31, జనవరి 2014, శుక్రవారం

సంస్కృతసౌరభాలు - 15

ఇప్పటికి సరిగ్గా ఒక తరం క్రిందటి ప్రజానీకానికి ఆకాశవాణి తమ జీవితంలో ఒక భాగం. ఆకాశవాణి తో అణుమాత్రం పరిచయం ఉన్న వారికి ఎవరికైనా ఈ క్రింది పద్యం తెలిసి తీరుతుంది.

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజాః |
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేऽఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||

మనిషికి భుజకీర్తులు, చంద్రునిలా ఉజ్జ్వలంగా మెరిసే ముత్యాలహారాలు, స్నానం, గంధలేపనాలు, పువ్వులు, శిరోజాऽలంకరణలూ శోభనివ్వవు. శాస్త్ర సంస్కారము కలిగిన వాక్కు ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. అన్ని భూషణాలు నశిస్తాయి కానీ వాగ్భూషణం మాత్రమే నిజమైన భూషణంగా నిలిచి ఉంటుంది.

బాల్యంలో ఒక వ్యక్తి చుట్టూ ఉన్న సంఘటనలు, చిన్న చిన్న అంశాలు ఎంత చిన్నవైనా జీవితంలో గొప్ప ప్రభావం చూపిస్తాయి. ఏ ఉత్తమ సంస్కారానికైనా ఎక్కడో ఒక చోట చిన్న బీజం ఉండక తప్పదు. చాలామంది జీవితాలలో ఈ పద్యం అలాంటి ఉత్తమ సంస్కారబీజం అయి ఉంటుంది. వారి సంస్కారానికి కారణం ఈ బీజం అని మరిచిపోయి కూడా ఉండవచ్చు గాక.

పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వాల్మీకి రామాయణం గురించి వ్రాసిన ఒక అపూర్వమైన వ్యాఖ్యలో ఒక మాట అన్నారు. వాల్మీకిని ఒక మలయాళీ "అరే వాల్మీకి సంస్కృతం మన మలయాళానికి ఎంత దగ్గరగా ఉంది" అని, అలాగే హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు వాళ్ళు ఇలా అందరు ఎవరికి వారు తమ భాషకు దగ్గరగా వాల్మీకి సంస్కృతం ఉన్నట్టు భావిస్తారట. చాలా అనాయాసమైన భాష వాల్మీకి మహాకవిది. శ్రీశ్రీ కూడా ఓ మారు - "సంస్కృతం నాకురాదు కానీ, వాల్మీకి రామాయణం చదివితే అర్థం అయినట్టే ఉంటుంద"ని చెప్పారుట. వాల్మీకి తరువాత ఆ విధమైన "మన" అన్న భావనను కలిగించిన సంస్కృత కవి బహుశా భర్తృహరి కావచ్చు. భర్తృహరి నీతి, శృంగార వైరాగ్యశతకాలు రచించాడు. ఇందులో నీతి శతకం అగ్రగణ్యమైనది. భర్తృహరి నీతి శతకంలో చాలా శ్లోకాలు అనేకులకు తెలిసి ఉంటాయి. అందునా తెలుగు వారికి అనువాదాల ద్వారా ఈ కవి మరింత చేరువ అయి, మహాప్రీతిపాత్రుడైనాడు.

జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయే జరామరణజాం భయమ్ ||

పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే్
స జాతో యేన జాతేన యాతి వంశస్సమున్నతిమ్ ||

కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః
మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ||

యస్యాస్తి విత్తం స నరః కులీనః స పణ్డితః స శ్రుతవాన్ గుణజ్ఞః |
స ఏవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయన్తి ||

దానం భోగో నాశస్తిశ్రో గతయో భవన్తి విత్తస్య |
యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ||

దుర్జనః పరిహర్తవ్యః విద్యయాऽలంకృతోపి సన్ |
మణినా భూషితస్సర్పః కిమసౌ న భయంకరః? ||

ఇలా ఎన్నో శ్లోకాలు అర్థం కూడా వివరించనవసరం లేకుండానే చాలామందికి తెలుసు. భర్తృహరి నీతి శతకం అనువాదంలోని ఒక పద్యపాదం ఒకానొకప్పుడు దినపత్రికలో న్యూస్ హెడింగ్ గా వచ్చింది. పీ వీ నరసింహారావును పదవీచ్యుతుని చేయడానికి స్వయంగా ఆయన శిష్యుడు సీతారాం కేసరి ప్రయత్నించిన సందర్భమది. ఆ శీర్షిక ఇది - "భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే?"

భర్తృహరి చెప్పిన "మూర్ఖుని" గురించి ఇక వివరించనవసరమే లేదు. నీతిశతక ఆరంభమే మూర్ఖపద్దతితో ఆరంభమవుతుంది. తివిరి ఇసుమున తైలంబు తీసిన వాడిని, సముద్రంలో ఒక చుక్క తేనె కలిపి తీయగా మారుద్దామనుకునే వాణ్ణి, కుందేటికొమ్ము సాధిద్దామనుకునే వాణ్ణి.....ఎవరు గుర్తుంచుకోరు? ఇక ఆరంభింపని నీచమానవుడూ, దైవోపహతుడైన ఖర్వాటుడూ, ఒకచో నేలను పవ్వళించు ప్రయత్న శీలి, పరోపకారార్థమిదం శరీరం అనుకునే పరోపకారి ఇలా ఎందరో మనకు తెలుసు. భర్తృహరిని మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైనాడు. ఈ ఒక్క వ్యక్తి వ్రాసిన ఒక్క శతకాన్ని చదవడం కనీసం వంద పుస్తకాలను చదివిన పెట్టు. ఈ కవి తెలుగు వారికి చాలా దగ్గర అయినాడు. భర్తృహరి నీతిశతకానికి ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి వంటి ప్రముఖులు తెనుగు చేశారు. వారు మన భాషలో, భావంలో, సంస్కారంలో, మన హాస్యంలో, పలుకుబళ్ళలో, అణువణువునా ఇమిడిపోయారు.

సంస్కృతంలో అనేక కవులలానే ఈ కవి గురించి కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. కొన్ని కథనాల ప్రకారం ఈయన బౌద్ధం స్వీకరించిన హిందువు. బౌద్ధంలో భిక్షువులసంఘంలో ధ్యానంలో ఆయా వ్యక్తులు సాధించిన పరిణతిని బట్టి వారి పదవి/పిలుచుకునే పేరు ఉంటుంది. శ్రోతాపన్నుడు, సకృదాగామి, అనాగామి, అర్హతుడు ...ఇలా. సంఘంలో చేరినవాళ్ళు ఏదైనా అపరాధం చేసో లేక బౌద్ధం విరమించుకుంటేనో వాళ్ళు సంఘబహిష్కృతులవుతారు. అలా బహిష్కృతులైన వాళ్ళు తిరిగి సంఘంలో చేరవచ్చు. అలా చేరదల్చుకుంటే తిరిగి వారు మొదటి మెట్టు దగ్గర శ్రోతాపన్నుడుగా ఆరంభించవలసి ఉంటుంది. భర్తృహరి బౌద్ధంలో చేరటం, సంఘబహిష్కృతుడవటం, తిరిగి చేరిక, తిరిగి బహిష్కృతుడవటం ...ఇలా ఏడు సార్లు జరిగిందట.

సూక్ష్మంగా పరిశీలిస్తే భర్తృహరి కవిత్వంలో ఒక విషయం గమనించవచ్చు. నీతి సామాన్యంగా రెండు విధాలు. ఒకటి సామాజికం, రెండు వ్యక్తినిష్టం. సామాజికనీతి అంటే పదిమంది దగ్గరా అబద్ధాలు చెప్పకపోవటం, సత్యవాక్పరిపాలన, పితృ వాక్యపరిపాలన, పెద్దలను సేవించటం, భార్యాబిడ్డల పట్ల అనురక్తీ వగైరా వగైరా. అలాకాక ధ్యానతత్పరతకు సంబంధించిన బోధ - బుద్ధబోధ, అష్టావక్రసంహిత...ఈ కావ్యాల నీతి కేవలం ఆధ్యాత్మికమైనది. దీనికి అనుభవప్రమాణమే సాక్షి. ధ్యానం ప్రేరణ.

భర్తృహరి నీతి లో సామాజికమైన ఉద్బోధ కనిపించదు. అలాగని పూర్తిగా ఆధ్యాత్మికప్రవచనం లా కూడా ఈ నీతి లేదు. ఈ కవి నీతి - మానవుల స్వభావాలలో వివిధ వైరుధ్యాలను సహజసిద్ధంగా దృష్టాంతీకరించడంలో ఉన్నది. బహుశా ఈ కవి అనేక వ్యక్తులను, వ్యక్తిత్వాలను దగ్గరగా చూచి ఉంటాడు. సూక్ష్మంగా పరిశీలించి ఉంటాడు. పూర్తిగా ఆధ్యాత్మికం కాక, సమాజంలోనూ ఇముడలేక వ్యక్తావ్యక్త భావనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ కావ్యం రచించి ఉంటాడు. ఒకానొక కథ ప్రకారం ఈయన రాజు. రాజ్యం త్యజించి తన తమ్ముడిని పట్టాభిషిక్తుని చేసి అరణ్యాలకు మళ్ళిన వాడు.

ఏమో, భర్తృహరి ఎవరైనా కానీ, ఆయన చరిత్ర ఏదైనా కానీ, ఆయన ఎన్నో తరాలకు తరగని నిధిని అందించి, ఋణభారం మోపి కనుమరుగైన మహర్షి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.