సంస్కృత సౌరభాలు - 19


కళానిధికలావతీకలిత జూటవాటీలసత్
త్రివిష్టపతరంగిణీ లలితతాండవాడంబరః |
మదాంచితవిలోచనో మధురముగ్ధవేషస్సదా
పరిస్ఫురతు మానసే గిరిసుతా ऽ నురాగాంకురః ||

కళానిధి = కళలకు నిలయమైన రేరాజును,
కలావతి = కళలే నెలవైన ఉమను,
కలిత = కూడి
జూటవాటీ = జటలు
లసత్ = ప్రకాశించుచుండగా
త్రివిష్టపతరంగిణీ = మూడులోకాలలో ప్రవహించే గంగ యొక్క
లలితతాండవాడంబరః  = సుకుమారమైన అలల నృత్యమునే విలాసముగా కలిగిన వాడు

మదాంచితవిలోచనః = మత్తమైన చూపులను కలిగినవాడును
గిరిసుతా = గిరితనయయొక్క
రాగాంకురః = అనురాగమునకు మొలక ఐన
మధురముగ్ధవేషః = మధురము, ముగ్ధము అయిన వేషము కలిగిన అర్ధనారీశ్వరుడు
మానసే = మనసునందు
సదా = ఎప్పుడూ
పరిస్ఫురతు = మెదలుచుండుగాక!

*************************************

అందమైన, మనోహరమైన శబ్దాలతో పద్యాన్ని తీర్చి ఈశ్వరుని పేరు పెట్టి పిలువకుండా, గిరితనయ అనురాగానికి మొలక అని ఉద్యోతించి పిలుస్తున్నాడు కవి. రాగము అంటే ఎరుపు రంగు అని రూఢ్యర్థం కూడా ఉంది. అమ్మాయిలో ఎరుపు రంగు సిగ్గుకు సంకేతం అనుకుంటే - గిరితనయ రాగానికి మొలక అంటే - అమ్మాయి సిగ్గులకు మొలక అని మనోహరమైన అర్థం కూడా వస్తుంది. ఈ పద్యానికి తాత్పర్యం వ్రాసిన పండితులు దీనిని ఈశ్వరపరంగా అర్థం చెప్పారు. అయితే ఇది అర్ధనారీశ్వరుని గురించినదా? మధురముగ్ధవేషః అని మరొక మాట. ముగ్ధత్వం - సగభాగం అయిన పార్వతికి చెందటం న్యాయం. కాదూ?

మాధుర్యమూ, సౌకుమార్యమూ, ప్రాసాదగుణమూ చిప్పిల్లే భావయుక్తమైన రచన ఇది.

ఈ కావ్యంలోని మరి కొన్ని శ్లోకాలు చూద్దాం.

రాజరాజసఖశ్శంభూ రాజరాజితమస్తకః |
రాజీవసమనేత్రాంశో మమ లోభాయితో హరః ||

రాజరాజు అయిన కుబేరునికి మిత్రుడూ, రాజు (అంటే చంద్రుడు) తో విరాజిల్లే మస్తకం ఉన్న వాడు, ఎర్రతామరలవంటి కనులు కలిగిన హరుడు నన్ను అనుగ్రహించుగాక!

ధిమిధిమితక మర్దల మర్దన నిన
దా ऽ నుగమ కోమల విచలితపాదః |
ప్రతిపదవలన వికల్పితవేదః
ప్రతిపదమవతాన్మునిగణబోధః ||

మద్దెల తాలూకు ధిమి ధిమి తక శబ్దాలకు లయబద్ధంగా తన కోమలమైన పాదాలని కదిలిస్తూ, పదఘట్టనంతో (నాట్య) వేదాన్ని సృజిస్తూ, మునులకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న శంకరుడు రక్షించుగాక! 


అంబరగంగాచుంబితపాదః పదతలవిదళితగురుతరశకటః - అన్న మధ్వాచార్యుని కందుకస్తుతి లీలామాత్రంగా కనబడుతుంది ఈ శ్లోకంలో.

మస్తకచాలితమందానురణత్ గంగాకణముక్తాంచితఫాలః |
నిటలాఫలకా నృతదభంగాగ్ని శిఖాకృతనీరాజనమాలః ||

ఆ మహేశ్వరుడు తన శిరస్సును కదిలిస్తే శిరస్సుపై మందధ్వనితో ప్రవహించే గంగ తాలూకు జలబిందువులు ఆయన నుదుటిపై ముత్యాలలాగా పడినవి. ఆ ఫాలఫలకం లోని మూడవకన్ను ఆయనకే నీరాజనమాలగా ఉంది. (అట్టి శివుడు నన్ను రక్షించనీ) భక్తిని, అద్భుతరసాన్ని ఒక్క చోట ఆవిష్కరించటం అత్యద్భుతం కాదూ?

కపాలీ భిక్షాశీ పితృవననివాసీ పశుపతిః
వినాశీ పాపానాం స్మితమధురవేషీ మృగధరః |
పరానందస్తోత్ర శ్రవణమృదుసంచాలితశిరః
విధత్తామంఘ్రిం మే మనసి తపసా ధూతతమసి ||

కపాలీ = కపాలాన్ని ధరించినవాడు
భిక్షాశీ = భిక్షాన్నము తినేవాడు
పితృవనవాసీ = శ్మశానవాసి
పశుపతిః = గోరక్షకుడైన ఈశ్వరుడు
పాపానాం వినాశీ = పాపాలను పోగొట్టేవాడు
స్మితమధురవేషీ = మధురమైన నవ్వును ధరించిన
మృగధరుడు = మృగధరుడు
పరానందస్తోత్ర = ఆనందంతో భక్తులు చేసే స్తోత్రాలను
శ్రవణమృదు సంచాలితశిరః = విని మెల్లగా తల ఊచే వాడు (భోళాశంకరుడు)
ధూత ధూతతమసి = తపస్సుతో నిర్మలమైన
మే మనసి = నా మనస్సులో
అంఘ్రిం = కాలు
విధత్తాం = మోపుగాక.

భిక్షాశీ, పితృవననివాసీ. పాపవినాశీ, స్మితమధురవేషీ - ఎక్కడో మృచ్ఛకటికంలోని శ్లోకం ఛాయ! అయితే భక్తిరసాన్వితమైన ఆవిష్కరణ.

రకరకాల ఛందస్సులతో కూడిన ఈ ముక్తక కావ్యంలో చాలా చిన్న చిన్న శ్లోకాలతో బాటు వృత్తపద్యాలు కూడా ఉన్నాయి. ప్రాసాదగుణమూ, రసనిర్భరత నిండుగా ఉన్న మెండైన చల్లకుండ ఇది.


శివకర్ణామృతం అనే ఒక కావ్యం లోనివి ఇవి. మనకు లీలాశుకుడు అనే కవి వ్రాసిన శ్రీకృష్ణకర్ణామృతం, అలాగే సదుక్తికర్ణామృతం వగైరా కావ్యాలున్నాయి. ఇవన్నీ కర్ణామృతాలు ఎందుకు అయినాయి? నేత్రామృతాలు ఎందుకు కాలేదు? ఎందుకంటే భావంకంటే శబ్దం విస్మరణీయం కాదు కనుక, భారతీయభాషలు కర్ణేంద్రియం పై కూడా ముఖ్యంగా ఆధారపడినవి కనుక. గురువు ద్వారా విని వల్లె వేయటం భారతీయభాషలకు ముఖ్యమైన అవసరం కనుక అని రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. శబ్దాన్ని, భావాన్ని సమానంగా పండించే కవిని మహాకవి అంటారు. ఈయన కవో, పండితుడో ఏమైతేనేం. నిశ్చయంగా మాత్రం సరస్వతీపుత్రుడు.

జన్మతః విశిష్టాద్వైతి అయిన ఈయన ఇలా చెపుతాడు.

శేషశైలశిఖరాధివాసినః కింకరాః పరమవైష్ణవావయమ్ |
తత్తథాపి శశిఖండశేఖరే శాంకరే మహసి లీయతే మనః ||

శేషశైల వాసి అయిన విష్ణువుకు భృత్యులమూ, పరమవైష్ణవులమూ మేము. అయినా బాలేందుమౌళి శంకరునిపై మనస్సు బలంగా లీనమవుతున్నది.


*************************************

ఈయన తెలుగులో శివుణ్ణి, శివతాండవాన్ని వర్ణిస్తే ఇలా ఉంటుంది.

మొలకమీసపు కట్టు ముద్దు చందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెలపట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు కురియు మంటలరట్టు
సిగపై ననల్పకల్పక పుష్పజాతి, కల్పక
పుష్పజాతి చెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు తాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగగణంబు
కనులపండువసేయ, మనసు నిండుగపూయ
ధణధణధ్వని దిశాతతి పిచ్చలింపంగ

ఆడెనమ్మా శివుడు,
పాడెనమ్మా భవుడు!

హొంబట్టు = బంగారు జరీ చీర.
క్రొన్నాగు = లేతవయసులో ఉన్న సర్పం
భృంగగణంబు = తుమ్మెదలరాశి

జ్ఞానస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి అయిన సరస్వతి శంకరునికి చెల్లెలని చెపుతారు. సరస్వతీపుత్రునికి శంకరుడు మేనమామ. మేనమామపై మేనల్లునికి ఇష్టం, మనస్సు కలుగడంలో ఆశ్చర్యమేమున్నది?

కామెంట్‌లు

  1. అద్భుతంగా ఉన్నది. శివకర్ణామృతం కవి అప్పయ్యదీక్షితులవారని సామవేదం వారు చెప్పారు. అందులో నేను విన్న కొన్ని ఘట్టాలూ చాలా మనోహరంగా ఉన్నాయి, మీరు ఉదహరించిన వాటిలాగానే.
    వీలుంటే ఉమా సహస్రం మీదకూడా ఓ లుక్కెయ్యండి.

    రిప్లయితొలగించండి
  2. అప్పయ్యదీక్షితుల వారి పేరునే నారాయణాచార్యుల వారు ఉపయోగించి ఉంటారేమో.

    అప్పయ్యదీక్షితుల వారి ఆత్మార్పణస్తుతి చదివానండి. అదే వ్రాద్దామని అనుకున్నాను మొదట. అయితే అందులో గొప్ప పాండిత్యం, భక్తీ కనిపిస్తుంది. అయితే మనసును తట్టే సౌకుమార్యమూ, నా వంటి సామాన్యునికి అందుబాటులో కనబడే ఆకర్షణీయమైన సరుకు కనిపించలేదు. వ్యాఖ్యానించడానికి నా శక్తి చాలదు.

    ఉమాసహస్రం చదవాలండి. అయితే ఆయనా నా లాంటి సామాన్యునికి అందుబాటులో ఉంటాడా అని భయం కూడా ఉంది. "నాయన" గారంటే ఈ మధ్య ఆయన మోనోలాగ్ చదివిన తర్వాత గొప్ప గౌరవం కలిగింది. ఆ గౌరవం తో ఆయన రచనలు చదవాలనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.