వీచిక - 1
వర్షాకాలం ఎంతో దూరం లేదు. ఈ వర్షాకాలం మొదలవగానే పలకరించే అందమైన పూవు పారిజాతం. దీనినే సంస్కృతంలో శేఫాలికా అంటారుట. తెలుగులో నల్లనావిలిపువ్వని బ్రౌణ్యము. ఈ పువ్వు రాత్రి పూట పూస్తుంది. ఉదయమవగానే ఈ చెట్టు దాపుల కుప్పకుప్పలుగా ఈ పూలు నేలపైన పడి ఉంటాయి.
శేఫాలికకు తొడిమ ప్రత్యేకం. స్వచ్ఛసితవర్ణానికి కాషాయరంగు అపూర్వమైన కలయిక. తెల్లటి ఈ పువ్వు ఒకరోజు గడిస్తే కాస్త పచ్చబారుతుంది. అలానే తొడిమకూడా రంగు మారిపోతుంది.
ఇక పద్యానికి -
ఉదయనుడనే ఒక రాజు ఒకానొక ఉదయాన తన మిత్రుడు వసంతకుడనే వాడితో తోటకెళ్ళాడు. అక్కడ తోటలో ఒక దీర్ఘిక (దిగుడుబావి), పక్కనే ఈ శేఫాలికా పూల చెట్లూ, ఇంకా రకరకాల చెట్లూ ఉన్నాయి. ఈ పూలు తోట తాలూకు నేలంతా పరుచుకుని ఉన్నాయి.
అది చూచి ఆ మహారాజు ఇలా అంటున్నాడు.
వృన్తైః క్షుద్రప్రవాళస్థగితమివ తలం భాతి శేఫాలికానాం
గన్ధ స్సప్తచ్ఛదానాం సపది గజమదామోదమోహం తనోతి
ఏతే చోన్నిద్రపద్మచ్యుతబహుళరజః పుంజ పింగాంగరాగాః
గాయన్తవ్యక్త వాచః కిమపి మధులిహో వారుణీపానమత్తాః
తలం = ఈ నేల
శేఫాలికానాం వృన్తైః = వావిలి పూల తొడిమలచేత (నిండినదై)
క్షుద్రప్రవాళ = చిన్న చిన్న పగడాలచేత
స్థగితం ఇవ = మూసిపెట్టబడినట్టు
భాతి = మెరుస్తోంది.
సప్తచ్ఛదానాం గన్ధః = ఏడాకుల అరటిచెట్టు ఆకుల తాలూకు సుగంధం
సపది = ఇప్పటికిప్పుడు
గజమద ఆమోదమోహం = ఏనుగుల మదజలం తాలూకు సువాసనను గుర్తుకు తెచ్చేంత మోహంగా
తనోతి = అనిపిస్తోంది.
చ = ఇంకా
ఉన్నిద్ర = విచ్చుకున్న
ఏతే పద్మచ్యుత = ఈ తామరపూలనుండి వీడిన
బహుళరజపుంజ = మిప్పిరిగొంటున్న పుప్పొడి రజం చేత
పింగ అంగాంగరాగాః = బంగారుపూతను అలదుకుని ఎరుపెక్కిన
వారుణీపానమత్తాః = తేనెతో మత్తెక్కిన (సురాపానమత్తులైన)
మధులిహః = తుమ్మెదలు (యువతులు)
కిమపి = ఏవేవో
అవ్యక్తవాచః = తెలియని పాటలను
గాయన్తి = పాడుచున్నవి(చున్నారు).
వయస్య! ఈ నేల వావిలి పూల తొడిమలచేత నిండి చిన్న చిన్న పగడాలు పరుచుకున్నట్టుంది.ఏడాకుల అరటిచెట్టు ఆకుల తాలూకు సుగంధం ఇప్పటికిప్పుడు ఏనుగుల మదజలం తాలూకు సువాసనను గుర్తుకు తెచ్చేంత అబ్బురంగా అనిపిస్తోంది. విచ్చుకున్న ఈ తామరపూలనుండి వీడిన మిప్పిరిగొంటున్న పుప్పొడి రజం చేత బంగారుపూతను అలదుకుని ఎరుపెక్కిన తేనెతో మత్తెక్కిన (సురాపానమత్తులైన) తుమ్మెదలు (యువతులు) ఏవో తెలియని పాటలను పాడుతున్నాయి(చున్నారు).
హర్షవర్ధనుడనే రాజకవి నాటిక ప్రియదర్శిక లోని అందమైన పద్యం ఇది. కాళిదాసు లోని మసృణత్వపు ధవళతను, భాసకవి తాలూకు ఉజ్జ్వలమైన పాత్రౌచితి, నాటకకళల తాలూకు భాసితకేసరవర్ణాన్ని రంగరించుకున్న శేఫాలికలా అగుపిస్తుంది.
ఈ నాటికలో నాయకుడు ఉదయనుడు. ధీరలలితుడు, మహారాజు, భోగి. (ధీరలలితుడి లక్షణం - నిశ్చిన్తో ధీరలలితః కళాసక్తస్సుఖీమృదుః). మహారాజు కాబట్టి ఆయనకు అందమైన పువ్వు తాలూకు తొడిమల రంగుతో నిండిన నేల పగడాలతో కప్పినట్టుగా అనిపించింది. ఇది రాజలక్షణసంకేతం.
ఈ ఉదయనరాజుకు మరొక "హాబీ" ఒకటుంది. ఈయన దగ్గర ఉన్న ఘోషవతి అన్న వీణను మ్రోగిస్తూ అడవులెమ్మట పడి ఈయన ఏనుగులను లోబర్చుకుంటాడు. ఏనుగులతో సావాసం చేశాడు కనుక గజమదసౌరభం పట్ల ప్రీతిని ఆపేక్షించవచ్చు. అందుకనే ఆయనకు సప్తపర్ణి సుగన్ధంకంటే గజమదం ఆమోదకరంగా అగుపించింది.
పింగ - అంగాంగరాగాః అంటాడు. పింగమంటే బంగారు. బంగారు కాంతులను అలదుకోవడం, వారుణీపానమత్తాః - అని విలాసయువతీవర్ణన - తిరిగి - నిరంతర అంతఃపురవాసం వల్ల ఏర్పడిన అంతఃకరణప్రవృత్తి సూచనగా ఊహించుకోవచ్చు.
ఈ విధంగా స్వభావానికి తగినట్టు పద్యాలనైనా వచనాన్నైనా కూర్చడం - భాసమహాకవి లక్షణం.
చాలా అలవోకగా వర్ణనలను కూర్చి, ఏ కూసింత అసహజత్వాన్ని (ఒకవేళ ఉన్నా) కూడా సామాజికుడి వరకూ వెళ్ళనీయకుండా, అందమైన శబ్దాలతో స్థగితం చేయడం కాళిదాసు కావ్యకళ.
హర్షుణ్ణి, అందునా ఈ ప్రియదర్శికను కాళిదాసు అనుకరణగా విమర్శించినవారున్నారు. అన్యాయమని నా తలపు.
అటు భాసుణ్ణీ, ఇటు కాళిదాసునూ స్పష్టంగా అనుకరిస్తున్నట్టుగా పైకి కనబడుతూ, వారిద్దరికి మూసలా మారకుండా, గుప్పిట్లో ఇసుకలా జారిపోతూ సహృదయులకు హర్షాన్ని చేకూర్చే కవి హర్షుడు. బహుశా ఈ నేర్పరితనం వల్లనే యేమో ఈయన "నిపుణకవి" అయ్యాడు.
పారిజాతాలతోడిమలు పగడాల్లా ఉన్నాయనడం - ఉత్ప్రేక్షాలంకారం
ఏడాకుల అరటిచెట్టు ఆకుల సువాసన మదగజమదసౌరభాన్ని కలిగించడం - భ్రాన్తిమదలంకారం
పింగాంగరాగః - రూపకం
ప్రకృతంలో తుమ్మెదలను, అప్రకృతంలో యువతులను చమత్కరించడం - సమాసోక్తి.
ఈ అలంకారాలన్నీ కలగలసినా వేటికవి స్వతంత్రంగా ఉండి, ఇతర అలంకారాలపై ఆధారపడ్డం లేదు కనుక సంకరము. (తిలాతండులవత్)
ఈ హర్షకవిలో మరొకలక్షణం - లక్షణమైన పదగుంఫనం. పింగాంగరాగాః,గజమదామోదమోహమ్ - ఇటువంటి శబ్దాలంకారలను మరింతగా ఈయన పద్యాల్లో గమనించవచ్చు.
జయదేవుడనే లాక్షణికుడు హర్షుణ్ణి - కవితాకన్యక తాలూకు హర్షంగా ఉద్యోతించాడు. సమంజసమైన పిలుపు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.