వీచిక - 7
భాషలో ఈ బ్రాకెట్ ల వాడకం ఎప్పుడొచ్చిందో భాషాశాస్త్రజ్ఞులే చెప్పాలి. ఒక అప్రధానమైన విషయాన్ని చెప్పడానికి వీటిని ఉపయోగించటం రివాజు. కుండలీకరణము - అని ఆ ప్రక్రియ పేరు. ఈ గుర్తుకు తెలుగులో ఒక అందమైన పేరును రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రతిపాదించారు.
ఆ పేరు - "చిప్ప గుర్తులు". టెంకాయ చిప్పలను పక్కపక్కన పెట్టి ఊహించుకుంటే ఎంత అందంగా ఉందో కదా! భాషలోని ఈ సంజ్ఞార్థకాన్ని శ్రీహర్షుడనే సంస్కృతప్రౌఢకవి తెలివిగా ఉపయోగించుకుని ఒక శ్లోకం చెప్పాడు.
శ్రీహర్షనైషధమ్ లో మొదటి అధ్యాయంలో నలుని కీర్తి, ప్రతాపాలను వర్ణిస్తున్నాడు.
తదోజసః తద్యశసః స్థితావిమౌ వృథేతి చిత్తే కురుతే యదా యదా |
తనోతి భానోః పరివేషకైతవాత్ తదా విధిః కుణ్డలానాం విధోరపి ||
తదోజసః = అతని ప్రతాపానికి, తద్యశసః = ఆతని కీర్తికిన్నీ, ఇమౌ = ఈ సూర్యచంద్రులిద్దరూ, వృథా ఇతి = సరికారు అని, చిత్తే = మనసులో, యదా యదా కురుతే = ఎప్పుడు (భావం) కలుగుతుందో, తదా = అలాంటప్పుడు, విధిః = బ్రహ్మ, భానోః, విధోరపి = సూర్య చంద్రుల, పరివేష కైతవాత్ = వలయములు అన్న మిషతో, కుణ్డలానాం = కుండలరేఖను, తనోతి = చేయుచున్నాడు.
తాత్పర్యము: ఆ నలమహారాజు కీర్తికి చంద్రుడూ, ప్రతాపానికి సూర్యుడూ సరిపోరు. అందుచేత బ్రహ్మ, సూర్యుడి చుట్టూ, అలాగే చంద్రుని చుట్టూ ఆవరించి ఉండే చక్రం లాంటి వెలుగు నిచ్చాడు. అలాగ వారిని కుండలీకరించి, వారి ప్రాధాన్యం తగ్గించి వేశాడు అని చమత్కారం.
పరివేషః - అన్న మాట ఇక్కడ ప్రధానం. పరివేషః అంటే చక్రంలా సూర్యుని చుట్టూ ఉన్న aura.
ఇక్కడ పరివేషాన్ని కుండలీకరణముతో సంధానించటం వలన ఉత్ప్రేక్ష.
అలాగే హర్షుని కీర్తి, ప్రతాపాలు సూర్య, చంద్రకాంతులను మరుగుపర్చటం వల్ల అపహ్నవం.
సాపహ్నవోత్ప్రేక్ష. రెండు అలంకారాల సంసృష్టి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.