మీమాంసకులు అనబడే శాస్త్రానికి చెందిన వారు.)
***************
అభిధ - అంటే చిహ్నం, లేదా సంకేతం.
తెలుపు - అంటే ఒక రంగు.
సింహము - ఒక జాతికి చెందిన జంతువు,
రాముడు - ఒక వ్యక్తికి పేరు.
వంట - తినడానికి అనువుగా పదార్థాలను తయారు చేసుకునే ప్రక్రియ.
ఇలా అభిధ - జాతి, గుణ, క్రియ, చిహ్నాత్మకంగా ఉంటుంది.
***************
లక్షణము అన్న అర్థ రూపం - కొన్ని సార్లు ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు లేదా, ముఖ్యార్థానికి సంబంధించిన విషయాన్ని చెప్పదల్చుకున్నప్పుడు లక్షణ అన్న అర్థ రూపం ఏర్పడుతుంది.
ఉదాహరణకు - "గంగాయాం ఘోషః" అని ఒక ఉదాహరణ. "గంగలో ఘోష". ఘోష అనేది ఒక పల్లె. ఈ పల్లె గంగ ఒడ్డున ఉన్నది. "గంగలో ఘోష" - అంటే ఆ మాటకు అర్థం లేదు. ఇక్కడ "గంగలో ఘోష" అనే ముఖ్యార్థం కుదరకపోయినా, ఆ గంగానది సంబంధంతో మరొక అర్థం ఊహించడానికి వీలవుతోంది.. గంగ అనే నది తాలూకు ఒడ్డు అనే లక్షణాన్ని "గంగలో" అన్న మాటలో ఆరోపించుకుని, "గంగ ఒడ్డున ఉన్న ఘోష అనే పల్లెటూరు" అన్న ముఖ్యార్థసంబంధమైన అర్థాన్ని చెప్పుకుంటాం.
అలాగే ముఖ్యార్థబాధకు "గౌర్వాహీకః" అని ఉదాహరణ. వాహిక దేశమంటే నేటి పంజాబ్ ప్రాంతం. వాహీకః - అంటే ఆ ప్రాంతపు మనిషి. గౌర్వాహీకః - అంటే "పంజాబ్ ప్రాంతపు వాడు పశువు" - ఇది అర్థం. (మన సర్దార్జీల మీద జోకులు ఎనిమిదవ శతాబ్దానికి ముందే ఉన్నాయి).
ఈ అర్థం ఎలా వచ్చింది అంటే - "వాహీకః గౌః" - "పంజాబు వాడు పశువు" అన్న ముఖ్యార్థం సూటిగా ఆలోచిస్తే మనిషి బుర్రకు దొరకదు కనుక. అంటే ముఖ్యార్థానికి బాధ కలిగింది కాబట్టి గోవు లక్షణమైన జడత్వానికి, ఆ ప్రాంతపు వాడి స్వభావానికి సామ్యాన్ని ఆరోపించుకుని, ఈ మాటకు లక్షణార్థాన్ని సాధించుకోవాలి. ఇలా ముఖ్యార్థబాధ కలిగినప్పుడు అర్థాంతరం సంభవిస్తుంది అన్న మాట.
లక్షణలో చివరగా - శబ్దానికి రూఢి అన్న అర్థరూపమూ ఉంది. దీనికి ఉదాహరణ "కుశలః" - ఈ మాటకు "కుశాన్ లాతి ఇతి కుశలః" అని వ్యుత్పత్తి. అంటే "దర్భలను నేర్పుగా వేలికి దెబ్బ తగిలించుకోకండా తెచ్చే వాడు" అని అర్థం. కానీ ఈ శబ్దం చాలా యేళ్ళుగా ప్రజల నోళ్ళలో నాని, కుశలం అంటే క్షేమం అన్న రూఢి అర్థాన్ని పొందింది. అంటే శబ్దానికి రూఢి అనేది ఒక అర్థరూపం.
***************
శబ్దానికి మూడవ రూపం వ్యంగ్యం - ఇది చాలా సులభం. "ఒరే బాబూ, తలుపెయ్యి. ఇంట్లో పిల్లి దూరుతుందీ.." అమ్మ కేక వేసింది. బాబు బయట కుక్క ఇంటిలోపలికి వస్తూంటే తరిమాడు.
అమ్మ "పిల్లి" గురించే కదా అంది, బాబు కుక్కను కూడా ఎందుకు అదిలించాడు?
శబ్దానికి వ్యంగ్యం అనే అర్థభేదం ఉంది. శబ్దమునకు "ఉపసర్జనత్వము" - అనేది ఒకటుంటుంది అట.ఉపసర్జనత్వం - అంటే గుణము అని స్థూలంగా మీనింగు. ఈ "ఉపసర్జనీకృతత్వం" అనే మాట ఆధారంగా "ధ్వని" అనే సిద్ధాంతాన్ని నిర్మిస్తాడు - ఆనందవర్ధనుడనే ఒక లాక్షణికుడు.
***************
పైన మాటలన్నీ ముందు మాటలు. నిజమైన కథ ఇప్పుడు మొదలవుతుంది. మహిమభట్టు అనే నైయాయికుడు - శబ్దానికి అభిధ అన్న శక్తి మాత్రమే ఉంటుందని బల్ల విరగ్గొట్టి వాదిస్తాడు.
ఈయన వాదమేమంటే - మనిషి బుర్రకు ఒక ప్రత్యేక స్వభావముంది. దాని పేరు అనుమానం. ఒక చోట పొగ కనబడితే అక్కడ "అగ్గి" రాజుకుని ఉందని ప్రత్యేకంగా చెప్పకపోయినా మనిషి గ్రహించగలడు. ఏ శబ్దం తాలూకు అర్థమైనా మనిషిలో కలిగే అనుమానమనే స్వభావానికి లోబడి ఉంటుంది. అంటే శబ్దానికి - అభిధ అనే సంకేతమాత్రమైన అర్థరూపమే ఉంటుంది తప్ప, లక్షణ (ముఖ్యార్థబాధ, ముఖ్యార్థ సంబంధం, రూఢి), వ్యంగ్యము అనే భిన్న రూపాలుండవు. - శబ్దః పునః స్వార్థాభిధానమాత్రవ్యాపారపర్యవసితసామర్థ్యః. శబ్దము - అభిధ అనే వ్యాపారంలో మాత్రమే పర్యవసానం చెందగలిగే సామర్థ్యం కల ఒక entity. That's all.
"తెలుపు" అన్న మాటకు గుణసూచకమైన ఒక రంగు - అన్న అర్థం మాత్రం ఉంది. తెలుపు అన్న మాట అనగానే ఎదుటి వానికి "అదొక గుణవాచకం" అని అర్థమవుతుంది. అంతటితో ఆ శబ్దం నశిస్తుంది. ఖేల్ ఖతమ్. ఆ తర్వాత మనిషి కి తట్టే ఇతర జ్ఞానం అనే బిజినెస్సు అంతా అనుమేయమే.
అలాగే "గౌర్వాహీకః" అన్న ప్పుడు "వాహికదేశస్థుడు గోవు" అని అభిధా జ్ఞానం మనిషికి కలుగుతుంది. అంతటితో ఆ శబ్దం తన పని ముగించుకుని రిటైర్ అయిపోయింది.
గోత్వ ఆరోపేణ వాహీకే తత్సామ్యం అనుమీయతే |
కో హి అతస్మిన్న తత్తుల్యే తత్త్వం వ్యపదిశేత్ బుధః ||
వాహీకుని మీద "గోత్వము" ఆరోపణ చేయడం వల్ల, "గోవు ఒక పశువు" అనే సామ్యగుణము అనుమేయం అవుతున్నది. (అంటే అనిమానించడానికి కుదురుతూ ఉంది). ఏ బుద్ధిమంతుడూ గోవు కాని దాన్ని గోవు అని మామూలుగా వ్యవహారంలో చెప్పడు. అలా చెపుతున్నాడంటే "ఎందుకూ" అన్న అనుమానం లోనే ఆ మాట కు అర్థం వెతుక్కునే అవకాశం దొరుకుతుంది.
ఒక్క మాటపై మరొకటి ఆరోపించేప్పుడు సాదృశ్యమొక్కటే నిమిత్తం కాదు. తత్సంబంధము కూడా నిమిత్తమవుతుంది.
ఇదే విధంగా "గంగాయాం ఘోషః" కు కూడా సుదీర్ఘమైన వాదంతో, ఆ శబ్దానికి అర్థం మనిషి బుద్ధి స్వరూపమైన అనుమానంలో అంతర్గతమవుతుందని మహిమభట్టు వాదిస్తాడు. అక్కడ ఒక ఉదాహరణ కూడా చెబుతాడు. " విషమైనా తిను, కానీ వాళ్ళింట్లో భోంచెయ్యకు". - ఈ మాట విన్నవాడు విషమైనా తిను - అనగానే ఎగవేసుకుంటూ విషం తినడానికి ఉద్యుక్తుడవడు. ఆ తర్వాతి మాట "వాళ్ళింట్లో భోంచెయ్యకు" అన్న దానికి అందుకు పూర్వభాగమైన "విషమైన తిను కానీ" మాట అర్థాన్నీ అనుసంధానించుకుని అనుమాన ప్రమాణంతో అసలైన వ్యుత్పత్తిని సాధిస్తాడు. ఏతావతా శబ్దానికి "లక్షణ. వ్యంగ్యము" అనే అర్థాంతరాలు లేవు. ఆ రెండున్నూ అర్థలక్షణాలు కావు. మనిషికి "వివేకము" అన్నది భగవద్దత్తమై ఉన్నది. అది అనుమానాన్ని రగల్చడం వల్ల అర్థభేదాలు కలుగుతున్నై. శబ్దం నశ్వరమైనది. దాని యోగ్యత అది వినబడి అభిధను వెలిబర్చే వరకే.
చూడ్డానికి ఏదో శబ్దమూ, అర్థమూ అని పైపై మాటలుగా కనబడినా దీనివెనుక అద్భుతమైన తాత్వికత, బుద్ధ బోధ, అష్టావక్ర సంహిత, జిడ్డు కృష్ణమూర్తి చింతనా సూచనామాత్రంగా కానవస్తాయి.
**********************
చివరగా -
శబ్దానికి అభిధ మాత్రమే ఉంటుంది. సరే ఒప్పుకుంటాము. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. "ఒక బాణాన్ని ఆకర్ణాంతమూ లాగి వదిలాం. అది లక్ష్యాన్ని తాకింది, భేదించింది, ఛేదించింది, ఆ లక్ష్యం (శత్రువు) తాలూకు ప్రాణాన్ని తీసింది."
వేసిన బాణమొకటే. అయితే చేసిన పనులు మూడు. లేదా నాలుగు.
౧. బాణం మొదట శత్రువు కవచాన్ని తాకి, దాన్ని చీల్చింది.
౨. ఆ పై కవచం వెనకాల నున్న గుండెలోకి దూసుకెళ్ళి, ఆ గుండెను చీల్చింది.
౩. గుండెను పగలగొట్టడంతో, ఆ గుండె చేసే పని మీద ఆధారపడే శరీరం నిర్జీవమయ్యింది.
ఈ మూడు పనులు సూక్ష్మమైన కాలవ్యవధిలో జరిగినై. ఇప్పుడు బాణాన్ని శబ్దమనుకో. శబ్దానికి "అభిధ" అనే శక్తి ఒకటే ఉన్నట్టు బాణానికి ఎదుటి లక్ష్యానికి తాకడం ఒకటే శక్తి. అయితే పనులు మాత్రం మూడవుతున్నాయి. అలాగే శబ్దానికి అభిధ మాత్రమే శక్తి అయినా లక్షణ, వ్యంగ్యము అనే అర్థాంతరాలు సంభావ్యము.
పై వాదన భట్టలోల్లటునిది. (దురదృష్టం కొద్దీ భట్టలోల్లటుని లక్షణగ్రంథం నేడు దొరకదు. అయితే వ్యక్తివివేకం లోని ఒక శకలం ఇది). ఈయన వాదానికి "దీర్ఘదీర్ఘతర వ్యాపారసూత్ర"మని పేరు.
మహిమ భట్టు దీనినీ నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు. మనమూ ఆలోచిస్తే ఖండించవచ్చు. పై వాదనలో లొసుగులు గుర్తించటం సులభసాధ్యమే.
చివర్న మహిమభట్టు అంటాడు - "మీ నాన్న నిన్ను కొట్టులో కూర్చోబెట్టాడు. ఒరే కొడకా! కాస్త వ్యాపారం చూస్తా ఉండు, ఇప్పుడే మూలశంకకెళ్ళి వస్తా. అని. నువ్వు ’కొట్టు నాదే’ అంటే ఎలా ఉంటుంది?" పైన బాణాల వాదమూ వాదమూ అలాంటిదే బ్రదరూ! cool.
మహిమభట్టు అనుమితివాదం ఒక అద్భుతం. తవ్వే కొద్దీ బయటబడే మంచినీళ్ళ ఊటబావి.
*********
కామేశ్వరరావు గారి సందేహాలు:
1. అనుమేయం ద్వారానే అయినా (శబ్దశక్తి ద్వారా కాకపోయినా) - శబ్దానికి లక్ష్యార్థమూ, వ్యంగ్యార్థమూ అనేవి కలుగుతాయని మహిమభట్టు ఒప్పుకొన్నాడా?
2. పదిగంటలకి నిద్రలేచిన ఒకడితో, "ఇవాళ చాలా తొందరగా నిద్రలేచావే" అని అన్నామనుకోండి. దాని లక్ష్యార్థం "నువ్వు చాలా ఆలస్యంగా నిద్ర లేచావు" అని కదా. ఈ లక్ష్యార్థం అనుమేయమే అనుకుందాం. అలా అయినా - మొదటి వాక్యమూ రెండవ వాక్యమూ, వినేవారిలో కచ్చితంగా ఒకే భావాన్ని స్ఫురించవు అన్నది స్పష్టమే. మొదటి వాక్యంలో ఉన్న ఎత్తిపొడుపు, హేళన, రెండవ వాక్యంలో లేవు. మొదటి వాక్యం ఇస్తున్న ఎత్తిపొడుపు, హేళన అనే భావాన్ని అనుమానం ద్వారానే సాధించగలమా? దానికి శబ్దంతో సంబంధం లేదా?
3. "అయమైంద్రీముఖం పశ్య రక్తశ్చుంబతి చంద్రమాః" అనే సమాసోక్తి ఉదాహరణలో ఉన్న అప్రస్తుతార్థం అనుమానం ద్వారా ఎలా సాధిస్తాం?
***********
సమాధానాలు, చర్చ:
పైని మూడు ప్రశ్నల్లో దాక్కున్న కామన్ విషయమేమంటే - ఒక విషయంపైన అనుమానం కలుగడానికి Factual bases ఏవి? అని. "ధూమవదగ్నిః" - పొగ ఉంది కాబట్టి నిప్పు - అని చెప్పడానికి "నిప్పు అనే లోకప్రసిద్ధమైన భౌతిక వస్తువు పొగను వ్యాపింపజేస్తుంద"న్న సైన్సు యొక్క చక్షుప్రమాణాంతర్గత నిజం ఆధారం. అలా సైన్సు కాకుండా, వేదప్రాతిపదికం, ఇంకొకటి,
ఇలా రెండు మూడు bases మహిమభట్టు ప్రతిపాదిస్తాడు. అది వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం పైని ప్రశ్నలు ఒక్కొక్కటిని చూద్దాం.
౧. ఒప్పుకుంటాడు. అతనికి చమత్కారంగా (ధ్వనియుతంగా) చెబితే కావ్యం శోభస్కరంగా ఉంటుంది అన్న మాటతో విభేదం లేదు. ఎటొచ్చీ, లక్షణ, వ్యంగ్యాలు అర్థరూపాలంటే శివాలెత్తుతాడు. :)
ఈయన చివరి కంక్లూజన్ ఇది.
వాచ్యస్తదనుమితో వా యత్రార్థోऽర్థాంతరం ప్రకాశయతి |
సంబంధతః కుతశ్చిత్ సా కావ్యానుమితిరిత్యుక్తా ||
౨. ఇక్కడి ఉదాహరణ - "ధ్వని" కాదు.
"ఇవాళ చాలా తొందరగా నిద్ర లేచావే" - ఇక్కడ కాకువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతీ రోజు పదివరకూ నిద్రపోయే అభినవకుంభకర్ణుని దగ్గర ఒక సాధారణ స్వరంతో ఈ మాట అంటే వాడు విని ఆవులించి తిరిగి నిద్రపోతాడు కదా. :). ఒక మామూలు మనిషి వద్ద "లేచావే" అన్న మాట ఎం. ఎస్. నారాయణ టోన్ లో చెబితేనే అక్కడ "నువ్వు చాలా ఆలస్యంగా నిద్ర లేచావు" అనే అర్థాంతరం వస్తుంది.
ఏతావతా - ఇది కాక్వాక్షిప్తం కాబట్టి - గుణీభూతవ్యంగ్యం. గుణీభూతవ్యంగ్యాలలో ఎనిమిది "అగూఢం, అపరస్యాంగం, ...కాక్వాక్షిప్తమసుందరమ్" వగైరా వగైరా లలో ఏడవ రకం.
ఇది స్వరాన్ని బట్టి అనుమేయం అనడంలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు. (క్వాక్వాక్షిప్తానికి "మథ్నామి కౌరవశతం...అన్న వేణీసంహారంలోని శ్లోకం ఉదాహరణగా ధ్వనిలోనూ, ఖండనలోనూ ఉన్నట్టు గుర్తు.)
౩.
అయం ఐంద్రీముఖం పశ్య రక్తః చుంబతి చంద్రమాః
(ఆ తూరుపు దిక్కు ఆరంభం చూడవోయ్, ఎరుపెక్కిన చంద్రుడు ముద్దు పెట్టుకుంటున్నాడు)
(ఆ అప్సరవదనాన్ని చూడవోయ్, కైపెక్కిన ఆ అబ్బాయి (చంద్రుడు) ముద్దాడుతున్నాడు)
రెండు అర్థాలూ సమానంగా చమత్కారంగా ఉన్నాయి, పైగా రెండూ వాచ్యాలే కాబట్టి ఇది సమాసోక్తి. ప్రకృతార్థం సాధారణంగా, అప్రకృతార్థం వ్యంగ్యంగా ఉంటే అది "ధ్వని".
సమాసోక్తి, పర్యాయోక్తి అలంకారాలు - ధ్వని కిందికి రావు.(మీకు తెలిసే ఉంటుంది) మహిమభట్టు "ధ్వని" - అనుమేయం అవుతుందన్నాడు కాబట్టి, సమాసోక్తికి ప్రత్యేకమైన వివరణ అక్కర్లేదు. ఇందాక ఉదాహరణలో వచ్చిన రెండు అర్థాలూ "అభిధ" వలననే పాఠకునికి తెలుస్తున్నాయి.
ఐంద్రీముఖం = అంటే ఇంద్రుడు దిక్పాలకుడుగా గల తూరుపు ముఖము
అన్నా
ఐంద్రీముఖం = ఇంద్రసంబంధిత స్త్రీ తాలూకు వదనం
అన్నా
రెండూ అభిధ కు చెందిన రూపాలే.
ఎక్కడ అర్థం అనుమేయం అవుతుంది అనడానికి "ధ్వని" ఉదాహరణ తీసుకుందాం.
ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ |
లీలాకమలపత్త్రాణి గణయామాస పార్వతీ ||
పెద్దలు పెళ్ళిసంబంధం మాట్లాడుతుంటే ఆ పక్కన నిలబడి అమ్మాయి చేతిలో ఉన్న "తామర పువ్వు రేకులు లెక్కెడుతోంది".
ఇక్కడ తామర రేకులు లెక్కెట్టడం - అన్న "అభిధ" అర్థం - సందర్భానికి తగినట్టు లేదు. అలా మామూలు మనుషులు మామూలు సందర్భాలలో లెక్కెట్టరు. అలా లెక్కెడుతోంది అంటే - ఆ చేస్తున్న పనికి "ఏదో ఇతర" వ్యవహారార్థం ఉండాలి. ఆ అర్థం - అనుమేయం. అనుమానం ఏ సందర్భాలలో కలుగుతుంది? ఆ అనుమానం కలిగితే దానికి గల Factual base ను ఎక్కడ వెతుక్కోవాలి? దీనికి మహిమభట్టు నాలుగైదు Factual bases ను చెప్పి, ఉదాహరణలు చెప్పాడు.
ఇక పోతే ఏది ప్రస్తుతార్థం, ఏది అప్రస్తుతార్థం - ఇది ప్రకరణాన్ని బట్టి ఉంటుందని మహిమభట్టు ఉవాచ. పైన రెండు అర్థాలూ "సమాన" చమత్కారంతో ఉన్నాయి. ఒక అర్థం - "ప్రస్తుతార్థం" అని విస్పష్టంగా చెప్పడానికి ఉన్న మూలకారణం బలహీనమైనది. ఆ మూలకారణానికి హేతువు మహిమభట్టు దృష్టిలో వేరు.
********************
కామేశ్వరరావు గారి ఆలోచనలు:
2. "ఇవాళ చాలా తొందరగా నిద్ర లేచావే" - ప్రస్తుతానికి, "స్వరాన్ని"బట్టి మాత్రమే దానికి వ్యంగ్యార్థం వస్తుందని అనుకొందాం. అప్పుడు ఆ స్వరానికి నేరుగా ఆ వ్యంగ్యభావాన్ని సూచించే శక్తి ఉందని అనుకోవాలి. అక్కడ "అనుమానం" ప్రసక్తి ఎందుకు? ఎలా అయితే ఒక శబ్దం లోకప్రయోగంలో ఒక అర్థాన్ని (వాచ్యార్థాన్ని) యిస్తుందో, అదే విధంగా ఆ "స్వరం" లోకప్రయోగంలో ఆ ఎగతాళిభావాన్ని మనసులో కలిగిస్తోంది అనడం సబబు కాదా?
ఇక, ఆ వాక్యానికి వస్తున్న వ్యంగ్యార్థం "స్వరం" వల్లనే కలుగుతోందా అన్నది ఆలోచిద్దాం. అదే నిజమైతే "నువ్వు చాలా ఆలస్యంగా నిద్ర లేచావు" అన్న వాక్యాన్ని కూడా అలాంటి స్వరంలో పలికితే ఆ ఎగతాళి భావం కలగాలి. కాని అది సాధ్యం కాదు కదా. అయితే గియితే స్వరం ద్వారా ఆ వాక్యానికి కోపభావాన్ని కలిగించవచ్చు. లేదా ఈసడింపు కలిగించవచ్చు. కాని ఎగతాళి సాధ్యం కాదు. ఎగతాళి భావాన్ని కలిగించడానికి, వ్యతిరేక భావాన్నిచ్చే ఆ వాక్యం అవసరం. కాబట్టి శబ్ద ప్రమేయం ఉంది. ఇక, ఒక నవల్లో ఇదే వాక్యం ఉంటే, అప్పుడక్కడ "స్వరం" ప్రసక్తే ఉండదు కదా? అక్కడ కేవలం యీ శబ్దమే ఆ కాకుస్వరాన్నీ, దాని నుండి వచ్చే వ్యంగ్యాన్నీ ప్రతీయమానం చేయడం లేదా?
3. ఇక్కడ ఉన్నది ధ్వని కాదని నాకు తెలుసు. కాని సమాసోక్తిలో అప్రకృతార్థం వ్యంగ్యమని తెలుగు కావ్యప్రకాశంలో పుల్లెలవారు చెప్పారు (సమాసోక్తి అలంకారం గురించి చెప్పేటప్పుడు).
అప్రకృతార్థం వ్యంగ్యమే అయినా ప్రకృతార్థాన్ని అలంకరించడమే దాని ప్రయోజనం కాబట్టి అది గుణీభూతవ్యంగ్యం. శ్లేషలో రెండు సమానార్థాలూ వాచ్యార్థాలే అవుతాయి. అందువల్ల సమాసోక్తిలో స్ఫురించే వ్యంగార్థం ఏ విధంగా ప్రకృతార్థం నుండి అనుమానింపబడవచ్చు (శ్లేషకు భిన్నంగా) అన్న విషయమై మరికొంత వివరణ అవసరం అనుకొంటాను.
4. ఇప్పుడు మీరిచ్చిన "ధ్వని" ఉదాహరణ తీసుకొందాం. "తామర పువ్వు రేకులు లెక్కెడుతోంది" అన్నదానినుండి సాధించగలిగే అనుమేయార్థం ఏమిటి? "ఆ అమ్మాయి సిగ్గుపడుతోంది" అని.
అయితే:
"పెద్దలు పెళ్ళిసంబంధం మాట్లాడుతుంటే ఆ పక్కన నిలబడి అమ్మాయి చేతిలో ఉన్న తామర పువ్వు రేకులు లెక్కెడుతోంది" అనే వాక్యమూ "పెద్దలు పెళ్ళిసంబంధం మాట్లాడుతుంటే ఆ పక్కన నిలబడి అమ్మాయి సిగ్గుపడుతోంది" అనే వాక్యమూ ఒకే భావాన్ని పాఠకునిలో కలిగిస్తున్నాయా? మొదటి వాక్యంలో ఒక అధికమైన "చమత్కారం" ఉన్నది కదా? ఆ "చమత్కార" స్వరూపం ఏమిటి? అది దేనివల్ల కలుగుతోంది?
****************
సమాధానాలు, చర్చ:
౩. అనుమితి వాదం - అంటే "వాచ్యార్థం" తాలూకు "అర్థాంతరం" అనుమానంలో అంతర్భూతమని అండి. సమాసోక్తిలో రెండూ వాచ్యార్థాలయినప్పుడు, అర్థాంతరం అనేదే అంగీకరించనప్పుడు ఒక వాచ్యార్థం నుండి మరొక వాచ్యార్థం అనుమేయం అన్న ప్రశ్న రాదు.
ఇంకా వివరంగా సమాధానం మహిమభట్టు చెప్పాడు. అది వివరించాలంటే "ఉపసర్జనీకృతత్వం" దగ్గర మొదలవాలి. ప్రకృతార్థం, అప్రకృతార్థం మధ్య ఉన్న సంబంధం ధ్వనివాది దృష్టిలో ఎలా ఉంటుంది? అనుమితి వాదిలో ఎలా ఉంటుంది సూక్ష్మంగా గమనించాలి.
4. మొదటి భావం ఎక్కువ చమత్కార భరితం, నిస్సందేహంగా. ఆ చమత్కారం శబ్దశక్తిదా? లేక మనిషి మెదడులో కలిగే మరేదో "ప్రాసెస్" వల్ల వస్తుందా అన్నది ధ్వని, అనుమితి వాదాల మధ్య పాయింటు. కరెక్టేనా? ఇక్కడ అంగీకారం కుదిరితే ముందుకు పోవచ్చు.
**************
కామేశ్వర్రావు గారి వివరణ:
౩. "సమాసోక్తిలో రెండూ వాచ్యార్థాలయినప్పుడు" - సమాసోక్తిలో ప్రకృతార్థం వాచ్యమని, అప్రకృతార్థం వ్యంగ్యమని పుల్లెలవారి తెలుగు కావ్యప్రకాశంలో ఉంది. కాదు రెండూ వాచ్యార్థాలేనని మహిమభట్టు వాదమా? అలా అయితే మౌలికంగా అక్కడ వాచ్య వ్యంగ్యార్థాల అవగాహనలోనే తేడా ఉందన్నమాట.
4. "ఆ చమత్కారం శబ్దశక్తిదా? లేక మనిషి మెదడులో కలిగే మరేదో "ప్రాసెస్" వల్ల వస్తుందా అన్నది ధ్వని, అనుమితి వాదాల మధ్య పాయింటు. కరెక్టేనా?"
నాకున్న మొదటి ప్రశ్న:
i). "పెద్దలు... అమ్మాయి చేతిలో ఉన్న తామర పువ్వు రేకులు లెక్కెడుతోంది" - ఈ వాక్యంలోని వాచ్యార్థం
ii). "పెద్దలు... అమ్మాయి సిగ్గుపడుతోంది" - ఈ వాక్యంలోని వాచ్యార్థం
iii). మొదటి వాక్యంలో స్ఫురిస్తున్న చమత్కారం
పై మూడిటి మధ్య ఉన్న తేడాని మహిమభట్టు గుర్తించాడా/అంగీకరించాడా?
ఆ తర్వాత ప్రశ్న, ఆ చమత్కారం శబ్దశక్తి అవునా కాదా అన్న అంశం పక్కనపెట్టి, మహిమభట్టు ప్రకారం, అది ఏ రకంగా జనిస్తోంది?
***********
పై ప్రశ్నలకు సమాధానంగా శబ్దార్థాల ఉపసర్జనత్వం, వివరణా...
వాచ్యార్థమూ, వ్యంగ్యార్థమూ అంటే ఏమిటి? అనుమితి ద్వారా ఆ "రెండవ" అర్థాన్ని సాధించటం అవుతుందా? అసలు "ప్రతీయమాన" అర్థం అనేది అక్కడ ఉంటుందా? కొంచెం వివరంగా చూద్దాం.
మొదటగా ఆనందవర్ధనుడు నిర్వచించిన "ధ్వని" -
యత్రార్థః శబ్దో వా తమర్థం "ఉపసర్జనీకృత స్వార్థౌ",|
వ్యఙ్క్తః కావ్యవిశేషః స ధ్వనిరితి సూరిభిః కథితః ||
యత్ర = ఏ కావ్యములో
అర్థః వా = అర్థము కానీ, (శబ్దమును వహించిన అర్థము కానీ)
శబ్దః వా = శబ్దము కానీ (అర్థముని వహించిన శబ్దము కానీ)
ఉపసర్జనీకృత స్వ అర్థౌ = అర్థము తననూ. శబ్దము తన అర్థమునూ అప్రధానముగా, లేక గౌణముగా చేసుకొని (లేదా తన గుణమును నశింపజేసుకుని)
తం అర్థం = ప్రతీయమానమైన ఆ అర్థమును
వ్యఙ్క్తః = వ్యక్తము చేయునో
సః కావ్యవిశేషః = అట్టి విశేషమైన కావ్యము లేదా ఆ కావ్యమున గల విశేషము
ధ్వనిః ఇతి = "ధ్వని" అని
సూరిభిః = పండితులచేత
కథితః = చెప్పబడింది.
ఏ కావ్యములో "వాచ్యార్థము" తనను "అప్రధానము" గా చేసుకొని, ప్రతీయమానమైన మరొక అర్థమును వ్యక్తపరుచునో (వ్యంగ్యము చేయునో, లేదా ప్రకాశింపజేయునో) ఆ కావ్యవిశేషాన్ని వైయాకరణులు "ధ్వని" అన్నారు.
౧. మొదటి అర్థము తనను తాను "అప్రధానము" గా చేసుకుంది.
౨. తద్వారా రెండవ అర్థానికి "ప్రాధాన్యత"ను కల్పిస్తోంది.
Special Note:
Inference: - అంటే ఒక శబ్దానికి ప్రాధాన్యత, అప్రధాన్యత - "ధ్వని" అన్న context లో మాత్రమే, అందులోనూ - In relative terms లో మాత్రమే భావ్యం. Is it ok?
(పైన శ్లోకంలో - "వా" అని ఒకచోటనే ఉన్నా, దాన్ని అర్థో వా, శబ్దో వాఅని అన్వయం చేసుకోవాలి. అర్థమో, శబ్దమో ఏదో ఒకటి వ్యంజనక్రియకు కర్త గా ఉంటుంది.
ఉపసర్జనీకృత స్వార్థౌ - స్వమ్ చ స్వార్థశ్చ స్వార్థౌ అని ద్వంద్వసమాసము కూర్చుకుని, ఆపై ఉపసర్జనీకృతౌ స్వార్థౌ అని కర్మధారయం చెప్పుకోవాలి)
ఇప్పుడు మహిమభట్టు వద్దకు వద్దాం:
ఏతచ్చ వివిచ్యమానం అనుమానస్య ఏవ సంగచ్చతే, నా అన్యస్య.......ఇంకా...
(తెలుగు అనువాదం, స్వీయ వివరణా కలబోసి క్రింద)
నిదానంగా, బాగా వివేచన చేసి చూడండి
మొదటి అర్థం (వాచ్యార్థం) -> రెండవ అర్థము (వ్యంగ్యము)
పొగ - అగ్ని
రెండవ అర్థం మొదటి దానిపైననే ఆధారపడి ఉంది. వ్యంగ్యము ప్రధానమా, వాచ్యార్థము ప్రధాన్యమా ఇదంతా తర్వాత కథ. అసలు వ్యంగ్యము అనేది వాచ్యార్థం మీదనే ఆధారపడి ఉందా లేదా? వాచ్యార్థాన్ని ధిక్కరించి వ్యంగ్యార్థానికి "స్వతంత్ర ప్రతిపత్తి" ఉందా? లేదు కాక లేదు.
రెండవ అర్థాన్ని చెప్పడానికే మొదటి అర్థం ఉన్నప్పుడు - వాచ్యార్థము (మొదటి అర్థం) రెండవఅర్థానికి (ప్రతీయమానార్థానికి) ఉపసర్జనం (గుణం) కాకపోవటమనేదే ఉండదు.
అగ్ని రాజేస్తే పొగ వచ్చి తీరుతున్నప్పుడు, పొగ తనను తాను అప్రధానం చేసుకుని ఉపసర్జనీకృత- స్వార్థం చేసుకుని అగ్నిని highlight చేయడమనేది లేదు. అసలు పొగ గుణమే, లక్షణమే అగ్నిని తెలుపుట.
ఉపసర్జనత్వం - అంటే ఏమిటి? - అన్యసిద్ధ్యర్థం ఉపదీయమానత్వం గుణత్వం - అని లక్షణం (వైయాకరణుల ప్రకారం). వేరొక వస్తుసిద్ధి కోసం సాధనంగా ఉపయోగపడేదే ఉపసర్జనము లేదా, సాధకము, లేదా గుణము. period.
రాకుమారుడు ఏడు సముద్రాలెనకాల చిలకను తేవాలి. అందుకు కీలుగుర్రమెక్కాడు.
చిలక - లక్ష్యం లేదా వస్తుసిద్ధి.
కీలుగుర్రం - సాధనం.
కీలుగుర్రం (వాచ్యార్థము) - చిలకను (వ్యంగ్యార్థాన్ని) సాధించటానికి ఉపసర్జనము.
ఇప్పుడు ధ్వని నిర్వచనం మళ్ళీ చదవండి. వాచ్యార్థము తన అర్థాన్ని తాను ఉపసర్జనీకృతము చేసుకుని (అదేదో శరత్ బాబు లెవెల్లో త్యాగం చేసినట్టు) అంటున్నాడు ధ్వని వాడు.
బాబూ, అంత సీన్ లేదు. నీ పేరూ, నీ బతుకూ రెండున్నూ త్యాగరాజా సర్వీసు అని అనుమితి వాది.
***
అనుమితివాదంలో Notable points :
1. వ్యంగ్యార్థానికి వాచ్యార్థము నియతముగా (ఖచ్చితంగా) ఉపసర్జనమే.
2. వాచ్యార్థానికి, వ్యంగ్యార్థానికి మధ్య సాధ్య-సాధక సంబంధం ఉంటుంది.
సమాసోక్తి.
-------
ధ్వనివాది: సమాసోక్తి, లేదా గుణీభూత వ్యంగ్యము - వీటిలో, వ్యంగ్యార్థానికన్నా, వాచ్యార్థమే ప్రధానంగా ఉంటుంది. అంచేతనే అవి గుణీభూత వ్యంగ్యాలు. ఇప్పుడు పైన పేర్కొన్న 1 చెల్లదు.
అనుమితివాది సమాధానం: సమాసోక్త్యాదౌ ప్రధాన్యముచ్యతే తత్ "ప్రాకరణిక" ఆపేక్షయైవ| న ప్రతీయమానాపేక్షయా |
ఇక్కడ వాచ్యార్థానికి ప్రాధాన్యమనేది ఏదైతే ఉందో, అది "సందర్భాన్ని" బట్టి వచ్చింది తప్ప, ప్రతీయమానమైన అర్థాన్ని అపేక్షించి రాలేదు.
"అయం ఐంద్రీముఖం పశ్య రక్తః చుంబతి చంద్రమాః"
ఇక్కడ "ఐంద్రీముఖం" అన్న శబ్దానికి గల శ్లేషార్థం మూలాన, రక్తః - అంటే ఎఱుపు, అనురక్తుడయిన అన్న రెండు అర్థాల మూలాన, చంద్రమాః - పుల్లింగమూ, ఐంద్రీ - స్త్రీలింగమూ అవటం మూలాన రెండు తాత్పర్యాలు ఏర్పడినాయి. మొదటిది ప్రాకరిణిక అర్థం, కవి వివక్షితము. రెండవది అప్రాకరణిక అర్థము.
అ)ఆ తూరుపు దిక్కు ఆరంభం చూడవోయ్, ఎరుపెక్కిన చంద్రుడు ముద్దు పెట్టుకుంటున్నాడు.
ఆ)ఆ అప్సరవదనాన్ని చూడవోయ్, కైపెక్కిన ఆ అబ్బాయి (చంద్రుడు) ముద్దాడుతున్నాడు.
***********
ఉపసర్జనీకృతస్వార్థము గురించి:
అనుమితివాది: ఉపసర్జనీకృతస్వార్థము అన్నది లేదు. ఏ అర్థమూ తనంతట తాను తన ప్రాధాన్యతను త్యాగం చేసుకోదు.
ధ్వనివాది ప్రస్తుత సమాసోక్తి context లో: పైన అ) కవివివక్షితము, పైగా చమత్కారభరితము. ఇదే "ప్రస్తుతము". లింగ శ్లేషల వల్ల కలిగే రెండవ అర్థం ఆ) "అప్రస్తుతము".
సమాసోక్తి నిర్వచనం : సమాసోక్తిః పరిస్ఫూర్తిః ప్రస్తుతే అప్రస్తుతస్య చేత్| అని కదా. ఇక్కడ అప్రస్తుతమే (ఆ) ప్రస్తుతార్థానికి (అ) ఉపసర్జనము అవుతుంది. అలాగ ఏదో ఒక విధంగా ఉపసర్జనీకృతస్వార్థము అన్న వ్యవహారం నడుస్తుంది.
దీనికి అనుమితివాది సమాధానం:
వాచ్యార్థ, వ్యంగ్యార్థ ప్రాధాన్యతలు నిర్ణయించటంలో ధ్వనివాదికి, అనుమితివాదికి భేదమున్నది. ఏది ప్రాధాన్యము, ఏది అప్రధానము నిర్ణయించటములో నీ stand సహృదయులు.
సహృదయులు నిర్ణయిస్తారంటావు. నా పద్ధతి ప్రకారం, వాచ్యార్థ- వ్యంగ్యార్థాలకు మధ్య సాధ్య - సాధక సంబంధం ఉన్నది. వాచ్యార్థం "ఎప్పుడూ" అప్రధానమే.
మరి సమాసోక్తిలో వాచ్యార్థము అప్రధానం కాదు కదా అని నువ్వు అంటే - దానికి వచ్చిన ప్రాధాన్యత - టెంపరవరీ గా సందర్భవశాన, ప్రకరణాపేక్షికంగా మాత్రమే వచ్చింది. సమాసోక్తి context లో ధ్వని లక్షణం పట్టదు.
ధ్వనివాది: సరే, సమాసోక్తిలో ఏదో రకంగా వాచ్యార్థమే ప్రధానము అన్న మాట కనీసం ఒప్పుకున్నావు. సంతోషం. మరి దీనికంటే అప్రధానమైనది ఏది?
అనుమితివాది: ఏదీ కూడా తనంతట తానే ప్రధానమూ, తనంతట తానే అప్రధానమూ కానేరదు. సమాసోక్తి context లో వాచ్యార్థం ప్రధానమైతే. "లీలా కమలపత్రాణి గణయామాస" లో వాచ్యార్థము అప్రధానము. తేలిందేమంటే - శబ్దము తాలూకు అర్థము నకు "స్వతంత్రప్రతిపత్తి" లేదు. అందుచేత ఆ మూలభావాన్ని అనుసరించిన "స్వాపేక్షికమైన ప్రాధాన్యమూ" ధ్వని లక్షణానికి పట్టదు.
చివర:
ప్రధాన్యము రెండు విధాలు. 1) ప్రకరణ జనిత ప్రాధాన్యము 2) ప్రతీయమానార్థాపేక్షిక ప్రాధాన్యము.
సమాసోక్తిలో ఉన్నది ప్రకరణాపేక్షిక ప్రాధాన్యమే. అయినపుడు వాచ్యము ప్రతీయమానానికి ఎప్పుడూ సాధనమే.వ్యంగ్యము ఉపసర్జనమే. ఉపసర్జనం కానీ వాచ్యమే లేదు.
అందుచేత ధ్వని లక్షణానికి "అసంభవము" అన్న దోషం పట్టుకుంది.
***
ప్రశ్నలకు సమాధానాలు చివర్న.
3. సమాసోక్తిలో రెండూ వాచ్యార్థాలయినప్పుడు" - సమాసోక్తిలో ప్రకృతార్థం వాచ్యమని, అప్రకృతార్థం వ్యంగ్యమని పుల్లెలవారి తెలుగు కావ్యప్రకాశంలో ఉంది. కాదు రెండూ వాచ్యార్థాలేనని మహిమభట్టు వాదమా? అలా అయితే మౌలికంగా అక్కడ వాచ్య వ్యంగ్యార్థాల అవగాహనలోనే తేడా ఉందన్నమాట.
సమాధానం: పైన సుదీర్ఘమైన వివరణలో ఉంది. అనుమితివాదం ప్రకారం వాచ్యవ్యంగ్యార్థాలకు సాధ్య సాధక భావం మాత్రమే ఉంది. ఇక్కడ వ్యంగ్యం అని ఎవరైనా ఏదైనా అనుకుంటే అది ప్రాకరణికంగా మాత్రమే వచ్చింది కానీ, సాధ్యసాధక సంబంధంతో రాలేదు. (సాధ్యసాధక సంబంధం ఎక్కడ వర్తిస్తుంది? లోకసిద్ధి, వేదము, అధ్యాత్మ విషయాలలో వర్తిస్తుంది.)
>>పై మూడిటి మధ్య ఉన్న తేడాని మహిమభట్టు గుర్తించాడా/అంగీకరించాడా?
>>ఆ తర్వాత ప్రశ్న, ఆ చమత్కారం శబ్దశక్తి అవునా కాదా అన్న అంశం పక్కనపెట్టి, మహిమభట్టు ప్రకారం, అది ఏ రకంగా జనిస్తోంది?
ఎలా అంటే - లోకసిద్ధి వలన, వేదం వలన, అధ్యాత్మికసంబంధం వలన. (ఈ పోస్టు చివర్న)
ఒక అమ్మాయి తల వంచుకుని రేకులు లెక్కెట్టడం - ఇది లోకరీతి వల్ల వచ్చింది. పూలే లేని దేశం ఉందనుకోండి. అక్కడ ఇలాంటి భావమే రాదు.
***********
కామేశ్వర్రావు గారు:
1. మహిమభట్టు లక్ష్యవ్యంగ్యార్థాలకు భేధం చెప్పలేదు. రెంటినీ "అనుమేయం" అనే అన్నాడు.
2. వాచ్యార్థం + ప్రకరణం (సందర్భం) implies అనుమేయం (అనుమేయార్థం can be deduced from వాచ్యార్థం + ప్రకరణం)
3. వాచ్యార్థం నుండి అనుమేయార్థాన్ని deduce చేయడానికి లోకసిద్ధమైన విషయం, వేదము, అధ్యాత్మం అనే మూడు ఆధారం.
లక్ష్యార్థం విషయమై యిది సమంజసమే అనిపిస్తోంది. కాని వ్యంగ్యం విషయంలో యిది సరికాదేమో అని నా అనుమానం (ఇది తెలుగు అనుమానం :-)) వ్యంగ్యార్థం విషయంలో ధ్వనివాదుల నిర్వచనంలోని అస్పష్టత కూడా దీనికి కొంత కారణం కావచ్చు.
ఆలస్యంగా నిద్రలేచినవాడితో చెప్పే మాటల ఉదాహరణ తీసుకొందాం. "ఇవాళ చాలా తొందరగా లేచావే" అనే వాక్యానికి "ఇవాళ చాలా ఆలస్యంగా లేచావు" అనే అర్థాన్ని అనుమానం ద్వారా సాధించవచ్చు. అయితే అది దాని లక్ష్యార్థమే తప్ప వ్యంగ్యార్థం కాదు. వ్యంగ్యార్థం ఏమిటి? "నీకు మరీ బద్ధకం లావయిపోతోంది. అంత మొద్దు నిద్రేమిటి?" వగైరా వగైరా ఎత్తిపొడుపు మాటలు ఎన్నైనా అందులో స్ఫురించవచ్చు. కచ్చితంగా యిదీ అని చెప్పలేం. మొత్తానికి అక్కడ స్ఫురిస్తున్నది ఎగతాళి అని మాత్రం చెప్పవచ్చు. ఇది అనుమానం ద్వారా ఎలా సాధించగలం?
మీరిచ్చిన అమ్మాయి సిగ్గు ఉదాహరణ తీసుకొందాం. అక్కడున్న వర్ణనకి అర్థం "ఆ అమ్మాయి సిగ్గుపడుతోంది" అని వాచ్యార్థం నుండి లోకరీతి ద్వారా deduce చెయ్యవచ్చు (సాధించవచ్చు).
కానీ వ్యంగ్యమవుతున్నది ఆ అర్థం మాత్రమే కాదు. ఆ అనుభావ వర్ణన ద్వారా సిగ్గు అనే భావం పాఠకునికి అనుభూతి అవుతోంది. అదే ఆ వాక్యంలోని "చమత్కారం". అదే వ్యంగ్యం. ఇది logical deduction ద్వారా ఎలా సాధ్యమవుతుంది?
ఇక సమాసోక్తి గురించి. మీరన్నట్టు "ఐంద్రీ", "చుంబతి" మొదలైన పదాల కారణంగా రెండవ అర్థం స్ఫురిస్తోంది అన్నది నిజమే. కాని కేవలం ఆ మాటలున్నంత మాత్రమే ఆ అర్థం స్ఫురిస్తుందని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. I think that the other meaning in samAsOkti can only be "discovered", not "deduced". ఒకసారి ఆ అర్థం తెలిసాక, ఆ అర్థం దేనివల్ల పుడుతోంది అని గుర్తించడం సులువే. ఈ ఉదాహరణ చాలా ప్రసిద్ధం కాబట్టీ, సమాసోక్తికి ఉదాహరణగా చదువుకొన్నాం కాబట్టీ, ఆ పదాల వల్ల ఆ అప్రస్తుతార్థం కచ్చితంగా వచ్చితీరుతుందని అనిపించవచ్చు. కాని చాలా సందర్భాలలో మనం ఎన్నిసార్లు చదివినా తట్టని ఒక కొత్త అర్థం మరొకరు చెప్పినప్పుడో, మనలో మనకేనో ఒకోసారి స్ఫురిస్తుంది.
"ఓహో యిలా కూడా అనుకోవచ్చు!" అనిపిస్తుంది. కొన్నిసార్లు అది మన ఊహేనా లేదా కవి వివక్షితమా అనే అంశం కూడా కచ్చితంగా తేల్చలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో వ్యంజితమయ్యే రెండవ అర్థాన్ని అనుమానంతో సాధించడం సాధ్యం కాదు కదా.
"అసలు అనుమానం ద్వారా సాధించలేని అర్థం నిజంగా ఆ శబ్దానికి ఉన్న అర్థమే కాదు, అది కేవలం పాఠకుని అధికప్రసంగమే/అత్యూహే" అని అంటే, ఇక ఆ మాటకి జవాబు లేదు! :)
*************
>>ఆ అనుభావ వర్ణన ద్వారా సిగ్గు అనే భావం పాఠకునికి అనుభూతి >>అవుతోంది. అదే ఆ వాక్యంలోని "చమత్కారం". అదే వ్యంగ్యం. ఇది >>logical deduction ద్వారా ఎలా సాధ్యమవుతుంది?
ఆ వాక్యం లో చమత్కారం inherent గా ఉంటే - ఆ వాక్యం ప్రపంచంలో యే ఇతర variables కూ లొంగక, చమత్కారంగా భాసించాలి. అసలు పూలే పూయని, పూలంటే ఎరుగని ఒక దేశం ఉందనుకోండి. అక్కడన్నీ కాయలూ, ఆకులే. అక్కడ "లీలా కమలపత్రాణి గణయామాస" అంటే ఏ అర్థం వస్తుంది?
దీన్ని నిరూపించడానికి ఆనందవర్ధనుడు శబ్దానికి శక్తిని ఆపాదించాడు. ఎందుకంటే ఆయన మీమాంసకుడు, స్ఫోట సిద్ధాంతం నమ్మినవాడూ. నైయాయికుడైన మహిమభట్టు లోకరీతితో ఆ వాక్యానికి చమత్కారం వస్తుందంటాడు. ఇవి రెండు సిద్ధాంతాలు. రెండూ ప్రతిపాదనలే. వీటికి absolute significance ఉండదు.
**********
వ్యంగ్యాన్ని శబ్దశక్తిగా చెప్పడం విమర్శనీయమే. మీరన్నట్టు అది శబ్దశక్తే అయితే ఎవరికైనా ఆ స్ఫూర్తి కలగాలి. కానీ వ్యంగ్యం "శబ్దార్థశాసనజ్ఞానమాత్రేణైవ న వేద్యతే" అని ధ్వనికారుడే చెప్పాడు! అంచేత బహుశా "శబ్దశక్తి" అంటే ఏమిటన్నది ఇంకా లోతుగా ఆలోచించాలి. తెలుగు కావ్యప్రకాశంలో పుల్లెలవారు కూడా వ్యంగ్యాన్ని శబ్దవృత్తిగా పరిగణించడాన్ని విమర్శించారు.
దాని గూర్చి లోతైన విచారణ అవసరం అని అభిప్రాయపడ్డారు.
ధ్వనివాదంలో యింకా ప్రమాదానికీ దురుపయోగానికీ గురైనది "సహృదయ" ప్రమాణం. ముందరి వ్యాఖ్యలో "అనుమానం చేత సాధించలేని అర్థం కేవలం పాఠకుని అధికప్రసంగమే/అత్యూహే" అనే మాటకి జవాబు లేదని నవ్వులాటగా అన్నా, నిజానికి కొన్ని సందర్భాలలో వ్యాఖ్యాతలు పద్యాలలో చూపే వ్యంగ్యార్థాలను చదివినప్పుడు నాకు అది వారి అత్యూహే అనిపించింది!
ఇలాంటి దురుపయోగాన్ని కూడా పుల్లెలవారు కావ్యప్రకాశంలో సూటిగా విమర్శించారు.
***********
చివరిగా అనుమితివాదము, ప్రమాణాలు (The factual bases to consider for 'Anumana')
అర్థము అనేది రెండు విధాలు.
౧. వాచ్యము
౨. అనుమేయము.
శబ్దవ్యాపారము వలన సిద్ధించేది "వాచ్యము". దీనినే ముఖ్యార్థం అంటారు. తదన్యమైనది అనుమేయము లేదా గౌణార్థం.
ఇక్కడ మరొక మాట. పదము - అనేది భాషలో ఒక అవిభాజ్యమైన మౌలికాంశం. Lowest Common Denominator. కాబట్టి పదానికి అర్థం ఎప్పుడూ వాచ్యమే అయి ఉంటుంది. ఈ పదము, వాక్యంలో భాగమైనపుడు విధ్యనువాదభావసహితమౌతుంది. అంటే వివిధ అంశాలను వాక్యార్థంలో భాగంగా చేర్చుకుని, భిన్న అర్థాలను మోయగలినదవుతుంది.
విధేయమైన అంశము - సిద్దము, అసిద్ధము అని రెండు రకాలుగా ఉంటుంది. విధేయాంశము ప్రసిద్ధమైతే తొందరలేదు కానీ, అప్రసిద్ధమైతే దానిని ప్రయత్నపూర్వకంగా, ఉపపాదన చేసి సాధించవలసి ఉంటుంది. అలా సాధించిన వాక్యార్థమునే అనుమేయార్థము అని మహిమభట్టు.
అనుమేయార్థము విధ్యనువాదసాధ్యసాధనభావసమన్వితము.
ఈ సాధ్యము, సాధనభావాలకు మూడు ప్రమాణాలు.అంటే ఒక వాచ్యార్థానికి అనుమేయార్థం సాధించాలంటే ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి ఆలంబన/ప్రతిపాదిక గా కావాలి.
౧. లోకసిద్ధమైన విషయం
౨. వేదము (పురాణాలు, ఉపనిషత్తులు, వంటి గ్రంథాలను కూడా వేదమనే అనుకోవాలి)
౩. అధ్యాత్మం
లోకసిద్ధమైన విషయానికి ఉదాహరణ:
చంద్రంగతా పద్మగుణాన్ న భుంక్తే
పద్మాశ్రితా చాంద్రమసీమభిభ్యామ్ |
ఉమాముఖస్తు ప్రతిపద్యలోలా
ద్విసంశ్రయాం ప్రీతిమవాప లక్ష్మీ ||
లక్ష్మి రాత్రి వేళ, చంద్రుడుదయించినప్పుడు పద్మగుణాలను అనుభవింపలేదు. (రాత్రిపూట పద్మం ముకుళించుకుపోతుంది కాబట్టి) పగలు పద్మాలు వికసించిన తర్వాత చంద్రుని గుణాలు (చల్లదనం, వెలుగు) స్వీకరించలేదు. కానీ అదే లక్ష్మి ఉమ ముఖాన్ని ఆశ్రయించినప్పుడు అటు పద్మగుణాలను, ఇటు చంద్రుని గుణాలను ఒకే సమయంలో పొందుతుంది.
ఇక్కడ "ఉమాముఖమునాశ్రయించినప్పుడు లక్ష్మి (శ్రీ) ప్రీతిని పొందడం - సాధ్యము.
ఉమాముఖము - అటు చంద్రగుణాలను, ఇటు పద్మగుణాలను కలిగి ఉండుట - హేతువు.
చంద్రుడున్న సమయంలో పద్మం ముకుళించుకోవడం, పద్మం వికసించిన సమయంలో చంద్రుడు కనిపించక ఉండటం - లోకప్రసిద్ధములు.
ఇవి ఎలాగూ లోక ప్రసిద్ధములు కాబట్టి కవి హేతువు చెబుతూ కూర్చోక, ఆ లోక ప్రసిద్ధమైన విషయానుగతంగా తన కల్పనను అల్లుకున్నాడు. ఆ కవి భావాన్ని పాఠకుడు అదే లోకప్రసిద్ధ సాధ్యసాధక విధ్యనువాదభావ హేతువులతో సాధించగలడు.
(ఈమాటలో వారణసేయ దావగొనవా - లోని అనుమేయార్థం కూడా, లోకసిద్ధమైన రీతిలో సాధ్యం)
ఇదే విధంగా - వేద, అధ్యాత్మాలు కూడా అనుమేయార్థాన్ని సాధించడానికి ప్రాతిపదికమైన ప్రమాణాలు అవుతాయి. (మహిమభట్టు వీటికీ ఉదాహరణలు చెప్పాడు).
***********************
ఇంత పెద్ద చర్చ జరిగిందా! :)
రిప్లయితొలగించండినా ప్రశ్నలకి ఓపికతో జవాబులిస్తూ చర్చసాగించినందుకు నెనరులు!
మీరు మనుచరిత్రలో ధ్వనిని అనుమితివాద దృష్టితో చదవడం మొదలుపెట్టినప్పుడు వీలైతే నోట్సులాంటిదేమైనా పెడుతూ ఉండండి. అప్పుడు మీకు అడ్డురానని హామీ యిస్తున్నాను :)
భలే వారే, మీరు చర్చించకపోతే కొత్త అంశాలు తెలుసుకోవడం, వచ్చినవి నెమరు వేసే ఛాన్సు, వచ్చి ఉండేవే కాదు.
రిప్లయితొలగించండిమనుచరిత్ర చదవాలని ఒక సంవత్సరంగా అనుకుంటున్నదే, అది తెగదూ తెల్లవారదూ లెండి. కాబట్టి అడ్డు ప్రశ్నే రాదు. :)
>మనుచరిత్ర చదవాలని ఒక సంవత్సరంగా అనుకుంటున్నదే....
రిప్లయితొలగించండికొన్నాళ్ళ క్రిందట ఒక రోజున మా శ్రీమతిగారు బంగారంషాపుకు బయలుదేర దీసారు. నగల గురించిన ఆసక్తి నాకేమి ఉంది కనుక, మనుచరిత్ర కావ్యం చేతపుచ్చుకుని బయలుదేరాను. షాపులో కొన్ని గంటలూ, రానూపోనూ కారులో గడిపిన సమయమూ అంతా వెచ్చించి మనుచరిత్ర చదవటం పూర్తిచేసాను.