సంస్కృతసౌరభాలు - 14


రస్యతే, ఆస్వాద్యతే అనేనైవ రసః

రససిద్ధాంతం సంస్కృత లాక్షణిక సిద్ధాంతాలలో ముఖ్యమైనది. రసం అంటే కావ్యం వలన జనించే ఒక లోకోత్తరమైన అనుభూతి. కావ్యానికి సంబంధించి రసం తాలూకు స్థితి ఎక్కడ నిరూపితమై ఉంటుంది అన్న విషయానికై ఉద్భటుడు అనే లాక్షణికుడు ఒక ప్రతిపాదన చేశాడు.

- "వాచి వస్తున్యపి రసస్థితిః"

రచనాసంవిధానం లోనూ, వస్తువు అంటే - ఇతివృత్తంలోనూ రసస్థితి ఉంటుంది. ఇతివృత్తం అంటే - పాత్ర చిత్రణ, సన్నివేశకల్పనల సమాహారం. దృశ్యనాటకాలకు సంబంధించిన సంవిధానాలలో - స్థూలంగా ముఖ్యమైన రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భాస, శూద్రకాదులకు సంబంధించిన వస్తునిర్వహణ ద్వారా రసస్ఫూర్తి కలిగించే ధోరణి, రెండవది రచనా శైలి, శిల్ప చాతుర్యాదుల ద్వారా రసనిష్పందం కలిగించగల భవభూతి కాళిదాసాదుల ధోరణి. అభినేయమైన కృతులు భాసకవివైతే నాటకీయమైన కావ్యాలు భవభూతికాళిదాసాదులవి.

మొదటిది నాట్యకళ, రెండవది కావ్యకళ.

ఈ ధోరణులలో భాసమహాకవి మార్గానికి చెందిన మరొక కవి దిజ్ఞాగుడు లేదా ధీరనాగుడు. ఈ కవి రచించిన అపూర్వమైన నాటకం పేరు కుందమాల. కుందమాల అంటే మల్లెపూదండ అని అర్థం.

**********************

అభినవరచితాని దేవతానాం జలకుసుమైర్బలిమన్తి సైకతాని |
ఇయమపి కురుతే తరంగమధ్యే భుజగవధూలలితాని కుందమాలా ||

**********************

లోకాపవాదభీతికి భయపడి రాముడు సీతను పరిత్యజించాడు. ఆమెను అటవిలో విడిచిరావడం లక్ష్మణుని వంతయ్యింది. ఆపై వాల్మీకి ముని సీతను చూచి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆశ్రయం కల్పించాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు కలిసి గోమతీ నదీ తీరంలో వాల్మీకి దర్శనార్థం వెళుతున్నారు. అప్పుడు -

దేవతలకోసం నీటిచేత, పూలచేత బలులు సమర్పించినట్టుగా నవ్యంగా ఉన్న ఇసుకతిన్నెలు. ఆ నది తరంగాల మధ్యలో నాగవధువులా లలితంగా అందాలు చిందుతున్న మల్లెపూదండ తేలుతూ వచ్చింది.

లక్ష్మణుడు రామునితో చెప్పాడు.

"ఆశ్చర్యంగా ఉన్నది! ఈ సముద్రందిశగా తరలి వెళుతున్న ఈ నదీదేవత ఆర్యుల సేవకోసమా అన్నట్టు తరంగాల ద్వారా ఈ పూదండను మీ పాదసన్నిధికి చేర్చింది. ఎంతో ముచ్చటగా అల్లిన, ప్రేక్షణీయమైన ఈ పూదండను చూడు ఆర్యా"

ఏషా కుందమాలా అవహితం ప్రేక్షణీయా విరచనా - తప్పక చూడదగినదైన విశిష్టమైన కూర్పు - అని లక్ష్మణుని ద్వారా సూచిస్తాడు కవి.

ఈ నాటకం ప్రేక్షణీయమైనది. అంటే - సన్నివేశప్రధానమైనది.

**********************

భాస మహాకవి లోని క్లుప్తత, స్వతంత్రత, నాటకీయత, పాత్రల అత్యంతసహజప్రవర్తన - వీటినన్నిటినీ పుణికి పుచ్చుకుని చేసిన అందమైన రచన కుందమాల. ఇది రామాయణాధారితమైన ఆరు అంకాల నాటకం. సీతారాముల వియోగంతో మొదలై, సీత తన తనయులైన లవకుశులతో, రాముని కలుసుకోవడంతో సుఖాంతమవుతుంది. భాసమహాకవి కైకేయిని ప్రతిమానాటకంలో విప్లవాత్మకంగా వాల్మీకి రచనకు విభిన్నంగా కరుణరసాత్మకంగా తీర్చిదిద్దాడు. అదే విధంగా కుందమాల రచయిత విదూషకుని పాత్రను ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. దిజ్ఞాగుని విదూషకుడు తిండిపోతు, వెకిలిమాటలవాడు కాదు. రాముని మనసును, సీత మనసునూ కూడా గ్రహించినవాడు, ఒక ముఖ్యపాత్రధారి. కవి తాలూకు నాటకశిల్పంలో ప్రధానమైన పాత్ర.

అంతకంటే గొప్పగా చెప్పుకోవలసిన పాత్ర సీతది. కుందమాల లోని సీత అత్యంత సహజస్త్రీ స్వభావము కలిగినది. గొప్ప అభిమానవంతురాలు.

ఐదవ అంకం -

రాముడు చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆతడిని విదూషకుడు మాటలలో పెట్టి దుఃఖాన్ని ఉపశమింపజేస్తున్నాడు. ఇంతలో కుశలవులకు వాల్మీకి మహర్షి అతిథులను గానంతో సంతోషింపజేయమని పంపాడు.

కుశలవులు రాముని వద్దకు వెళుతుంటే - చిన్నవాడైన లవుని అమ్మ చాటుగా పిలిచి - రాజు దగ్గర నెమ్మదిగా నడుచుకొమ్మని దుడుకుగా వ్యవహరించవద్దని చెప్పి పంపుతుంది. ఇద్దరూ రాముని వద్దకు వచ్చారు. రాముడికి విచిత్రమైన భావశబలత కలిగింది. వారిని తొడపై కూర్చుండబెట్టుకుని తనకు కుమారులుంటే వీరి వయసే ఉంటుంది కదా అనుకొన్నాడు. అప్పుడు రాముడు వారిని ప్రశ్నిస్తాడు.

మీ వంశమేది?
సూర్యవంశము.
మా వంశమే.మీ ఇద్దరి వయస్సులలో అంతరమున్నదా?
మేము కవలలము.
పెద్ద ఎవరు?
కుశుడు.
మీ గురువులెవరు?
వాల్మీకి మహర్షి
శరీరప్రదాతయైన తండ్రి యెవ్వరు?
లవుడు:తెలియదు. ఈ తపోవనమున ఎవ్వరూ వారిని పేరుతో పిలువరు.
అహో మహత్మ్యము.
కుశుడు: నాకు తెలుసును.
చెప్పు
"నిరనుక్రోశుడు"
రాముడు: విదూషకునితో - పేరు అపూర్వంగా ఉంది కదూ?
విదూషకుడు: అలా ఎవరు పిలుస్తారు?
అమ్మ
కోపంగా ఉన్నప్పుడా? ఎప్పుడూనా?
మేం మారాం చేసినప్పుడు "నిరనుక్రోశుని కుమారులారా! అల్లరి చేయకండ్రా" అంటుంది.
...
..
నాయనలారా మీ తల్లి పేరేమి?
మా అమ్మకు రెండు పేర్లు. "దేవీ" అని అందరూ, "వధూ" అని మహర్షులవారూ పిలుస్తారు.
..
..

**********************

నిరనుక్రోశుడు - అంటే దయాదాక్షిణ్యాలు లేని వాడు అని అర్థం. ఈ ఘట్టం ద్వారా సీత హృదయం తాలూకు వేదనను (వాచ్యం చేయకుండా వ్యంగ్యంగా) అపూర్వంగా చెబుతాడు కవి. మొదటి అంకంలోనూ ఇదే శబ్దం ఉపయోగిస్తుంది సీత. కుందమాలలోని సీత రాముని ప్రశ్నించడానికి వెరవదు. పరిత్యాగ ఘట్టంలో సీత మాట్లాడిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. నిజానికి ఈ కావ్యంలోని ఉదాత్తత అంతా సీత శోకాన్ని, తనయొక్క సహజమైన స్త్రీ స్వభావాన్ని చిత్రించడంలోనే ఉన్నది. స్వప్నవాసవదత్తం, విక్రమోర్వశీయం, శాకున్తలం, ఉత్తరరామచరితం - ఇలా సంస్కృతంలో ప్రధానమైన నాటకాలన్నిటిలోనూ కావ్యనాయకుని దుఃఖాన్నే ఆయా కవులు ప్రధానంగా చిత్రించారు. వారి విరహవేదనను కరుణరసాత్మకంగా ఉద్యోతించారు. ఈ పరంపరకు వ్యతిరేకంగా దిజ్ఞాగుడు చేసిన సాహసం - అదీ underplay చేస్తూ, సీత మానసికవేదనను, అదే సమయంలో ప్రేమనూ, తనను భర్త త్యజించాడన్న అపరాధభావాన్ని చిత్రించడం అపూర్వం. ఇది తెలియాలంటే ఈ నాటకం ఎవరికి వారు చదువుకోవాలి. లేదా కూలంకషంగా వ్యాసం ద్వారా ఎవరైనా చర్చించవలసి ఉంటుంది.

**********************

తనను రాముడు పరిత్యజించాడని లక్ష్మణుడు చెప్పగా సీత చెప్పిన సమాధానం ఇది.

"అగ్నిశుద్ధిసంకీర్తనేన ప్రతిబోధితాऽస్మి. రావణభవనోదన్తః పునర్ప్యుద్బాధయతి. సీతాయా అపి నామ ఏవం సంభావ్యత ఇతి సర్వథాऽలం మహిళాత్వేన. ఏవం పరిత్యక్తా. నను పరిత్యక్తాऽస్మి. కిన్న ఖలు యుక్తం మమార్యపుత్రపరిత్యక్తమాత్మానం పరిత్యక్తుమ్? కిన్న ఖలు తస్యైవ నిరనుక్రోశస్య సమాన ఏవ ప్రసవః ప్రేక్షితవ్య ఇతి వచనీయకణ్ఠకోపహితం జీవితం పరిరక్షామి."

"అగ్నిచేత పరిశుద్ధురాలనైనానని కీర్తి బడసితిని. ఇప్పుడు రావణనివాసంలో జరిగిన అగ్నిప్రవేశఘట్టం తిరిగి గుర్తుకు వచ్చి బాధిస్తున్నది. సీతకే ఈ విధమైన గౌరవం దక్కితే - స్త్రీత్వమే ఇక చాలు. పరిత్యక్తనైనాను. నిజంగానే పరిత్యక్తనైనాను. ఆర్యపుత్రుడే విడిచివేయగా ఇక నన్ను నేను త్యజించడం యుక్తమా? కాదేమో? ఆ నిష్టురాత్మునితో సమానమైన ఈ గర్భాన్ని నిలుపుకోవాలి కాబట్టి ఆ కారణం చేత ఈ బ్రతుకును ఎలానో వెళ్ళదీస్తాను."

ఒక స్త్రీపాత్రతో ఆ నాడు ఇంత సాహసోపేతమైన మాట అనిపించిన కవి బహుశా దిజ్ఞాగుడు ఒకడేనేమో!

**********************

అడవిలో సీతను చూచి జంతువులు పక్షులూ కూడా దుఃఖించాయని కాళిదాసు చెబుతాడు.

నృత్తం మయూరాః కుసుమాని వృక్షాః దర్భానుపాతాన్ విజుహుర్హరిణ్యః
తస్యాః ప్రపన్నం సమదుఃఖభావం అత్యన్తమాసీత్ రుదితం వనేపి || (రఘువంశం ౧౪ వసర్గ, ౬౯ వశ్లోకం)

నెమళ్ళు నృత్యాన్ని, చెట్లు పూలనూ, జింకలు గడ్డినీ వదిలాయి.
వాటికి సీత మనసులో ఉన్న దుఃఖానికి సమంగా దుఃఖం కలిగి ఏడుస్తున్నవి.

కుందమాలాకారుడూ వ్రాశాడు.

ఏతే రుదన్తి హరిణా హరితం విముచ్య
హంసాశ్చ శోకవిధురాః కరుణం రుదన్తి
నృత్తం త్యజన్తి శిఖినోऽపి విలోక్య దేవీం
తిర్యగ్గతా వరమమీ న పరం మనుష్యాః

జింకలు గడ్డిని వదలి దుఃఖిస్తున్నాయి. హంసలు శోకంతో కుమిలి కరుణకలిగేలా ఏడుస్తున్నాయి. నెమళ్ళు కూడా సీతను చూచి నృత్యం మానివేశాయి. ఇవన్నీ అనుకున్నాయి - "మేమే అనుకున్నాము, మనుష్యులు కూడా తిర్యక్కులే"

(తిర్యక్కులు - అంటే పునరుత్పత్తి స్థానం భూమివైపుగా తిరిగి ఉన్న పశుపక్ష్యాదులు. మనుషుల బుద్ధి కూడా తిరగబడి ఉందే అని పైన శ్లోకంలో శ్లేష)

**********************

కుందమాల మూడవ అంకం - భాసుని స్వప్నవాసవదత్తం నాటకం నాలుగవ అంకాన్ని పోలి ఉంటుంది.  రామలక్ష్మణులిద్దరూ గోమతీ తీరంలో వెళుతుంటే - రాముని దుఃఖం నుండి దృష్టి మరల్చడానికి లక్ష్మణుడు గోమతీనదిని వర్ణిస్తాడు.

మరకత హరితానామంభసా ఏకయోనిః
మదకల కలహంసీ గీతరమ్యోపకంఠా |
నళినవనవికాసైః వాసయన్తీ దిగన్తాన్
నరవర పురతస్తే దృశ్యతే గోమతీయమ్ ||

మరకత మణిలా మెరుస్తున్న నీటితో ఉన్నది, మదంతో కలరవం చేస్తున్న కలహంసలగీతాలతోనూ, వికసించిన తామరపూల సువాసనలతోనూ దిక్కులను నింపుతున్న మన ముందున్న ఈ గోమతీ నదిని చూడు.

రాముడు:

ముక్తాహారాః మలయమరుతశ్చందనం చంద్రపాదాః
సీతాత్యాగాత్ ప్రభృతి నితరాం తాపమేవా వహన్తి |
అద్యాకస్మాద్రమయతి మనోగోమతీతీరవాయుః
నూనం తస్యాం దిశి నివసతి ప్రోషితా సా వరాకీ ||

ముత్యాలహారాలు, మందమారుతం, చందనం, వెన్నెలా సీతను కోల్పోయిన తర్వాత తాపాన్ని పెంచాయి. ఇప్పుడేమో హఠాత్తుగా ఈ గోమతీనదీ తీరవాయువులు సీత ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా ఎందుకనో మనసును తీవ్రంగా రంజింపజేస్తున్నాయి.

పై పద్యం మందాక్రాంతం. మందాక్రాంత వృత్తాన్ని ప్రధానంగా విరహాన్ని ఉద్యోతించడానికి ఉపయోగిస్తారు (కాళిదాసు మేఘదూతం).

లక్ష్మణుని శ్లోకంలో వర్ణన - రాముని భావనలో విరహం. అంతలో కుందమాల కనిపిస్తుంది. ఇదీ సన్నివేశం.

**********************

కుందమాల గురించి చెప్పాలంటే - ఒక్క అనన్వయాలంకారంలోనే చెప్పగలమని నా అభిప్రాయం. కుందమాల - నిజంగా కుందమాలయే.

ఈ నాటకం గురించి ఎంతో వ్రాయవచ్చు. ఎన్నో వ్యాసాలూ వచ్చినట్లు భారతి, ఆంధ్రపత్రిక ఇత్యాది పాత సంచికలలో కనిపిస్తుంది. అయితే కూలంకషంగా ఈ నాటక శిల్పాన్ని, సంధి సంధ్యంగాలను, పాత్రోచితిని, ఉదాత్తతను, అంగ్యంగ రసావిష్కరణనూ విమర్శించిన వారెవరో తెలియదు.

అన్నట్టు ఈ కావ్యాన్ని వెలికితీసి ప్రచురించనవారిలో ప్రథముడు - మానవల్లి రామకృష్ణకవి. ఈయన తెలుగువాడు కావడం గర్వకారణం.

ఈ రచయిత బౌద్ధుడా? హిందువా? భవభూతి ఈయనను కాపీ కొట్టాడా లేక ఈయనే భవభూతిని అనుసరించాడా? భవభూతి ఎలా ఈయనకంటే గొప్పవాడు? ఆచార్య దిజ్ఞాగుడు, ధీరనాగుడు ఒకరా వేరా? ఈయన కాలం ఎప్పటిది? - ఇలా అనవసర విషయాలను ఎందుకనో చాలా మంది తీవ్రంగా చర్చించారు. ఆంగ్లేయులు అంటించిన జాడ్యం ఇది.

మల్లెతోటలో ఉల్లికోసం వెతికే వెంగళప్పలకు మల్లెల సౌరభం ఎలా తెలుస్తుంది?

**********************

కామెంట్‌లు



  1. మల్లెల సౌరభాన్ని ఆఘ్రాణించ వలసిందే.ఒక కవిత లేక నాటకం,లోని రసస్ఫూర్తిని,గొప్పతనాన్ని తెలుసుకోవలసిందే.కాని,ఆ రచయిత కాలం,పుట్టుపూర్వోత్తరాలు,కూడా చర్చించి తెలుసుకోడానికి ప్రయత్నించవలసిందే.అవి సరిగా లేకపోడం వల్లనే మన చరిత్ర అంతా confusionలోఉంది.పాశ్చాత్యులు రెండు పార్శ్వాలూ పరిశోధించారు.అందువలన దాన్ని జాడ్యం గా భావించకూడదు.ఈవిషయంలో మీతో విభేదిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

Disclaimer

అశోకుడెవరు? - 1