వీచిక - 4

ఒక నీరసమైనదీ, ఎబ్బెట్టయినదీ అయిన చమత్కారశ్లోకం ఈ సారి. ఇది లక్ష్మీనారాయణుల శృంగారవర్ణన. గాథాసప్తశతి లోనిది.

విపరీతసురతసమయే బ్రహ్మాణం దృష్ట్వా నాభికమలే |
హరేర్దక్షిణనయనం చుంబతి హ్రియాకులే లక్ష్మీ ||

విపరీతసురతసమయే = పురుషాయితం అనే శృంగారక్రీడలో 
నాభికమలే = విష్ణువు నాభికమలంలో
బ్రహ్మాణం దృష్ట్వా = బ్రహ్మను చూచి
హ్రియాకులే లక్ష్మీ = సిగ్గుపడిన లక్ష్మి
హరేః = విష్ణువు యొక్క
దక్షిణనయనం = కుడికంటిని
చుంబతి = ముద్దాడింది.

ముద్దాడింది. అయితే ఏంటి?

విష్ణువుకు సూర్యచంద్రులిద్దరూ చెరొక కన్ను. విష్ణుసహస్రనామంలో -
"భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే"- అని ఉంది.
యస్య = ఎవని
పాదౌ = రెండు పాదాలు
భూః = భూమి,
నాభిః = బొడ్డు 
వియత్ = ఆకాశము,
అసుః = శ్వాస
అనిలః = వాయుదేవుడు,
చ = ఇంకా
చంద్రసూర్యౌ = సూర్యచంద్రులు
నేత్రౌ = రెండు కళ్ళు"
...
...

(సాధారణంగా ద్వంద్వసమాసంలో పూర్వపదం ప్రసిద్ధమైనది, ఉత్తరపదం తక్కువ ప్రసిద్ధమైనదిగా ఉండాలని ఒక వ్యాకరణ నియమం. రామలక్ష్మణులు, భార్యాభర్తలు, తల్లితండ్రులు, ఇలాగ. ఆ వరుసలో సూర్యచంద్రులు అనడం సమంజసం. ఇక్కడ చంద్రసూర్యౌ అని మహర్షి వ్యాసుడు ప్రయోగించాడు. ఈ సందర్భంలో సూర్యచంద్రౌ అన్నా కూడా గణభంగం రాదు. అంటే సాభిప్రాయంతో ప్రయోగించి ఉండాలి. ఎందుకో? వ్యాసమహర్షి ని ఇలా పీక్కుతినడం సమంజసం కాదేమో కానీ, ఏ గూఢార్థం ఎక్కడుందో ఎవరికి తెలుసు. నా ఉద్దేశ్యం ప్రకారం మహావిష్ణువును క్రింది భాగం నుండి పైకి వర్ణిస్తూ, అదే క్రమంలో ఎడమనుండి కుడికి వర్ణిస్తూ చంద్రసూర్యౌ అని వర్ణించి ఉండవచ్చు.)

మనం మన ఎబ్బెట్టు శ్లోకానికి తిరిగెళ్ళిపోదాం. ముద్దాడింది. అయితే ఏంటి?

కుడికంటిని ముద్దాడగానే ఆ కన్ను మూసుకున్నాడు విష్ణువు. ఆ కన్ను సూర్యుడు కాబట్టి అప్పుడు సూర్యుడు అస్తమించేశాడు. ఆయన అస్తమిస్తే తామరలు ముడుచుకుంటాయి కాబట్టి విష్ణువు కడుపులో తామరా ముడుచుకుంది. తామర ముడుచుకుంటే అందులో బ్రహ్మ చిక్కుకు పోతాడు. ఇక లక్ష్మీదేవి సిగ్గుపడనవసరం ఉండదు.

ఇది ఒక quiz ప్రోగ్రాం లా ఉన్న ధ్వని శ్లోకం. దీనిని వ్యక్తివివేకం లో మహిమభట్టు ఉటంకించాడు. సంస్కృతంలో "ధ్వని"వాదం అని ఒకటి ఉంది. అంటే సూటిగా, వాచ్యంగా కాక వ్యంగ్యంగా చెప్పడమన్నమాట. అలా చెప్పడం చమత్కారమని, అలా చెప్పిన కావ్యం ధ్వని లేదా ధ్వనికావ్యం. ఆ ధ్వనియే కావ్యాత్మ అని ఒకాయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఈ ధ్వని సిద్ధాంతం రాక ముందు రీతి, వక్రోక్తి, అలంకారము ఇలా రకరకాల సిద్ధాంతాలుండేవి. ధ్వని సిద్ధాంతం తర్వాత దాదాపు అందరూ ఈ కొత్తసిద్ధాంతాన్ని ఆమోదించారు. ఈ ధ్వనిసిద్ధాంతాన్ని ఖండించడమే కాక తూర్పారబట్టినవాడు మహిమభట్టు అనే ఆయన. ఈ మహిమభట్టు అనే ఆయనా ఇందాకటి ధ్వని ప్రవక్త ఆనందవర్ధనుని కాశ్మీరదేశానికి చెందినాయనే. అయితే నైయాయికుడు. (న్యాయం అనే దర్శనాన్ని అనుసరించిన లాక్షణికుడు). శబ్దలక్షణాలు అభిధ, లక్షణ, వ్యంగ్యము అని మూడు విధాలుగా ఉందని మీమాంసకులు, సాంఖ్యులు ఇతరత్రా ఆమోదిస్తే, నైయాయికులు మాత్రం అభిధ మాత్రమే ఉంటుందంటారు. ఈ నైయాయికుల తర్కం కాస్త బౌద్ధానికి దగ్గరగా ఉంటుంది.

ధ్వనిసిద్ధాంతాన్ని ఆక్షేపిస్తూ మహిమభట్టు చూపించిన ఉదాహరణ అది. మూడు equations ను సాధిస్తే తప్ప పైన శ్లోకంలో వ్యంగ్యప్రతిపాదకమైన ధ్వని తెలియట్లేదు. అంటే ధ్వని - చమత్కారహేతువు అన్నమాట ఇక్కడ కరెక్ట్ కాదు. అంటే ధ్వనిసూత్రానికి అతివ్యాప్తి దోషం పట్టింది.

మహిమభట్టు ఇలా ఒకవస్తువువులో ఇమిడిన ధ్వని, రెండు వస్తువుల్లో ఇమిడినది, మూడింటిలో ఇమిడినది, ఇలా అనేకానేక ఉదాహరణలు చూపెట్టి ధ్వనికావ్యాన్ని పరిహసిస్తాడు. 

మహిమభట్టు వాదం ఏమంటే - వ్యంగ్యం అనేదేదీ లేదు. అది అనుమానం ద్వారా సాధించవచ్చు. 

"ఏవం వాదిని రాజర్షౌ పార్శ్వే పితురధోముఖీ |
లీలాకమలపత్రాణి గణయామాస పార్వతీ ||

"పెళ్ళి సంబంధం మాట్లాడ్డానికి పెద్దమనుషులు పార్వతి వాళ్ళనాన్న దగ్గరకొచ్చారు. ఆ పక్కన నిలబడి ఉన్న అమ్మాయి పార్వతి తల వంచుకుని తన చేతిలో తామరపూల రేకులు లెక్కెడుతోంది"

ఇది ధ్వని అంటాడు మొదటాయన. మహిమభట్టు వాదన ఏమంటే - ఆమె లెక్కెడుతోంది అనగానే చదివినవాడెవడైనా "ఎందుకు ఆమె ఆ పని చేస్తున్నద"ని ఆలోచిస్తాడు. ఆ ఆలోచన (అనుమానం) నుండి అతనికి చమత్కారం తెలిసిపోతుంది. అంటే ఒక శబ్దానికి "ధ్వని" అని ఒక ప్రత్యేకమైన అర్థవిశేషం ఏదీ లేదన్నమాటేగా. 

ఇలాంటి వాదనలతో ధ్వనిసిద్ధాంతాన్ని తూర్పారబడతాడు మహిమభట్టు. చివర్లో ఒకచోట చాలా తీవ్రమైన మాట అంటాడు.

"కావ్యస్వరూపం చెప్పాలని బుద్ధిమంతుడైన ధ్వనికర్త సిద్ధాంతం మొదలెట్టినాడు. బావుంది. "వాచ్యము, వ్యంగ్యము ఈ రెంటికీ ఒకదానికొకటి గమ్యగమకభావం ఉంది" అని సూటిగా తెలుస్తూ ఉన్నా దాన్ని చెప్పకుండా, అందులో ఒకటి ప్రధానము, మరొకటి అప్రధానము. ఒకటి వాచ్యము, మరొకటి చమత్కారము అని కావ్యాలు రెండురకాలు అని చెప్పడం వల్ల ఆయన చేసింది ఏదీ లేదు. కావ్యమంటే ఏంటో చెప్పకుండా అది రెండు విధాలని చెప్పడం వల్ల సాధించిన ప్రయోజనం ఏదీ లేదు. ఒకడు ఒక కర్ర (దండం) పెట్టుకుని ఉన్నాడు. అలా దండం పట్టుకుని ఉన్న వాణ్ణి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వాని స్వరూపం చెప్పకుండా కర్ర (దండాన్ని) గురించి చెప్పి, కర్రలు ఇన్నిరకాలు, అన్ని రకాలు అనడం అతిప్రసంగం కాదా!"

మహిమభట్టు ఉదాహరణలు, వాదనా చాలా చమత్ "కారం" గా ఉంటాయి.
"వెనకటికి ఒకాయన చెట్టుకు పూలు పూయడానికి కారణం ఆ చెట్టుకు నీళ్ళు పోసిన కుండ అన్నాడుట. శబ్దానికి అభిధ (సంజ్ఞ) ఒకటే ఉంటుంది. ఇంకా ఏవేవో ఉన్నాయనడం అలాంటిదే."
అవివక్షితవాచ్యధ్వని - అని ఆనందవర్ధనుడు ఒక ధ్వనిపద్ధతిని చెబితే - ఈ మాటకు అసలు అర్థమే లేదంటాడు మహిమభట్టు. అవివక్షితవాచ్యధ్వని అంటే ఏదైతే చెబుతారో దానికి వ్యతిరేకమైన అర్థం ధ్వనించడం లేదా ఇంకో అర్థంలో పరిణమించడమూ. మహిమభట్టు ఏమంటాడంటే - ఒకడు తను చెప్పే మాటను ఏదైతే ఉద్దేశ్యం ఉందో ఆ ఉద్దేశ్యాన్ని తెలపడానికే చెపుతాడు. అతడు ఏది చెప్పాలనుకున్నాడో దానికి అతడే ఉద్దేశించని వ్యతిరేకార్థం ఎలా వస్తుంది?

వ్యక్తివివేకం తో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న ఆనందం చెప్పలేనిది. ఆనందమే కాదు. విమర్శ ఎలా ఉండాలి అని మొదలుకుని, నైయాయికుల గురించి, వాదనలకు ఇవ్వవలసిన ఉదాహరణల గురించి, విమర్శలో సమగ్రత గురించి, హాస్యస్ఫోరకత గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.