వీచిక - 5

ప్రాచీన సంస్కృతసాహిత్యంలో కనిపించిన ఒక చిత్రమైన హైర్ స్టైల్ గురించి, ఇంకొన్ని విషయాల గురించి కొన్ని ముచ్చట్లు.

అశోక వృక్షం క్రింద కూర్చుని ఒకాయన సుందరీవిరహవేదన పడుతున్నాడు. సుందరి - అతని భార్య పేరు. సార్థకనామధేయ. ఈతని పేరు నందుడు. ఆ కావ్యం సౌందరనందం.  కావ్యాన్ని రచించిన మహాకవి కాళిదాసుకన్నా పూర్వుడైన అశ్వఘోషుడు.

ప్రియురాలయిన సుందరిని వదిలి నందుడు, బుద్ధుని ద్వారా ప్రవ్రజన దీక్ష స్వీకరించాడు. కానీ ఆమెను మర్చిపోలేకపోతున్నాడు. ఏ తీగను చూసినా, కొమ్మను చూసినా సుందరి జ్ఞాపకం వస్తున్నది.

పిప్పలి లతను చూస్తే ఆ లతకు పూచిన పువ్వులాంటి సుందరి ముఖం గుర్తొస్తూంది. మామిడి చెట్టుకు అల్లుకున్న మాధవీలతను చూడగానే తనను పెనవేసుకునే సుందరి తనువు గుర్తొచ్చింది.  అలాగే -

పుష్పావనద్ధే తిలకద్రుమస్య దృష్ట్వాऽన్యపుష్టాం శిఖరే నివిష్టామ్ |
సంకల్పయామాస శిఖాం ప్రియాయాః శుక్లాంశుకాऽట్టాలమపాశ్రితాయాః ||

తెల్లటి పూలతో విరగపూచిన తిలకపు చెట్టు కొమ్మ పైన కూర్చున్న కోకిల ను చూచి మేడపైన ప్రియురాలి సిగపైన తెల్లటి పట్టువస్త్రంతో చుట్టిన కేశపాశాన్ని తలుచుకుంటున్నాడు.

అంశుకం అంటే సన్నని పట్టువస్త్రం. శుక్లాంశుకం - ఒక తెల్లని పట్టుబట్టను సిగపై బిగించి దాని లోపల నుంచి కేశపాశాన్ని కట్టడం ప్రాచీనకాలంలో ఒక హైర్ స్టయిల్. ఇది సరిగ్గా తిలకపుష్పం పైన కూర్చున్న కోకిలను పోలి ఉంటుందిట. ఈ క్రింది బొమ్మలో ఉన్న పువ్వుపైన ఆ క్రింది బొమ్మలోని కోకిల కూర్చున్నట్టు ఊహించండి! 





ఇదే కేశపాశాన్ని శూద్రకుడనే కవి పద్మప్రాభృతకం అనే ఒక భాణం (ఏకాంకిక - ఒకే అంకం ఉన్న నాటకరూపం)లో ప్రస్తావించాడు. 

ప్రచలకిసలయాऽగ్రప్రనృత్తద్రుమం యౌవనాస్థాయతే ఫుల్లవల్లీపినద్ధం వనమ్
తిలకశిరసి కేశపాశాయతే కోకిలః కుందపుష్పే స్థితః స్త్రీకటాక్షాయతే షట్పదః |
క్వచిదచిర విరూఢవాలస్తనీ కన్యకేవోऽద్గతైః శ్యామలైః కుడ్మలైః పద్మినీ శోభతే
వరయువతి రతిశ్రమఖిన్నపీనస్తనధూర్తాయితా వాన్తి వాసన్తికా వాయవః ||

ఒక విటుడు చేసిన వసంతకాల వర్ణన ఇది. 

చలిస్తున్న చివురుటాకులతో నృత్యం చేస్తున్న వృక్షాలతోనూ, వికసించిన పూలతోనూ, వనం యౌవనం సంతరించుకున్నది. కోకిల తిలక వృక్షం పై కేశపాశంగా అమరినది. తుమ్మెద మల్లెపూవుపై వ్రాలి స్త్రీలా కటాక్షం చూపుతున్నది. తొడుగుతున్న నల్లతామర మొగ్గ - అందమైన యువతి పయోధరం లాగా శోభిస్తుంది. వాసన్తికా మందమారుతములు రతిశ్రమ తో ఖిన్నయైన  ఒక సుందరి పీనవక్షాలను స్పృశించాలన్న ధూర్తమైన ఆలోచనతో వీస్తున్నాయి.

పైన వర్ణనలో ’తిలకశిరసి కేశపాశాయతే’ అన్నది ఇందాకటి కోకిల కేశపాశమట. పద్మప్రాభృతికం అన్నది మృచ్ఛకటికకర్త శూద్రకుడు వ్రాసిన భాణం. ఈ భాణాన్ని, ఇంకా మూడు భాణాలను కలిపి "చతుర్భాణి" గా వ్యవహరిస్తారు. ఈ ప్రాచీన సంస్కృతఏకాంకికలను సుగృహీత మానవల్లి రామకృష్ణకవి గారు కనుగొని పరిష్కరించి ప్రకటించారు.

ఈ కోకిల కేశపాశం అమరావతీ శిల్పం పై చిత్రించి ఉందని ఒకానొక శిల్పజ్ఞులు ఉటంకించారు. ఆ శిల్పం తాలూకు బొమ్మ ఇది. ఆవిడ శిరస్సుపైన కోకిల కూర్చుని ఉన్నట్టు ఆవిడ వెనుకవైపు కొప్పు భాగం కోకిల శరీరభాగంలానూ అనిపించట్లేదూ? 



(అమరావతీ శిల్పాలన్నీ ఇప్పుడు మదరాసుకు, బ్రిటీష్ మ్యూజియంకూ తరలి పోయాయి.) భర్హుత్ శాసనంపైన ఒక సుందరి అశోక వృక్షానికి దోహదక్రియ చేస్తున్న ఒక శిల్పం ఉందిట. ఆ శిల్పసుందరి కూడా కోకిలకేశపాశాలంకృత అని, ఆ శిల్పం మథుర మ్యూజియంలో ఉందని ఒక శిల్పశాస్త్రవేత్త పరిశీలన. ఆ  కాస్త పరిశీలిస్తే - ఈ కేశపాశం చాలాకాలం మనగలిగినట్లు కనబడుతుంది.బేలూరు హొయసలుల ఈ క్రింది శిల్పాన్ని చూడండి. 




ఈ జడ చరిత్ర  విషయంలో కూడా కొంత తోడ్పడింది. మహామహోపాధ్యాయ వి.వి. మిరాశీ అనే ఒక ప్రఖ్యాత సంస్కృతపండితులు చతుర్భాణి తాలూకు అంశాలను, మృచ్ఛకటికంలోని కొన్ని గూఢమైన సంగతులను పరిశీలించి శూద్రకకవి కాళిదాసుకన్నా పూర్వుడని ఒక గొప్ప వ్యాసం వ్రాశారు.

ఒకావిడ పొడవైన జడ నేలపై జారాడుతుంటే - ఒక కోతి ఆ జడను పట్టి లాగుతున్నట్టు ఒక శిల్పం లేపాక్షిలోనో, హంపిలోనో ఉంది. భారతీయులకు కేశాలంకరణ మహాప్రాధాన్యమైనదిగాను, ఈ కేశపాశాల వెనుక చాలా చాలా కథలున్నట్టు అనిప్సిస్తుంది. కేరళ యువతుల కొప్పు గురించి రాజశేఖరుడనే ఆయన ఒక అందమైన వర్ణన చేశాడు. ఈ కేశాలంకరణలో పురుషులూ తక్కువ తినలేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు