సంస్కృతసౌరభాలు - 16

రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. అప్పుడు -

రుంధన్నష్టవిధేః శ్రుతీర్ముఖరయన్నష్టౌ దిశః క్రోడయ
న్మూర్తీరష్ట మహేశ్వరస్య దిశయన్నష్టౌ కులక్ష్మాభృతః
తాన్యక్ష్ణా బధిరాణి పన్నగకులాన్యష్టౌ చ సంపాదయ
న్నున్మీలత్యయమార్యదోర్బలదళత్కోదండకోలాహలః ||

విధేః అష్ట శ్రుతీః రుంధన్ = బ్రహ్మ యొక్క ఎనిమిది చెవులను గింగురులెత్తిస్తూ
అష్టౌ దిశః ముఖరయన్ = ఎనిమిది దిక్కులు మారుమ్రోగిస్తూ
మహేశ్వరస్య అష్టమూర్తీః క్రోడయన్ = ఈశ్వరుని అష్టమూర్తులను ఆవహిస్తూ
అష్టౌ కులక్ష్మాభృతః దళయన్ = ఎనిమిది కులపర్వతాలను పగులగొడుతూ
తాని పన్నగకులాని అష్టౌ = ప్రసిద్ది పొందిన ఎనిమిది విధాలైన నాగములను
అక్ష్ణా బధిరాణి సంపాదయన్ = చూపులతో చెవిటివిగా చేయుచూ
ఆర్య = పూజ్యుడైన రాముని
దోర్బల = భుజబలముచే
దళత్ = విరుగుచున్న
కోదండ కోలాహలః = శివధనుస్సు యొక్క తీవ్రమైన ధ్వని
అయమ్ = ఇదే
ఉన్మీలతి = పెద్దదవుతున్నది.

అనర్ఘరాఘవం అనే ఏడంకాల నాటకంలో మూడవ అంకంలో రాముడు శివధనుర్భంగం చేసే ఘట్టంలోనిది ఈ పద్యం. ఈ నాటకకర్త మురారి పండితుడు.

మహేశ్వరునికి ఎనిమిది రూపాలున్నవి.  ఇవి - శర్వ, భవ, పశుపతి, ఈశాన, భీమ, రుద్ర, మహాదేవ, ఉగ్ర
 

కులపర్వతాలు - మహేంద్ర, మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమత, వింధ్య, ఋక్షవంతము - ఇవి ఏడు. అయితే కవి ఎనిమిది పర్వతాలను ఉటంకించాడు. బహుశా మరొక పర్వతం ప్రస్తావన ఎక్కడైనా ఉండాలి.
 

ఎనిమిది నాగ కులాలు ఇవి - శేష, వాసుకి, కాళీయ,మానస, అనంతశయన, పద్మనాభ,అష్టిక, కులిక
అలాగే చూపులతో చెవిటివిగా చేయటం ఏమిటి? పాముకు చక్షుశ్శ్రవం అని పేరు. వాటివి చెవులు ఉండవు. కళ్ళే చెవులుగా పనిచేస్తాయన్నమాట. అందుకనే ఆ ప్రయోగం.

ఏతావతా -

రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టగానే అది విరిగింది. ఆ భీకరధ్వనికి
బ్రహ్మ ఎనిమిది చెవులు గింగురున్నాయి.
ఎనిమిది దిక్కుల్లో ఆ శబ్దం ప్రతిధ్వనించింది.
మహేశ్వరుని ఎనిమిది మూర్తులను ఆ శబ్దం కమ్ముకుంది.
ఎనిమిది సర్పకులాల (ఇందులో అనంతశేషుడు భూమిని చుట్టుకుని ఉంటాడు) చెవులు, కళ్ళూ దెబ్బతిన్నాయి.

***************************************************************

ప్రతి తరంలోనూ కొంతమంది ప్రత్యేకమైన సాహిత్యకారులు పుడుతూ ఉంటారు. వీరి రచనలను అభిమానించేవారెంత మందో, వారి రచనలతో విభేదించి, విమర్శించే వాళ్ళూ అంతే మంది ఉంటారు. దీనికి బహుశా కారణాలు - పాండిత్యం, సిద్ధాంతం అవవచ్చును.  సంస్కృత నాటకకవులలో మురారి అలాంటి కవి. వాల్మీకి రామాయణం ఎంత సరళంగా ఉంటుందో, అనర్ఘరాఘవం అంత నారికేళపాకసదృశంగా ఉంటుంది. శ్రవ్యకావ్యాలలో మాఘం ఎంత జటిలమో, దృశ్యకావ్యాలలో అనర్ఘరాఘవం అంతే జటిలం.

మురారిపదచిన్తాచేత్ తదా మాఘే మతిం కురు |
మురారిపదచిన్తాచేత్తదా మాఘే మతిం కురు ||

అని ఒక అభాణకం.
 

మురారిపదచిన్తాచేత్ తదా= మురారి ఉపయోగించిన శబ్దాలగురించి తెలియాలంటే
మాఘే మతిం కురు = మాఘ కావ్యం (శిశుపాలవధమ్) మీద బుద్ధి పెట్టు.

మురారిపదచిన్తాచేత్ తదా = భగవంతుడైన శ్రీహరిపదములపై ధ్యాస కలుగాలంటే
అఘే మతిం మా కురు = పాపపు తలపులను మదిలో రానివ్వకు.


అఘము అంటే పాపము. 


మాఘమే ఎందుకు? అంటే - "నవశబ్దగతే మాఘే నవశబ్దో న విద్యతే" అని ఒక మాట. శిశుపాలవధమ్ లో తొమ్మిది సర్గలు చదివితే ఆ పైన సంస్కృతంలో కొత్త శబ్దాలు ఏవీ మిగలవు అని. అలా సంస్కృతం మొత్తం నేర్చుకుని అనర్ఘరాఘవం చదువమని సూచన.

(పై శ్లోకం యుగ్మకం అనే యమకాలంకారభేదానికి ఉదాహరణ)

యే శబ్దశాస్త్ర నిష్ణాతాః యే శీలిత నిఘంటవః |
తేషామేవ అదికారోऽస్తి మురారికృతనాటకే ||

ఎవరైతే శబ్దశాస్త్రంలో నిష్ణాతులో, ఎవరైతే నిఘంటువులను క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నారో వారికే మురారినాటకం మీద అధికారం ఉండగలదని అభాణకం.

బానే ఉంది, కానీ భరతముని నిర్దేశించిన నాట్యకళ ఉద్దేశ్యం ఈ demandsలో పొసుగుతుందా అని సందేహం.

దుఃఖార్తానాం శ్రమార్తానాం, తాపార్తానాం, తపస్వినామ్ |
విశ్రాన్తిజననం లోకే నాట్యమేతద్భవిష్యతి ||

దుఃఖార్తులకు, శ్రమార్తులకు, తాపార్తులకూ, తాపసికులకు, సకలసామాజిక వర్గాలకూ విశ్రాన్తి కారణంగా నాట్యం (Drama) పుడుతుంది. (ఈ సాహిత్యప్రక్రియ పండితులకు మాత్రమే అని చెప్పబడలేదు)

ఏదేమైనా మురారి పండితుని అనర్ఘరాఘవం ఒక గొప్ప పాండిత్యప్రకర్షకు కొలమానంగా నిలబడిన నాటకం. రామాయణాన్ని సమగ్రంగా చిత్రించిన నాటకాలలో మొదటిది భవభూతి మహావీరచరితమ్ అయితే రెండవది అనర్ఘరాఘవమ్. ఆధునిక కాలంలో ఈ నాటకం మీద వచ్చినన్నివిమర్శలూ, విశ్లేషణలూ దాదాపుగా మరే గ్రంథానికీ వచ్చి ఉండవు.  పాండిత్య ప్రకర్ష మీద ఆసక్తి స్వభావసిద్ధంగానే ఉన్న తెలుగు వారికి ఈ నాటకం అభిమానపాత్రమయ్యింది. ఈ నాటకానికి అనుసరణలూ, ప్రత్యక్ష, పరోక్ష అనుకరణలూ ఇత్యాదులు కూడా చాలా ఎక్కువ.

ఈ నాటకం తాలూకు కొన్ని ముచ్చట్లు .

***************************************************************

వాల్మీకి శివధనుర్భంగం గురించి ఒక వ్యాసం లో వివరిస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక చక్కని విషయం చెప్పారు. ఆ ఘట్టం ఆయన వ్రాతలోనే చూద్దాం.


జనకుడు శివధనుస్సును గూర్చి పెద్దగా చెబుతాడు. విశ్వామిత్రుడు అదంతా విని అతిసామాన్యవిషయంగా "వత్స రామ! ధనుః పశ్య" అంటాడు. రాముడు చేతితో తాకుతానన్నాడు. జనకుడు విశ్వామిత్రుడు కానిమ్మంటారు. రాముడు ధనుస్సునెక్కుపెట్టడానికి ప్రయత్నిస్తే అది మధ్యలో విరుగుతుంది. ఈ సందర్భంలో వాల్మీకి రెండే శ్లోకాలు వ్రాస్తాడు. వాటిలో కూడా ఏమీ సంరంభం లేదు. అతి సామాన్య విషయంగా చెబుతాడు.

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః
భూమికంపశ్చ సుమహాన్, పర్వతస్యేవ దీర్యతః

(ఆ శబ్దం పిడుగుపాటుకు సమంగా చాలా ఘనంగా ఉంది. భూమి, పర్వాతాలు ఒక్క పట్టున కంపించినట్టుగా అయినది)

నిపేతుశ్చ నరాస్సర్వే తేన శబ్దేన మోహితాః
వర్జయిత్వా మునివరం, రాజానం తౌ చ రాఘవౌ

(ఆ శబ్దం చేత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, జనకుడు తక్క అక్కడున్న ప్రజలంతా నిశ్చేష్టులైనారు )

ఇతరకవులిచ్చట భయంకరమైన "శాబ్దికకోలాహలం" చేసినారు. వాల్మీకికి రాముని జీవితంలో శివధనుర్భంగం సామాన్యవిషయంగానే తోచింది.


ఆచార్యుల వారు పేర్కొన్న శాబ్దిక కోలాహలం - "దోర్బలదళత్కోదండకోలాహలః" అన్న మురారి గురించే అయి ఉండవచ్చు. అనర్ఘ రాఘవం ఒక దృశ్యకావ్యం. అంటే స్టేజి మీద ప్రదర్శించబడే నాటకం. స్టేజ్ మీద ప్రదర్శింపబడేప్పుడు ధనుర్భంగం తాలూకు భీకర ధ్వని ప్రభావాన్ని - సామాజికులకు సమర్థంగా ఎలా చెప్పాలి? 


నాటకంలో జరిగిన, జరుగబోయే ఘటనలను పాత్రల ద్వారా ప్రత్యక్షంగా కాక పరోక్షంగా చెప్పే ప్రక్రియకు విష్కంభకం అని పేరు. అవి పలువిధాలు. చూళిక, ఆకాశభాషణం, ప్రవేశికము, జనాంతికము,అంకాశ్యము, అంకావతారము ...ఇలా. స్టేజ్ పైన చెప్పలేని, చెప్పకూడని విషయాలను సూచించడానికి, అనవసరకథన నివారణకూ ఈ ప్రక్రియలనుపయోగిస్తారు. శివధనుర్భంగఘట్టం అందుకు అనువైనది. అయితే ఈ విష్కంభకం అంకం ఆరంభంలో రావాలి. పైగా ఈ ఘట్టం ఉన్న తృతీయాంకంలో ఒక విష్కంభకాన్ని కవి మరొక సన్నివేశం కోసం ఉపయోగించాడు. ఈ కారణాల వల్ల ఇక్కడ విష్కంభకం కుదిరి ఉండకపోవచ్చు. బహుశా అందుచేత ఈ కవి పై పద్యాన్ని లక్ష్మణుని నోట పలికిస్తాడు. ధనువు విరిగే శబ్దాన్ని ప్రేక్షకులకు ప్రతీయమానం చేయడానికి "ష్ట" అనుప్రాసను ఉపయోగిస్తూ, శార్దూల వృత్తంలో ప్రౌఢంగా కూర్చాడు.

ఈ శాబ్దిక కోలాహలానికి మరో కారణం కూడా కనిపిస్తున్నది. వాల్మీకి మార్గం ధ్వని మార్గం. అంటే చెప్పదలుచుకున్న దానిని అందంగా, అలవోకగా, వ్యంగ్యంగా చెబుతాడు. ఆ మహాకవి రాముని భగవత్స్వరూపుడని ధ్వని పూర్వకంగా సూచిస్తాడు. ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి ప్రయత్నించడు. అనర్ఘ రాఘవం - అనర్ఘం అంటే అమూల్యము, పూజ్యము అని అర్థం అనర్ఘః రాఘవః యస్మిన్ తత్ - అనర్ఘరాఘవం అంటే - పూజుడైన రాముని చరితమే అనర్ఘరాఘవం. ఈ పేరు ద్వారానే కవి స్థాపించదలుచుకున్న విషయం స్పష్టం. రాముని విష్ణ్వంశప్రతిపాదనే ఈకావ్యలక్ష్యం. అందుకే మురారి రాఘవుడు దైవాంశ సంభూతుడిగా ఉంటూ, అటువంటి కార్యాలనే చేస్తాడు. ఆ కార్యాల ప్రభావమూ అలానే ఉండటం సహజం. అందులో భాగంగా ఈ పద్యాన్ని అన్వయించుకోవలసి ఉంటుందేమో.

***************************************************************

అలా శివధనుర్భంగం జరిగింది.

అప్పుడు శతానందుడిలా అన్నాడు.

వైదేహీకరబంధమంగళయజుస్సూక్తం ద్విజానాం ముఖే
నారీణాం చ కపోలకందళతలే శ్రేయాన్ ఉలూలు ధ్వనిః |
పేష్టుం చ ద్విషతాముపశ్రుతిశతం మధ్యేనభో జృంభతే
రామక్షుణ్ణమహోక్షలాంఛనధనుర్ధంభోళి జన్మా రవః ||

రామక్షుణ్ణ = రామునిచే విరుగగొట్టబడిన
మహోక్షలాంఛనధనుర్ధంభోళి జన్మా రవః = చిచ్చరకంటి వాని ధనుస్సు అనబడే వజ్రాయుధం నుండి పుట్టిన ధ్వని
ద్విజానాం ముఖే = బ్రాహ్మణ ముఖమునందు
వైదేహీకరబంధమంగళయజుస్సూక్తం = సీత పాణిగ్రహణసమయంలో మంగళ వేదనాదమై
నారీణాం చ కపోలకందళతలే = సామాజికులైన స్త్రీల చెక్కిళ్ళలో
శ్రేయాన్ ఉలూలు ధ్వనిః = మంగళమైన "ఉలూలు" అనే ధ్వని గా
ద్విషతాం = శత్రువులకు
ఉపశ్రుతిశతం = అశుభసూచక శకున వాక్యముల శతమై
పేష్టుం చ = (ఆ శత్రువుల) పిండీకరణమునకు
నభః మధ్యే = ఆకాశమధ్యమున
జృంభతే = కొనసాగింది.

ఇక్కడ "ఉలూలు" ధ్వని అన్నది గమనించదగినది. ఈ ధ్వని ఏ ప్రాంతపు స్త్రీలు చేస్తారో ఏమో? Chinna Thambi movie Aracha santhanam Tamil video songs

అనర్ఘరాఘవం నిండా ఇటువంటి చమత్కృతులు కోకొల్లలు. అలాగే ఒక్కో పద్యమూ ఆలోచిస్తే, అనుశీలిస్తే ఎన్నో విషయాలు చెబుతుంది. అనర్ఘరాఘవం కావ్యం గురించి పండితులు మాత్రమే మథించి చెప్పాలి. అలా చెప్పగలిగితే అది చాలా గొప్ప విలువైనది అవుతుంది.

***************************************************************

చివరగా నాకు నచ్చిన అందమైన వృత్త్యనుప్రాస పద్యం

వందారుబృందారకబృందబందీమందారమాలామకరందబిందూన్ |
మండోదరీయం చరణారవిందరేణూత్కరైః కర్కశతామనైషీత్ ||

వందారు = నమస్కరించుచున్న
బృందారక = దేవతాస్త్రీ
బృంద = సమూహముల
బందీ = బంధినుల
(రావణుడు బంధించి తెచ్చిన దేవతాస్త్రీల)
మందారమాలా = (కొప్పుల్లో తురుముకున్న) పారిజాత మాలలనుండి
మకరంద బిందూన్ = తేనెచుక్కల
ఇయమ్ మండోదరీ = ఈ మండోదరీ
చరణ అరవింద రేణు ఉత్కరైః = తామరల వంటి పాదముల నుండి ఎగసిన ధూళి
కర్కశతాం అనైషీత్ = కర్కశత్వముని పొందింది.

రావణుడు బంధించి తెచ్చిన దేవతాస్త్రీలు మండోదరికి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ తలల్లో తురుముకున్న పారిజాతసుమాల మకరందం తొణికి ఈమె పాదాల దగ్గర పడింది. ఆ మకరందం ఈమె పాదధూళితో కలిసి గట్టిగా మారింది. (అలాంటి మండోదరికి నేడు ఎంత దయనీయమైన స్థితి వచ్చిపడింది!)

మురారేః తృతీయా పంథా అని ఒక సామెత ఒకటి ఉన్నది.

దృశ్యకావ్యం (నాటకం), శ్రవ్యకావ్యం అని రెండు సంవిధానాలు సాహిత్యంలో ఉంటే మురారి దృశ్యకావ్యంలో శ్రవ్యకావ్యలక్షణాలను మేళవించాడని ఈ మాట వచ్చిందంటారు. అందుకు ఈ కావ్యంలో ముఖ్యంగా రెండవ అంకాన్ని, అందులో ప్రబంధస్థాయి వర్ణనలను ఉదహరిస్తూ చెప్పినప్పటికీ, దాదాపు కావ్యమంతానూ అందుకు ఉదాహరణగానే చెప్పవచ్చు.

ఈ మాట అనర్ఘరాఘవ కర్తకు కాదని, వ్యాకరణపండితుడైన మరొక మురారిని గురించి చెప్పినదని కొందరు.

***************************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.