సంస్కృతసౌరభాలు - 17
స్మృతాऽపి తరుణాతపం కరుణయా హరన్తీ నృణాం
అభంగురతనుత్విషాం వలయితా శతైర్విద్యుతాం |
కళిందగిరినందినీ తటసురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ ||
నృణాం = మానవుల
తరుణాతపం = సంసార బాధను
స్మృతాऽపి = తలిచినంతమాత్రమున
కరుణయా = కరుణతో
హరన్తీ = పోగొట్టునది
అభంగుర తనుత్విషాం = నాశము లేని శరీరకాంతిని కలిగిన
విద్యుతాం = మెరుపుల
శతైః = శతములను
వలయితా = చుట్టుకున్నది
కళిందగిరినందినీ = యమునానది యొక్క
తట = ఒడ్డున ఉన్న
సురద్రుమ = కల్పవృక్షమును (వేపచెట్టును)
ఆలంబినీ = ఆశ్రయించినది (ఆ చెట్టు చిటారుకొమ్మల నుండునది)
కాపి = ఒకానొక
కాదంబినీ = కారు మేఘము
మదీయ = నాయొక్క
మతి చుంబినీ = మతిని చుంబించునది
భవతు = అగుగాక.
అదేదో తెలుగు సినిమాపాటలా
యమునానది గట్టుంది.
గట్టుపైనా చెట్టుంది.
చెట్టు చివరనా మేఘముంది
మేఘమే నా మది మెదిలింది.
అన్నట్లుగా యమునానది నాశ్రయించిన కృష్ణుడు అన్న మేఘాన్ని కవి మంగళాచరణలో ప్రార్థిస్తున్నాడు. ఆ కాదంబిని (మేఘం) యమునాతటిని ఉన్న ఒక విశాలవృక్షాన్ని ఆశ్రయించింది. మెరుపుతీగలశతములు (అనబడే గోపస్త్రీలతో) చుట్టుకుని ఉన్నది. స్త్రీ లింగమైన కాదంబిని ద్వారా పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ధ్వనింపజేయడం ఈ శ్లోకం లో చమత్కారం. ఇలాంటి చమత్కారాన్ని ఇంత మధురంగా,సుకుమారంగా, అర్థవ్యక్తితో చెప్పగలిగిన కవి జగన్నాథుడు కాదు కాదు జగన్నాథపండితరాయలు. ఆయన వ్రాసిన రసగంగాధరం అన్న అలంకారికగ్రంథానికి మంగళాచరణం ఈ శ్లోకం.
******************************
ప్రాచీనాలంకారికులు శబ్దం యొక్క గుణాలను పదిరకాలుగా వింగడించారు.
శ్లేషః ప్రసాదః సమతా మాధుర్యం సుకుమారతా |
అర్థవ్యక్తిరుదారత్వం ఓజః కాంతి సమాధయః ||
అని వాటికి పేర్లు.
వీటిలో
మాధుర్యం అంటే - దీర్ఘసమాసాలు లేక అలతి అలతి పదాలతో ద్విత్తాక్షరాలు లేకుండా కూర్చడం.
సుకుమారత్వం అంటే - అపరుషమైన వర్ణాలు (ఖ,ఛ,ఠ, థ, ఫ, ఘ,ఝ,ఢ,ధ, భ - వీటిని మహాప్రాణాలు అంటారు) లేని కూర్పు
అర్థవ్యక్తి = చదవిన వెంటనే అర్థం స్ఫురించటం
కాంతి = ఛాందసశబ్దాలతో కాక నవ్యమైన శబ్దచాతుర్యంతో శోభాయమానంగా కూర్చటం
- దాదాపుగా ఈ నాలుగు లక్షణాలు పండితరాజు కవిత్వంలో అలవోకగా కుదిరిపోవడం పాఠకులకు విస్మయకరమైన అనుభవం కలిగిస్తుంది. పైన శ్లోకమే గమనిస్తే మూడు నాలుగు పాదాలలో మాధుర్యం,దాదాపు శ్లోకం మొత్తం అంతా సుకుమారతా, అర్థవ్యక్తి,, సురద్రుమ, కాదంబినీ, ఆలంబినీ, మతిచుంబినీ వంటి శోభాయమానమైన ప్రయోగాలతో కూడిన కాంతి అనే గుణమూ స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాక, మేఘాన్ని శ్రీకృష్ణునిలా ధ్వనిమార్గంలో ఉద్యోతించటం చక్కని విశేషం.
సరిగ్గా ఇదేవిధమైన శబ్దగుణాలతో శ్లోకాలు కూర్చినదెవరా అని తరచి చూస్తే స్ఫురించే కవి జయదేవుడు.
చందనచర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ |
కేళిచలన్మణికుండలమండిత గండయుగస్మితశాలి ||
జాగ్రత్తగా గమనించండి - ఒక్క మహాప్రాణాక్షరం లేక ఎంత సుకుమారంగా ఉందో?
ప్రియే చారుశీలే! ముంచ మయి మానమనిదానం |
సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖకమల మధుపానమ్ ||
ఇక్కడ మాధుర్యమూ, అర్థవ్యక్తి, సుకుమారతా...అన్ని గుణాలు ఎంత అలవోకగా కుదిరినవో చూడండి. జయదేవుని తర్వాత ఇలా మహాప్రాణాక్షరాలపట్ల పిసినారితనం చూపించి శబ్దమాధుర్యంతో కవిత చెప్పగలిగినది పండితరాజు కావచ్చును.
అలాంటిది జగన్నాథపండితరాయల పద్యం ఒకటి.
నితరాం పరుషా సరోజమాలా
న మృణాలాని విచారపేశలాని |
యది కోమలతా తవాంగనానాం
అథ కా నామ కథాపి పల్లవానామ్ ||
-అమ్మాయీ! నీ కోమలమైన శరీరాంగముల ప్రసక్తి వచ్చినప్పుడు తామపువ్వులదండ కూడా పరుషమైనది. లేతతామరతూళ్ళు కూడా చెప్పుకోదగ్గవి కావు. ఇక చివురుటాకుల సంగతి చెప్పేదేముంది?
రసగంగాధరం కావ్యంలో ఈయన తను వ్రాసిన భామినీవిలాసం అన్న కావ్యంలోని ఉదాహరణలనే స్వీకరించాడు. జగన్నాథుని భావనలోని ఆ భామిని పేరు లవంగి. ఈ లవంగి షాహజహాను కూతురని, అక్బరు కూతురని, షాహజహాను కొలువులో పనిచేసే రాజపుత్రయువతి అని ఏవేవో కథలు ఉన్నాయి. ఓ నాడు పండితరాయలు, షాహజహాను చదరంగం ఆడుతుంటే ఆ లవంగి మదిరాపానం అందించడానికి వచ్చిందట. పండితరాయలు ఆమెను తేరిపారచూడగానే ఆమె చేతులు కంపించాయి. పండితరాయలకు మనసు చలించింది. చదరంగంలో గెలిచిన జగన్నాథునికి - ఏం కావాలో కోరుకొమ్మని షాహజహాను అడగ్గా ఆయన అన్నాడూ -
న యాచే గజాళీం న వా వాజిరాజిం
న విత్తేషు చిత్తం మదీయం కదాపి
ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్తా
లవంగీ కురంగీ మదంగీకరోతు
ఏనుగులు యాచించను, గుర్రాలొద్దు, నామనసు డబ్బుపై లేదు. ఈ అందమైన జింకపిల్లలాంటి లవంగిని నాకివ్వు.
ఆమెపై వ్రాసిన చాటుపద్యసమాహారమే భామినీవిలాసం అన్న కావ్యం అట. ఇందులో తమ సుతుడు మరణించినప్పుడు పండితరాయలు అనుభవించిన నిర్వేదం వంటివి కూడా కూర్చబడ్డాయి. అక్కడక్కడా గాథాసప్తశతి ధోరణి కూడా కనబడుతుంది.
గురుమధ్యగతా మయా నతాంగీ
నిహతా నీరజకోరకేణ మందం
దరకుండలతాండవం నతభ్రూ
లతికం మామవలోక్య ఘూర్ణితాసీత్
"అత్తమామల మధ్య నుంచున్న సఖి పయ్యెత్తులపైన అలవోకగా తగిలేట్టు ఒక తామరమొగ్గతో సఖుడనైన నేను కొడితే, నా సఖి చెవిపోగులు కదిలించి, కాస్త నుదురు చిట్లించి నాకేసి గుర్రుగా చూసింది."
ఇది అసలుసిసలైన స్వభావోక్తి అలంకారం.
కొంతమంది కవులకు దర్పం, దుందుడుకు మాటతీరు అలవోకగా అమరుతాయి. తెలుగులో శ్రీనాథుడు అలాంటి మహాకవి అయితే సంస్కృతంలో బహుశా ఆయన counterpart జగన్నాథపండితరాయలు. ఇద్దరూ ఇద్దరే. ఈయన కవిసార్వభౌముడు, ఆయన పండితరాజు. ఇద్దరూ మహాభోగులు. మహాద్భుతమైన కవిత్వం చెప్పగలరు. ఇద్దరూ తెలుగు వాళ్ళు.
ఈ శ్లోకం, ఇందులో చివరిపాదం ఎంత వినూత్నంగా, చమత్కారంగా ఉందో చూడండి.
మధురసాన్మధురం హి తవాధరం,
తరుణి మద్వదనే వినివేశయ |
మమ గృహాణ కరేణ కరాంబుజం
ప ప పతామి హహా భ భ భ భూతలే ||
"నీ పెదవి మధురతరమైనది. నా ముఖానికి తాకించు. నీ చేత్తో నా చేతిని పట్టుకో. హహా....భ భ భూతలంలో...ప ప పడిపోతున్నా..."
శ్రీనాథుని "ణిసి ధాత్వర్థంబనుష్టించడం" అన్న కథనానికి జగన్నాథుడు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూర్చి నటించి కూడా చూపిస్తే ఉన్నట్టుగా లేదూ?
******************************
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి