సంస్కృతసౌరభాలు - 13



రజోజుషి జన్మని సత్త్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రలయే తమఃస్పృశే |
అజాయ సర్గస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మనే నమః ||

రజోజుషి జన్మని = సృష్టి జరిగే సమయంలో రజోగుణం వహించి
స్థితౌ సత్త్వవృత్తయే = స్థితి (రక్షణ) సమయంలో సత్వవృత్తిని కూడి
ప్రజానాం ప్రలయే తమఃస్పృశే = లయ సమయంలో తమస్సును చేబట్టిన
అజాయ = జన్మరహితుడైన వానికి (న జన్మః యస్యాస్తీతి అజః = జన్మము లేని వాడు అజుడు)
సర్గస్థితినాశహేతవే = పుట్టుక, రక్షణ, నాశములకు హేతువైన వానికి
త్రయీమయాయ = త్రిమూర్తి స్వరూపునకు
త్రిగుణాత్మనే = త్రిగుణాత్మునకు
నమః = వందనము.

భట్టబాణకవి కాదంబరి కావ్యారంభంలో మంగళాచరణం ప్రథమ శ్లోకం ఇది. సాధారణంగా దృశ్యకావ్యాలలో మంగళాచరణశ్లోకంలో అంతర్లీనంగా కథను సూచించడం ఒక సాంప్రదాయం. కాదంబరి ప్రధానంగా గద్యకావ్యం. ఈ మంగళాచరణశ్లోకంలో కాదంబరి కథను సూచించినట్లుగా వ్యాఖ్యాతలు వ్రాయలేదు. అయితే కాదంబరి కావ్యకథలో మూడు జన్మల వృత్తాంతం, మూలసూత్రమైన ప్రేమైకస్వరూపాన్ని కవి పైని శ్లోకంలో నిక్షేపించాడా అని ఎదో మూల అనుమానం కలుగుతుంది.

కాదంబరి కథను తూగుటుయ్యాల మీద అర్థనిమీలిత నేత్రాలతో విని "కాదంబరీః కాదమ్బరి" అని కాళిదాసు అన్నాడని ఒక కథ. కాదమ్బరి అంతే సుర. లలితాసహస్రనామాలలో 74 వ శ్లోకం లో "కాదమ్బరిప్రియా"  అన్న నామం ఉంది. కాళిదాసు ఈ మాట అన్నాడని శిష్యుడు చెబితే భట్టబాణుడు ఖేదపడి కాదమ్బరి ఒక అల్పకావ్యమని అగ్నికి అర్పణం చేశాడనీ, తిరిగి ఏకసంథాగ్రాహి ఐన కాళిదాసు తన మాటకు అర్థం కాదమ్బరి అమృతప్రవాహంలా ఉందని తన ఉద్దేశ్యమని వివరించి, తను విన్న కావ్యాన్ని యథాతథంగా ఒప్పజెపితే శిష్యుడు తిరిగి వ్రాసుకున్నాడని ఆ కథ. ఈ కథ కట్టుకథ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక్క విషయం సత్యం. కాదంబరి కావ్యం అంత మత్తు గొలిపే అద్భుత కావ్యం సంస్కృతంలోనే కాదు బహుశా ప్రపంచసాహిత్యంలోనే ఉండదు.

******************************************

చంద్రాపీడుడు: "దేవీ! జానామి కామరతిం నిమిత్తీకృత్య ప్రవృత్తోऽయం అవిచలసంతాపతంత్రో వ్యాధిః. సుతను! సత్యం న తథా త్వామేష వ్యథయతి యథాస్మాన్. ఇచ్ఛామి దేహదానేనాపి స్వస్థామత్ర భవతీం కర్తుమ్"
దేవీ! (నీ) అవ్యక్తమైన భావపు కామరతి (కాం - అరతి = ఏదీ సహించకపోవుట/ కామరతి = శృంగారేచ్ఛ) అనే వ్యాధిని నేను తెలుసుకున్నాను. అందమైన తనువు గల అమ్మాయీ! సత్యంగా నేనూ నీలానే వ్యథననుభవిస్తున్నాను. నా దేహదానంతోనైనా నిన్ను ఆరోగ్యవంతురాలిగా చేయగలను.

అమ్మాయి కాదంబరి చిరునవ్వు సమాధానం కాగా, ఆమె చెలికత్తె మదలేఖ సమాధానం చెప్పింది.

కుమార! కిం కథయామి? కుమారభావోపేతాయాః కిమవాస్యాయన్న సంతాపాయ?
రాకుమారా! ఏం చెప్పను? కుమారభావం (యవ్వనం/రాకుమారుడైన నీపై మనస్సు) కలిగిన ఈమెకు ఏది సంతాపం కాదు?

ఇది ప్రేమికులైన ఇద్దరి మధ్య ఒక చిన్న ఘటన. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మనసు. బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యక్తావ్యక్తమైన మధురభావానికి అక్షరరూపం ఈ మధురసంభాషణ. ఈ మాధుర్యమే మూడు జన్మాలలో విస్తరించిన అందమైన కథ రూపంలో విస్తృతమైతే అది కాదంబరి.

మహాశ్వేత - పుండరీకుడు,
మహాశ్వేత - వైశంపాయనుడు, కాదమ్బరి - చంద్రాపీడుడు.
మహాశ్వేత - చిలుక, కాదమ్బరి - శూద్రకుడు

ఇవీ కాదంబరి కావ్యంలోని జంటలు.

అద్భుతమైన సంవిధానంతో ఈ కథ మొదలవుతుంది. బాణుని గద్య సుదీర్ఘసమాసాలతోనూ, వర్ణనలతోనూ కూడుకుని ఉంటుంది. ఒక్కొక్క వర్ణనా పేజీలతరబడి సాగుతుంది.  శూద్రకుడనే మహారాజు విదిశా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక రోజు ఆ మహారాజు కొలువుతీరి ఉంటే ఒక ఛాండాలకన్య ఒక చిలుకను వెంటబెట్టుకుని సభకు వచ్చింది. అస్పృశ్య అయిన ఆమె తను వస్తున్నట్టు ఒక కర్రను చప్పుడు అయేట్టు తాటిస్తుంది. రాజు ప్రతీహారితో ఆమెను సభలో ప్రవేశపెట్టమంటాడు. ఆమె తీసుకువచ్చిన చిలుక మానవభాషలో మాట్లాడగలదు. ఆ అమ్మాయి చిలుకను రాజుకు బహుమతిగా ఇస్తుంది. రాజు చిలుకను ఆ రోజుకు విశ్రాంతి తీసుకొమ్మంటాడు. తర్వాత రోజు కుశలప్రశ్నలు వేస్తూ - చిలుకా! నీకు చక్కని విరామం, మంచి భోజనం దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు చిలుక చెప్పిన సమాధానం బాణుని రీతిలో ఈ విధంగా ఉంటుంది.

దేవ! కిం వా నాస్వాదితమ్?
ఆమత్త-కోకిల-లోచనచ్ఛవి-ర్నీలపాటలః- కషాయమధురః- ప్రకామమాపీతో జమ్బూఫలరసః
హరినఖరభిన్న-మత్తమాతంగకుంభముక్తరక్తార్ద్ర-ముక్తాఫలత్వీషి-ఖణ్డితాని-దాడిమీబీజాని
నలినీదళహరిన్తి-ద్రాక్షాఫలస్వాదూని చ దలితాని
స్వేచ్ఛయా ప్రాచీనామలికీఫలాని
కిం వా ప్రలపితేన బహునా, సర్వమేవ దేవీభిః స్వయం కరతలోపనీయమానమమృతాయతే -

మహాప్రభూ! ఏది ఆస్వాదించలేదు?
మత్తకోకిలల కళ్ళవలె ఎరుపు, నలుపుల మిశ్రమవర్ణమై మధురంగా ఉన్న నేరెడు పళ్ళరసాన్ని తృప్తి తీరా త్రాగాను.
సింహంగోళ్ళచేత భేదించబడిన మదగజకుంభాలలో రక్తంతో తడిచిన ముత్యాలవలె ఉన్న దానిమ్మగింజలనూ
చూర్ణం చేసిన నల్లకలువ రంగులో ఉన్న ద్రాక్షాఫలాలను
చిత్తం వచ్చినట్టుగా ఉసిరికాయలనూ
ఒకటేమిటి? దేవి గారే స్వయంగా అమృతహస్తాలతో తినిపించిన అన్నిటినీ ఆస్వాదించాను.

ఆ పిమ్మట రాజుకు ఆ చిలుక తన కథ చెప్పింది. ఆ చిలుక వింధ్యాటవి ప్రాంతంలో పుట్టింది. ఇక్కడ వింధ్యాటవీ వర్ణన సుదీర్ఘంగా సాగుతుంది. ఆపై అగస్త్యాశ్రమవర్ణన, దగ్గరి పంపాసరోవరవర్ణన. ఆ వింధ్యాటవిలో ఒక బూరుగు చెట్టు. (శాల్మలీవృక్షవర్ణన - ఈ వర్ణన బాణుని సూక్ష్మపరిశీలనకు చిహ్నం). ఆ చెట్టులో చిలుక పుట్టింది. ఓ రోజు కిరాతులు అటవిలో దండయాత్ర చేశారు (కిరాతసేన వర్ణన), ఆ శబరసేనానాయకుడు (ఆతని వర్ణన) చిలుక తల్లిదండ్రులను చంపాడు. చిలుకను హారీతుడనే మునిబాలకుడు రక్షించి తన గురువైన జాబాలి మహర్షి వద్దకు తీసుకువెళ్ళాడు. మహర్షి చిలుక తాలూకు పూర్వజన్మపు కథ చెప్పాడు. ఆ చిలుక పూర్వజన్మలో వైశంపాయనుడు.

*******************************

ఇక్కడ ఆగుదాం.

బాణభట్టు కథను చదివేప్పుడు ప్రాచీనకవిసమయాలు, సామాజికవిషయాలు, సూక్ష్మపరిశీలనలూ, పురాణకథలప్రస్తావనలూ, జంతుపక్ష్యాదుల ప్రవర్తనలూ, అద్భుతమైన ఉపమాన, ఉత్ప్రేక్షాదులతో కూడిన వర్ణనలూ, ఇలా సమస్తమూ కనిపిస్తాయి. అందుకే "బాణోచ్ఛిష్టం జగత్సర్వం" అని ఒక అభాణకం. ఆ వాక్యానికి అర్థం - ఈ జగత్తంతా బాణుడు ఎంగిలి చేసి వదిలేసినదేనని.

(గజేంద్రజీమూతవరాహశంఖమ్త్స్యాహిశుక్త్యుద్భవవేణుజాని |
ముక్తాఫలాని ప్రతిథాని లోకే తేషాం తు శుక్త్యుద్భవమేవ భూరి ||

ఏనుగులు, మేఘం, అడవిపంది, శంఖం, చేపలు, పాము, ముత్యపు చిప్ప, వెదురు - ముత్యాలు వీటినుండి పుడతాయని, ముత్యపు చిప్పల్లో ఎక్కువగా దొరుకుతాయని ఒక ప్రసిద్దశ్లోకం. పైన ఏనుగుకుంభస్థలపు ముత్యం ఎలా వచ్చిందంటే ఈ విషయం తెలియాలి.)

బాణభట్టు వచనం ఎలా ఉంటుందో అని ఒక కవి వర్ణించాడు -

శ్లేషే కేచన శబ్దగుంఫవిషయే కేచిద్రసే చాపరేऽ
లంకారే కతిచిత్సదర్థవిషయే చాన్యే కథావర్ణనే
ఆసర్వత్ర గభీరధీరకవితావింధ్యాటవీచాతురీ
సంచారో కవికుంభికుంభభిదురో బాణస్తు పంచాననః

కొందరు శ్లేషగా చెప్పడంలో నేర్పరులు, పదగుంఫనం కొందరికి హస్తగతం. కొందరు రస పోషణలో సమర్థులు, మరికొందరు అలంకారాలు కూర్చగలరు. కొందరు అర్థవిషయంలో ప్రతిభ చూపిస్తే, కొందరు కథావర్ణనలో నేర్పు చూపిస్తారు. భట్టబాణుడు మాత్రం ఇదీ అదీ అన్న భేదం లేక గంభీరధీరకవితావింధ్యాటవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ, కవిదిగ్గజాల కుంభాలను భేదించే సింహం వంటి వాడు.

బాణుని సుదీర్ఘవర్ణనలను తెనుగు చేస్తే ఎలా ఉంటుందో , కొన్నిటిని ఈ క్రింది ఛాయాచిత్రాలలో చదువుకోగలరు. (నా అనువాదం నోట్సులో కొక్కిరి గీతల సౌందర్యం, అనువాదంలో తప్పులు  క్షంతవ్యాలు). ఇవి సుదీర్ఘవర్ణనలు కాబట్టి కాస్త సహనాన్ని పరీక్షించవచ్చు.

*******************************

వైశంపాయనుడు పూర్వజన్మలో అవంతీరాకుమారుడైన చంద్రాపీడుని మిత్రుడు. చంద్రాపీడుడు క్షత్రియోచిత విద్యలను నేర్చి, యువకుడై, మృగయావినోదంలో పాల్గొని, ఒక కిన్నెరజంటను చూచి వెంబడిస్తాడు. అలా ఎంతో దూరం వెళ్ళి హిమాలయాలకు ఆవల ఉన్న అచ్ఛోద సరస్సును చేరుకుంటాడు. అక్కడ ఒక మందిరంలో చతుర్ముఖేశ్వరుడైన ఈశ్వరుని అర్చిస్తూ ఒక గానం వినబడుతుంది. ఆ గానం చేసిన అమ్మాయి మహాశ్వేత. ఆమె కైలాసశిఖరపు తునకలా ధవళవర్ణంతో మెరిసిపోతున్నది. అచ్చోదసరస్సుల వర్ణన బైఖాల్ (వాలఖిల్య) సరస్సును, మహాశ్వేత వర్ణన శ్వేతజాతీయులను (Russian girl) స్ఫురింపజేస్తుంది. ఆమె చంద్రాపీడుణ్ణి పలుకరించి అతిథిమర్యాదలు చేసింది. ఆపై తన కథ చెప్పింది.

ఆమె పుండరీకుడనే మునికుమారుణ్ణి ప్రేమించింది. ఆ మునికుమారుడు మరణించాడు. బాధతో తనూ ప్రాణత్యాగం చేయబోతే - చంద్రమండలం నుంచి ఒక ధవళమూర్తి వచ్చి ఆమెను ఊరడించి ప్రియాసమాగమం జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. అందుకై ఎదురు చూస్తూ ఆమె జీవించి ఉంది.

ఆ తర్వాతి రోజు మహాశ్వేత తన మిత్రురాలైన కాదంబరిని చంద్రాపీడునికి పరిచయం చేస్తుంది. చంద్రాపీడుడూ, కాదంబరీ పరస్పరం ప్రేమించుకుంటారు. చంద్రాపీడుని మిత్రుడైన వైశంపాయనుడే పూర్వజన్మలో పుండరీకుడు. మహాశ్వేత - వైశంపాయనుల సమాగమం జరిగిందా? వైశంపాయనుడు చిలుక జన్మ ఎలా ఎత్తాడు? చంద్రాపీడుడు మరణించి ఎలా శూద్రకుడుగా జన్మించాడు. ఇదంతా తదనంతరం వచ్చే రమ్యమైన కథ.

కాదంబరి కావ్యం పూర్తిగా భట్టబాణవిరచితం కాదు. కాదంబరి, చంద్రాపీడులను ఏకం చేయకనే కవి పరమపదించాడు. భట్టబాణుని కుమారుడైన భూషణభట్టబాణుడు మిగిలిన కథను పూర్తిచేశాడు. భూషణకవి తండ్రిని మించిన తనయుడు.

*******************************

ఈ రోజు చతుర్దశి. నిండు చందురుని వర్ణన ఎలా ఝల్లుమనేలా ఉందో గమనించండి.(ఆపై బయటకు వెళ్ళి వెన్నెలను ఆస్వాదించడం మరువకండి. :))

క్రమేణ చ
సకలజీవ లోకానందకేన
కామినీజనవల్లభేన
కించిదున్ముక్తబాలభావేన
మకరధ్వజబంధుభూతేన
సముపారూఢరాగేణ
సురతోత్సవ ఉపభోగైక యోగ్యేన
అమృతమయేన
యౌవనేనేవ ఆరోహతా
శశినా రమణీయతాం అనీయత యామినీ.

క్రమముగా
సకలలోకానందకారకుడూ,
కామినీజనవల్లభుడూ
అప్పుడప్పుడే బాల్యాన్ని వదిలి యవ్వనాన్ని సంతరించుకున్నవాడు
మకరధ్వజుని (మన్మథుని) బంధువు
రాగమయుడూ,
శృంగారోత్సవానికి తగిన అమృతాన్ని నింపుకున్నవాడూ,
అయిన చంద్రుడు తన యవ్వనంతో ఆక్రమించుకుంటే - యామిని రమణీయత్వాన్ని సంతరించుకున్నది.

*******************************

కాదంబరి గురించిన ఛాయామాత్రమైన పరిచయం ఇది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదాలు అనేకం ఉన్నట్టున్నాయి. రెంటాల గోపాలకృష్ణ గారి అనువాదం, విద్వాన్ విశ్వం గారి సరళానువాదం ఆంధ్రప్రభలో ధారావాహికగా వచ్చింది. చంద్రాపీడచరితమ్ (కాదంబరి - సుదీర్ఘవర్ణనలు మినహాయించి) ను సంస్కృతపండితులు, అవధాని అనిల్ మాడుగుల గారు హృద్యంగా తెనిగించారు. భట్టబాణుని కావ్యప్రశంస మీద కూడా చక్కని పుస్తకాలు వచ్చినవి. సంస్కృతం మీద ఏ కొంచమైనా అభిమానం, ఆసక్తి ఉన్నవాళ్ళు కాదంబరి కావ్యాన్ని విస్మరించలేరు. ఈ కావ్యం చవిచూడకపోతే సంస్కృతాభినివేశం, ఆసక్తీ అసంపూర్ణం అని చెప్పడానికి సందేహం అనవసరం.

గంగాదేవి అన్న ఒక రచయిత్రి ఇలా అందిట.

వాణీపాణి పరామృష్ట వీణా నిక్వణ హారిణీమ్ |
భావయన్తి కథం వాన్యే భట్టబాణస్య భారతీమ్ ||

"వాణి వీణను మీటితే వచ్చే ధ్వనిని పోలిన బాణుని వాణి ఎవరి ఊహకైనా సాధ్యమా?"

*******************************






కామెంట్‌లు

  1. రవిగారు నమస్కారం."మీ సంస్కృత సౌరభాలు" శీర్షికలో బాణభట్టుని "కాదంబరి" కావ్యంలోని కమనీయ శబ్దాన్ని రమణీయ అర్థాన్ని కాంతాసమ్మితంగా సౌందర్య దర్శనం గావించినందుకు అభినందనలు. ఇంకా ఇటువంటి అనర్ఘ రత్నాలను ఎన్నో రాశులు పోస్తారని ఆకాంక్షిస్తూ.
    మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం. (సెల్: 9866664964

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.