1, జనవరి 2014, బుధవారం

సంస్కృతసౌరభాలు - 11


కొన్ని శ్లోకాలకు శ్లోకం తాలూకు ఉదాత్తత వల్లనే కాక, మరికొన్ని అన్య కారణాల వల్ల కూడా విశేష ప్రాచుర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఒకశ్లోకం మృచ్ఛకటికం లో ఉన్నది.

లిమ్పతీవ తమోऽఙ్గాని వర్షతీऽవ అఞ్జనం నభః |
అసత్పురుషసేవేవ దృష్టిర్విఫలతాం గతా ||

తమః = చీకటి
అఙ్గాని = శరీరములను
లిమ్పతీవ = పూయుచున్నట్లుగా (ఉంది)
నభః = ఆకాశము
అఞ్జనం = కాటుకను
వర్షతి ఇవ = కురుస్తున్నట్లుగా (ఉంది)
అసత్పురుష సేవా ఇవ = దుర్జనునికి చేసే ఉపకారంలాగా
దృష్టిః = చూపు
విఫలతాం గతా = విఫలత్వాన్ని పొందుతున్నది.

దుష్టుడైన రాజు గారి బామ్మర్ది శకారుడనే వాడు తన మిత్రుడు విటుడితో కలిసి వసంతసేన వెనుక బడి వేధిస్తూ ఉన్నాడు. చీకట్లు ముసురుకున్నాయి. ఆమె ఎక్కడో మాయమయింది. ఈ విటుడికి శకారుడంటే ఇష్టం లేదు, కానీ బలవంతం మీద శకారుడికి తోడుగా వచ్చాడు. పై శ్లోకం విటుడు చెప్పింది. అందుకనే "అసత్పురుషసేవేన" అన్న ప్రయోగం. ఈ ఎత్తిపొడుపును గ్రహించేంత తెలివితేటలు శకారుడికి లేవు. వాడి ధ్యాస వేరే.

ఇది నాటకసందర్భం.

ఆంగ్లేయులు మన సాహిత్యం మీద పడ్డాక మన సాహిత్యానుశీలనపద్ధతులు మారినై. కవి వ్రాసిన దానికన్నా, ఆ సందర్భంలో చమత్కారంకన్నా, రసనిష్పందంకన్నా, కవి ఎవడు? ఏ కాలం వాడు? ఈ తాపత్రయం ఎక్కువయింది. ఆ తాపత్రయంలో భాగంగా ఈ శ్లోకానికి ప్రాముఖ్యత వచ్చింది.

మృచ్ఛకటిక నాటక కర్త శూద్రకుడు. ఈ శూద్రకుడు ఎవ్వరో, ఈయన కథాకమామీషు ఏమిటో, ఏ కాలం వాడో తెలియదు. ఈయన కాలాన్ని అంచనా వేయడానికి పూనుకున్న వాళ్ళకు పై శ్లోకం దండి మహాకవి కావ్యాదర్శంలో కూడా కనిపించి ఇబ్బంది పెట్టింది. దండి కావ్యాదర్శంలో ఈ శ్లోకం ఉంది కాబట్టి శూద్రకుడు దండి కంటే ముందే ఉండి ఉంటాడని అంచనా కట్టారు.

ఈ లోపు గణపతి శాస్త్రి గారనే ఆయన భాసనాటకచక్రాన్ని వెలికి తీసి 1909 లో ప్రకటించడంతో మరో సారి తలనొప్పి మొదలయ్యింది. భాసనాటకచక్రంలోని దరిద్రచారుదత్తం అనే నాటకంలోనూ ఇదే శ్లోకం ఉంది!

నిజానికి దరిద్రచారుదత్త కథకు మృచ్ఛకటికం పెంపు. బహుశా ఆధారం కూడా. (దీనిపై చాలా వాదోపవాదాలున్నాయి). కాబట్టి దండి భాసుని నాటకం నుండి ఆ శ్లోకాన్ని స్వీకరించి ఉపయోగించుకున్నాడేమో? శూద్రకుడు ఎవరో ఖచ్చితంగా తెలియట్లేదు కాబట్టి పిషెల్ అనే ఒకాయన మృచ్ఛకటికాన్ని భాసుడు వ్రాశాడని, ఆ తర్వాత - కాదు కాదు దండి వ్రాసి ఉంటాడని ఊహించాడు. భారతదేశ చరిత్రకు సంబంధించి - కనిపించే అంతర్గత ఆధారాలకన్నా అన్యదేశీయుల "ఊహ"లు చరిత్రకు ప్రమాణం కావటం భారతీయుల దౌర్భాగ్యం. అది అటుంచండి.

ఈ శ్లోకానికి మరొక ప్రాధాన్యత ఉంది.

"లిమ్పతీవ తమోऽఙ్గాని" - ఇది ఉపమాలంకారమా? ఉత్ప్రేక్షాలంకారమా? అని ప్రశ్న.

ఉపమాలంకారం అంటే - ఉపమానం, ఉపమేయం, సమానధర్మం, ఉపమావాచకం - ఈ నాలుగింటిలో కనీసం రెండు ఉండాలి. "ఆమె ముఖము చంద్రుని వలే సుందరము" - ఇక్కడ -

చంద్రుడు = ఉపమానం (దేనితో పోల్చాడో అది)
ముఖము = ఉపమేయం (ఎవరిని పోలుస్తాడో ఆ వస్తువు)
సమానధర్మం = సౌందర్యం (రెంటిలో ఉన్నది. ఇది జాతి, గుణం, క్రియ ఏదైనా కావచ్చు)
వలే = ఇది ఉపమావాచకం.

"ఆమె ముఖము చంద్రుని వలె నున్నది" - ఇది కూడా ఉపమాలంకారమే. ఇది లుప్త ఉపమాలంకారం (సౌందర్యం అనే సాధర్మ్యం లోపించినది కాబట్టి). మొదటిది పూర్ణోపమ. ఉపమకు కావ్యాదర్శ కారుడు 23 భేదాలు ప్రతిపాదించాడు, చిత్రమీమాంసకారుడు అప్పయ్యదీక్షితుడు "ఉపమైకా శైలూషిః" అని ఉపమాలంకారం ద్వారానే మిగిలిన అలంకారాలన్నీ పుట్టాయని ప్రతిపాదించి చాలా రోచకంగా వివరించాడు. ఉపమలో సాధర్మ్యంతో బాటు చమత్కారమూ ప్రతీయమానం కావాలని కావ్యాదర్శకారుడు దండి.

ఉపమాలంకారానికి ఒక గుడ్డి గుర్తు "ఇవ, యథా, తుల్యః, వత్, సమః.." వంటి ఉపమావాచకాలు. తెలుగులో "ఇవార్థాలు అంటారు వీటిని. "కరణి, భంగి, వలే, మాదిరి, మాడ్కి, పొల్కి..."ఇలాంటివి. ఇవి తెలుగులో దాదాపుగా పాతిక వరకూ ఉన్నాయనుకుంటాను. వీటిని అన్నిటినీ ఒకే సీసపద్యంలో ప్రయోగించి బహుశా చేమకూరి వేంకటకవీ, ఒకట్రెండు తప్ప దాదాపుగా అన్నిటినీ ఒకే సీసంలో గుదిగుచ్చి ఉపయోగించి తెనాలి రామకృష్ణుడూ వినూత్న ప్రయోగాలు చేశారు.

ఉత్ప్రేక్ష - ఉత్ప్రేక్ష, ఉపమా దాదాపుగా ఒకటే. భేదం ఎక్కడంటే - సాధర్మ్యం వ్యంగ్యంగా, అనుమానప్రమాణం ద్వారా తెలియగలిగితే ఉంటే అది ఉత్ప్రేక్ష. ఇందులో సమానధర్మం సాదృశ్యానికి అంతర్గతంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో - "తమోऽఙ్గాని లిమ్పతీవ" - "చీకటి అంగములను లేపనం చేస్తున్న భంగి" - ఇక్కడ "ఇవ" వచ్చింది కాబట్టి ఇది ఉపమా అనాలి. కానీ ఇది ఉపమ కాదు ఉత్ప్రేక్ష అని కావ్యాదర్శకారుడు దండి విశదీకరించాడు. దానికి ఆయన రెండు కారణాలను చూపాడు.

మొదటి కారణం: లిమ్పతి - ఇది ధాతువు, అంటే క్రియాపదం. (తిజన్తములంటారు వీటిని) "నవై తిజన్తేన ఉపమానమస్తి" - అని వ్యాకరణభాష్యకారులు. పైని వాక్యంలో చీకటి అంగములపై లేపనాన్ని అధ్యారోపం చేస్తున్నదనీ, ఇది సాధ్యమే తప్ప సిద్ధము కాదని, అందువలన "ఇవ" అని ఉన్నప్పటికీ దీనిని ఉపమాలంకారంగా అంగీకరింపరాదని దండి మహాకవి వివరణ.

రెండవకారణం: "చీకటి అంగములను లేపనం చేస్తున్న భంగి" - ఇక్కడ సమానధర్మం లేదని దండి చెబుతాడు. లిమ్పతి అన్న క్రియ - సాధర్మ్యం అవడానికి అవకాశం లేదని, అలా అయిన పక్షంలో ధర్మాన్ని ఆశ్రయించిన ధర్మి లేదని చర్చించాడు.

"వర్షతీవ అఙ్జనం నభః" - ఇక్కడా ఉత్ప్రేక్షయే. అయితే రెండవపాదంలో "అసత్పురుష సేవా ఇవ దృష్టిః విఫలతాం గతా" - ఇది మాత్రం వాక్యగతశ్రౌత్యుపమాలంకారం.

అదంతా చక్కటి శాస్త్రచర్చ. ఇంకా వివరాలు కావాలంటే దండి కావ్యాదర్శం పుస్తకానికి తెలుగులో పుల్లెల రామచంద్రుడు గారి వ్యాఖ్యానం దొరుకుతున్నది. అందులో చదువుకోవచ్చు.

*******************************************************

ఈ రోజు అమావాస్య. శకారుడు కూడా ఇలాంటి రాత్రే వసంతసేన వెంటబడ్డాడు. ఈ రోజూ చీకట్లు ఇప్పుడిప్పుడే ముసురుకుంటున్నాయి. అందరికీ మరోసారి శుభాకాంక్షలతో, మరొక శ్లోకంతో ముక్తాయింపు.

పినష్టీవ తరఙ్హాగ్రైః ఉదధిః ఫేనచందనమ్ |
తదాదాయ కరైరిన్దుః లిమ్పతీవ దిగఙ్గనాః ||

సముద్రుడు తరంగాగ్రములచేత నురగ అనే చందనాన్ని తీస్తున్నట్లుగా ఉన్నాడు. ఆ చందనాన్ని తన కిరణాలతో తీసుకుని చంద్రుడు దిక్కులనే అంగనామణులకు పూస్తున్నట్టుగా ఉంది.

1 కామెంట్‌:

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.