సంస్కృతసౌరభాలు - 18
క్షీర సాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే!
భోగిభోగ శయనీయశాయినే మాధవాయ మధువిద్విషే నమ:!!
క్షీరసాగర తరంగ = పాలకడలి అలల యొక్క
శీకరాసార = బిందువులచేత నింపబడిన
తారకిత చారుమూర్తయే = చుక్కలు కలిగిన అందమైన వానికి
భోగి భోగ శయనీయ శాయినే = ఆదిశేషుని పై పవళించిన వానికి
మాధవాయ = మాధవునకు
మధువిద్విషే = మధు అను రాక్షసునకు శత్రువైన వానికి
నమః = జోత.
శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపై పవళించి ఉన్నాడు. ఆ పాలకడలి తరంగాల తుంపరలు ఆయన నల్లని తనువుపైన అక్కడక్కడా చింది ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్నాయి. అలాంటి మహావిష్ణువుకు నమస్కారం.
***********************************************
తెలుగు భాష నేర్చుకునేప్పుడు మొట్టమొదటగా వేమన పద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలూ, సుమతీశతక పద్యాలు, పోతన భాగవతపద్యాలు - ఇలా ఆరంభిస్తాం. సంస్కృతాధ్యయనం లోనూ ఒక వరుస ఉంది. మొదట బాలరామాయణం, అమరకోశం, శబ్దమంజరీ, ముకుంద మాల,
ధాతువులూ, భర్తృహరి, ఆపైన రఘువంశం, కుమారసంభవం....
పై వరుసలో ముకున్దమాల ఉండటమే ఆ మహనీయమైన స్తోత్ర కావ్యం గొప్పతనాన్ని చెప్పక చెబుతుంది. విశిష్టాద్వైత మతం - అందుకు సంబంధించిన భక్తి సాహిత్యం అనర్ఘ, అమూల్య రత్నాలను ఎన్నిటినో సృష్టించింది. అందులో గొప్ప హృదయంగమమైన స్తోత్రం ముకున్దమాల.
ముకున్దమాల - ఎంత అందమైన పేరు? ఇది ముకుందునికి కుందములతో కట్టిన ఓ మూరెడు దండ. ఈ మూరలో నలభై గుండు మల్లెలు.
ఈ స్తోత్ర కావ్యం - చదువుకోవటానికి, చక్కగా ముకుందుని తలుచుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఇందులో కావ్యగౌరవం కలిగించే అంశాలేవీ? - ఈ ఆలోచన వస్తే దాని వెనుక కొన్ని పొరబాటు ఆలోచనల నేపథ్యం ఉందని గ్రహించాలి. అర్థం తప్ప శబ్దానికి ప్రాముఖ్యత లేదు. గొప్ప గంభీరమైన భావాలు, పాఠకుని మేధోశక్తికి సవాలుగా నిలిచే కవిత్వం గొప్పది అన్న అహంకారపూరిత భావన పొరబాటుకు కారణం. నిజానికి - సులభంగా వ్రాయడం కష్టం. కష్టంగా వ్రాయడం సులభం.
సమాసం అంటే రెండు లేక అంతకన్నా ఎక్కువ పదముల యొక్క అర్థవంతమైన, క్రమబద్ధమైన కూర్పు. ఆ సమాసం తాలూకు అర్థాన్ని వివరించే ప్రక్రియ విగ్రహవాక్యం. ఆ కూర్పు తాలూకు పద్ధతిని చెప్పేది సమాసనామం - తత్పురుషం, కర్మధారయం, ద్వంద్వము, ద్విగు, బహువ్రీహి..ఇలా. ఇదంతా ఒక తంతు. అయితే అందమైన సమాసానికి ఒక ప్రాచీన లక్షణకారుడు కొన్ని లక్షణాలు చెబుతాడు. చక్కటి సమాసం లో ఒక్కొక్క శబ్దానికి మధ్య అవధి ఉండాలి. సమాసంలో శబ్దానికి మధ్య చక్కటి అనుప్రాస కావాలి. మొదటి శబ్దం, అవధి, తర్వాతి శబ్దం ఆరంభించేప్పుడు దీర్ఘం, లేక చక్కని అనుస్వారయుతమైన అక్షరంతో ఆరంభించడం శోభస్కరం. ఈ సమాసం కఠిన శబ్దాలతో ఉండవచ్చు, అయితే కఠినశబ్దాలు వరుసగా రావటం మంచిది కాదు. సుకుమారత్వం మరింత శోభస్కరం. ఇక ఈ క్రింది సమాసం చూడండి.
క్షీర-సాగర-తరంగ-శీకరాసార-తారకిత-చారుమూర్తి -
శబ్దాల కూర్పు "ర" అనే సరళమైన అక్షరంతో కూడిన అనుప్రాసతో ఎంత అందంగా అమరిందో చూస్తూనే గ్రహించవచ్చు. చక్కటి సమాసాన్ని రసహృదయులు దాని నాదంతోనే గుర్తించగలరట. పై సమాసం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతే కాదండోయ్. సమాసం కూర్పు ఎంత అందంగా, సునాయాసంగా ఉంటే ఆ పద్యం/శ్లోకం/వచనం/దండకం/మరేదైనా అంత తొందరగా వల్లె వేయడానికి అనువుగా ఉంటుందిట. ఈ అందమైన సమాసానికి భావం కూడా అంత హృద్యంగా ఉంటే ఆ కవి మహాకవి. ముకుందమాల రచించిన కులశేఖరుడు/కులశేఖరాళ్వారు మహాకవి. మహాభక్తుడు కూడా.
సుధా-సముద్రాంత-రుద్యన్మణిద్వీప-సంరూఢ-బిల్వాటవీమధ్య-కల్పద్రుమాకల్ప-కాదంబ-కాంతార-వాసప్రియ - కాళిదాసు శ్యామలాదండకం
ఘనదర్ప-కందర్ప- సౌందర్య- సోదర్య-హృద్య-నిరవద్య-రూపో-భూపః - ఇది దండి దశకుమారచరిత్ర ఆరంభంలో వచ్చే రాజవాహనుడనే రాజుకు విశేషణాలు కూర్చిన సమాసం.
సమాసం ఎలా ఉండాలో వీటిని చూస్తూనే లేదా ఒక మారు మనసులో తలుచుకుంటేనే తెలియడం లేదూ?
ఈ మధ్య చూచిన ఒక తెలుగు పద్యం ఇది. సుదర్శనచక్రవర్ణన అనుకుంటాను.
జ్వాలాజాలజటాల మాసురవధూభాస్వత్కపోలస్థలీ
హేలాకుంకుమపత్రరచనా హేవాక వాల్లభ్యహృత్
క్ష్వేలాభీలము ......
జ్వాలా-జాల-జటాలము
ఆసురవధూ-భాస్వత్కపోల
..
..
గొప్ప సమాసానికి నాదం మాత్రమే కాదు ధారాశుద్ధి కూడా అలవోకగా అమరుతుంది.
ముకుందమాలలో ఈ క్రింది మనోహరమైన పద్యం గమనించండి.
కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులే ऽ గాధమార్గే !
హరిసరసి విగాహ్యా పీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్య త్యజామి!!
(హరి ఒక తటాకం. ఆయన కరచరణాలు ఆ తటాకపు సరోజాలు. ఆయన కాంతివంతమైన కనులు ఆ తటాకంలో విహరించే మీనాలు. ఆయన భుజాలు తటాకపు అలలు. అగాధమైన ఆ సరస్సులో మునిగి, తేజోబలసంపన్నమైన ఆ తటాకపు ఈటిని గ్రోలి, సంసారజనితమైన దుఃఖాన్ని ఇప్పుడు వదిలించుకున్నాను.)
కర-చరణ-సరోజే
కాంతిమత్-నేత్రమీనే
...
...
******************************************************
ముకుందమాల ఒక భక్తిరసప్రవాహం. ఒక స్తోత్రంగా చదువుకున్నా కూడా మహా ఉదాత్తమైన భావం మనసులో మెదిలి చిత్తం కరుణరసార్ద్రమై, భగవంతునిపై ధ్యానమగ్నం చేసే అపూర్వమైన కృతి. ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు దీనిని మర్చిపోవడమంటూ దాదాపుగా జరుగదు.
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!!
(శ్రీ వల్లభా, వరదా, దయాపరా, భక్తప్రియా, భవాన్ని తరింపజేయు కోవిదుడా, నాథా, నాగశయనా, జగన్నివాసా - ఇలా నీ నామాలాపనం ఎప్పుడూ కలిగేట్లు చేయి ముకుందా!)
చిన్తయామి హరిమేవ సన్తతం
మందమంద హసితాననామ్బుజమ్!
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితమ్!!
(తామరపువ్వు వంటి ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, నందగోపతనయుడైన పరాత్పరుని, నరదాది మునివందితుణ్ణి అయిన హరినే ఎప్పుడూ తలుస్తాను.)
జిహ్వే! కీర్తయ కేశవం మురరిపుం చేతో! భజ, శ్రీధరం
పాణిద్వన్ద్వ! సమర్చయా ऽ చ్యుత కధా: శ్రోత్రద్వయ! త్వం శృణు!
కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ! ముకుందపాదతులసీం, మూర్ధన్! నమాధోక్షజమ్!!
ఓ నాలుకా! కేశవుని కీర్తించు.
మనసా! మురరిపుని భజించు
పాణిద్వయమా! అచ్యుతుని కథలను సమర్చించు.
చెవులారా! మీరు వినండి.
లోచనద్వయమా! కృష్ణుని చూడండి.
పాదాల్లారా! హరికోసమై కదలండి.
ఓ నాసికా! ముకుందపాదతులసిని మూర్కొను.
శిరసా! అధోక్షజుని నమస్కరించు.
ముకుందమాల లో భక్తిరసప్రవాహాన్ని, ఆర్తిని గురించి వ్యాఖ్యానించటం సూర్యుని ముందు దీపపు వెలుగు చూపించటం వంటిది. కులశేఖరమహారాజు హృదయకుసుమం తాలూకు ఈ మకరందం విష్ణుపదచిత్త ధ్యాన తత్పరులకందరినీ సమంగా ఆకర్షిస్తుంది.
భారతీయసంస్కృతి మీద గౌరవం ఉన్న తల్లితండ్రులు ఈ కావ్యం తాలూకు పద్యాలను వారి వారి పిల్లలచేత చదివిస్తారు, వారికి నేర్పిస్తారు కూడా. అందువల్ల ఉత్తమ లౌకికసంస్కారమే కాదు, చక్కని కావ్యసంస్కారం కూడా తప్పకుండా కలుగుతుందనడంలో ఇసుమంతైనా సందేహం అనవసరం.
******************************************************
మీ ఈ సైటును చూడటం ఇదే ఓం ప్రథమం. మంచి పని చేస్తున్నారు. సంస్కృత బాలకాండ అమరకోశం ఉన్నాయి. మిగిలినవీ సంపాదించి అధ్యయనం మొలుపెట్టాలి అనిపిస్తున్నది.
రిప్లయితొలగించండి