సంస్కృత సౌరభాలు - 21


సంస్కృతసాహిత్యంలో రామాయణ మహాభారతాదుల తర్వాత శ్రవ్యకావ్యాలకు ఒక ఒరవడి కల్పించినది కవికులతిలకుడైన కాళిదాసు అయితే కావ్యసాహిత్యాన్ని కొన్ని వందల సంవత్సరాలు, అనేక తరాలు తరచి తరచి చదువుకుని, ఆనందించి, ఇది మా దేశభాష, ఇలాంటి కావ్యం మరొక భాషలో సృష్టించడం కాదు కదా, దీనిని మరొక భాషలో ఇంతే భావసాంద్రతతో, ఇదే విధమైన ప్రౌఢిమతో, సున్నితత్వం తో అనువదించడం కూడా అసాధ్యమని చాటి, భరతవర్షం గర్వించేలా చేసిన మహానుభావుడు మాఘుడనే మహాకవి.

ఈయన రచించిన కావ్యం పేరు శిశుపాలవధమ్. దీనినే మాఘం అంటారు. ఇది ఇరవై సర్గల సాహిత్య మృష్టాన్నభోజనం.  అగస్త్యుడు సముద్రాలను పుక్కిటబట్టినట్టు, ఈ మహాకవి సంస్కృతభాషను పుక్కిటబట్టాడంటే అతిశయోక్తి కాబోదు. "నవసర్గగతే మాఘే నవశబ్దో న విద్యతే" అని ఒక సూక్తి. అంటే తొమ్మిది సర్గలు మాఘం చదివిన తర్వాత సంస్కృతంలో కొత్త శబ్దం వినబడదట. 

అంతే కాదు, ఈ కవి సంస్కృతభాషలో పలుపోకడలు చూపాడు. "ద" గుణింతంతో ఏకాక్షరశ్లోకం, చక్రబంధం, గోమూత్రిక ఇత్యాది బంధకవిత్త్వాదులూ, శబ్దచిత్రాలు మాఘంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించిన కవి ఈయన. "మాఘే మేఘే గతం వయః" అని కాళిదాస, మాఘ కావ్యాలకు వ్యాఖ్యానం చేసిన మల్లినాథసూరి మాట. మాఘం - బుద్ధి తాలూకు వికాసాన్ని అంతిమ ప్రస్థానాలకు తీసుకెళితే మేఘం హృదయపు లోతులకు భావావేశాన్ని రగిలిస్తుంది. 

మాఘకవి కేవలం ప్రౌఢకవి మాత్రమేనా? అంటే కాదు, ఈ కవి వ్రాసిన కొన్ని శ్లోకాలు చదివినప్పుడు, అసలు ఇలాంటి భావనలు కూడా సాధ్యమేనా అని అనిపించేంత అద్భుతంగా ఉంటాయి.

శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మజుని రాజసూయయాగానికి వెళుతున్నాడు. మధ్యలో రైవతకపర్వతం (నేటి గుజరాతు రాష్ట్రంలో గిర్నార్ పర్వతాలు) ఎదురయింది. సూర్యోదయాన ఆ పర్వతశోభను ఈ కవి సుదీర్ఘంగా వర్ణిస్తాడు. ఇక్కడ ఒక్కో శ్లోకం ఒక్కో అద్భుతం. 

ఇంద్రనీలమణిసమృద్ధమై, నానా ధాతువులతో నిండి, భూమిని చీల్చుకుని పైకి వచ్చి, కాలసర్పాల ఫూత్కారంలా ఉన్న ఆ పర్వతాన్ని కృష్ణపరమాత్మ చూచాడు. 

(ఈ క్రింది బొమ్మను చూడండి)



సహస్రసంఖ్యైః గగనం శిరోభిః పాదైర్భువం వ్యాప్య వితిష్టమానమ్ |
విలోచనస్థానగతోష్ణరశ్మిః నిశాకరం సాధు హిరణ్యగర్భమ్ ||

సహస్రసంఖ్యైః శిరోభిః = వేల శిఖరాలచేత (వేల తలల చేత), గగనం = ఆకాశమును, (సహస్రసంఖ్యైః) పాదైః = వేల పాదాలచేత, భువం = భూమిని, వ్యాప్య = వ్యాపించి, వితిష్టమానమ్ = విశేషంగా నిలిచిఉన్న, విలోచనస్థానగతం = యోగ్యమైన ప్రదేశంలో (కళ్ళు అనబడే చోట), ఉష్ణరశ్మిర్నిశాకరం = సూర్యుణ్ణి, చంద్రుణ్ణి కలిగి, సాధు = అద్భుతమైన, హిరణ్యగర్భం = సువర్ణమయమైన (బ్రహ్మను) (సః దదర్శ = ఆ కృష్ణపరమాత్మ గాంచెను అని మొదటి శ్లోకంతో అన్వయం).

ఈ శ్లోకానికి రెండు తాత్పర్యాలు.

మొదటి తాత్పర్యం: వేయి శిఖరాలతో ఆకాశాన్ని, వేయిపాదాలతో భూమిని ఆక్రమించి, అటు, ఇటు తమ తమ యోగ్యస్థానాలలో చంద్రుణ్ణి,సూర్యుణ్ణి నిలుపుకున్న సువర్ణమయమైన పర్వతాన్ని శ్రీకృష్ణపరమాత్మ చూచాడు. 

రెండవ తాత్పర్యం: వేయి తలలతో ఆకాశాన్ని, వేయి పాదాలతో భూమిని ఆక్రమించి, కళ్ళుగా సూర్యచంద్రులను నిలుపుకున్న హిరణ్యగర్భుని (బ్రహ్మను లేదా విష్ణుమూర్తిని) శ్రీకృష్ణపరమాత్మ చూచాడు.

మొదటి తాత్పర్యం - ఒక పర్వతవర్ణన. పర్వతం ఆ విధంగా ఉంది. అయితే రెండవ తాత్పర్యం మాత్రం అనితరసాధ్యం,
’హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూధనః’ - విష్ణుసహస్రనామాలలో హిరణ్యగర్భుడంటే సాక్షాత్తూ విష్ణుపరమాత్మయే. ఇక్కడ ఈ సందర్భంలో - సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ, తన స్వరూపాన్నే (లేదా తన పుత్రుడైన బ్రహ్మ స్వరూపాన్ని) తన కళ్ళెదుట రైవతకపర్వతంగా చూస్తున్నాడన్నమాట!

మరొక శ్రుతివాక్యం ఇక్కడ అన్వయించుకోవాలి.

సహస్రశీర్షాః పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్త్వా అద్యతిష్టద్దశాంగులమ్ ||

(పురుషుడు - అంటే బ్రహ్మస్వరూపుడైన పరమాత్మ, వేయితలలతో, వేయి కన్నులతో, వేయి పాదాలతో భూమినంతటిని ఆవరించి ఆపై పది అంగుళాలు అదనంగా వ్యాపించెను.)

పైని వేదవాక్యాన్ని ఒక పర్వతానికి అన్వయించి ఉత్ప్రేక్షించిన ఈ కవినేమనాలి? రాక్షసుడు?

మాఘుని గురించి మరొక అభాణకం ఉన్నది. 

ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవమ్ |
దండినః పదలాలిత్యం మాఘే సన్తి త్రయోగుణాః ||

కాళిదాసు వంటి ఉపమ, భారవి కవి వంటి అర్థగౌరవమూ, దండి కవి వలె పదలాలిత్యమూ, ఒక్క మాఘునిలో చూడవచ్చునట! అర్థగౌరవప్రతిపాదనకు మాఘంలో ఇరువదవ సర్గ అంతా ఒక దృష్టాంతం. ఉపమలకు అడుగడుగునా ఉదాహరణలు కనిపిస్తాయి. పదలాలిత్యమో..ఇదే సందర్భంలో తర్వాతి శ్లోకం ఇది.

రాజీవరాజీ వశలోల భృంగం ఉష్ణంతముష్ణం తతిభిస్తరూణామ్ |
కాంతాలకాంతా లలనాః సురాణాం రక్షోభిరక్షోభితముద్వహన్తమ్ ||

కమలముల శ్రేణికి వశమైన భ్రమరాలతో, వేడిమిని నిగ్రహించగల వృక్షముల వరుసలతో, అందమైన శిరోజాలు కల దేవకాంతలకు రాక్షసస్త్రీలనుండి కాపాడుతున్న రైవతక పర్వతాన్ని శ్రీకృష్ణుడు చూచెను.

...
...

దృష్టోऽపి శైలః స ముహుర్మురారేః అపూర్వవద్విస్మయమాతతాన |
క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః ||

ఓ మారు చూచినప్పటికీ ఆ పై తిరిగి చూచినప్పుడు మరింత అందంగా కనబడుతూ మురారిని విస్మయపర్చింది. క్షణక్షణానికి కొత్తదనం సంతరించుకునే రూపమే కదా రమణీయత అంటే !

ఒకే పర్వతవర్ణనను ఒక సమాన్యుని కంటితో, ఒక భావుకుని కంటితో, ఒక భౌతికవిషయానువర్తి (రత్నమాణిక్యాన్వేషణాపరుడు) కంటితో, ఒక భగవంతుని కంటితో, ఒక యాత్రికుని కంటితో, ఒక కవి కంటితో ఆవిష్కరించి కవి విస్మయపరుస్తాడు. ఈ ఒక్క ఘట్టమే కాదు, మొదటి సర్గలో నారదుని వర్ణన, రెండవసర్గలో రాజ నీతి వివరణా, మూడవ సర్గలో కృష్ణపరమాత్ముని వర్ణనా, ఇలా ప్రతి సర్గలో  ఒక్కో అద్భుతాన్ని ఆవిష్కరిస్తాడు మాఘకవి. ఈ మాఘకవి జ్యోతిష్యశాస్త్రనిపుణుడు అట. మాఘుని జ్యోతిశ్శాస్త్రపాండిత్యం గురించి తిరుమల రామచంద్ర గారొక వ్యాసం వ్రాశారు.

ఉదయతి వితతోర్ధ్వరశ్మిరజ్జావహిమరుచౌ హిమధామ్ని యాతి చాస్తమ్ |
వహతి గిరిరయం విలంబిఘంటాద్వయపరివారితవారణేంద్రలీలామ్ ||

సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన కిరణాలు (పర్వతం క్రింద నుండి) పైకి ప్రసరిస్తున్నాయి. అలానే పర్వతానికి ఇటువైపు చంద్రుడస్తమిస్తున్నాడు. పర్వతానికి అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, మధ్యలో పర్వతమూ. ఒక మదపుటేనుగు - దానికి అటు ఇటు రెండు ఘంటలు తాళ్ళతో వేలాడగట్టినట్టుగా ఉందట ఆ దృశ్యం. భద్రగజాన్ని యుద్ధసమయాల్లో కాకుండా, సాధారణ సమయాల్లో అలంకరించేప్పుడు ఘంటలు వ్రేలాడగట్టటం ఒక సాంప్రదాయం అయి ఉంటుంది. 

(పైన రైవతక పర్వతం/గిర్నార్ పర్వత శ్రేణిని చూచారు కదా, ఈ క్రింది మదపుటేనుగును ఆ బొమ్మతో పోల్చి చూచుకోగలరు.)

పై శ్లోకం మూలాన మాఘకవికి ఘంటామాఘుడని పేరు వచ్చిందని ఐతిహ్యం.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు