1, జనవరి 2014, బుధవారం

సంస్కృత సౌరభాలు - 10



ఈ వారం సంస్కృతం గురించి ఏం వ్రాయాలో సరిగ్గా తోచక పెనుగులాడుతూ ఇంటికి నడిచి వస్తున్నాను. తోడుగా వెనుకలే నాతో బాటు నడిచి వస్తున్నాడాయన. ఇంకెవరు? చందమామ. ఆయనపైని ఒక శ్లోకం, నెలవంక నింగిని పొడిచిన ఓ నిశి రాత్రి ఏం జరిగిందో ఆ ముచ్చట.

అసౌ హి దత్వా తిమిరావకాశమస్తంవ్రజత్యున్నతకోటిరిందుః |
జలావగాఢస్య వనద్విపస్య తీక్ష్ణం విషాణాగ్రమివావశిష్టమ్ ||
జలావగాఢస్య = నీటిలో మునిగిన
వనద్విపస్య = అడవియేనుగుయొక్క
తీక్ష్ణం = వాడి అయిన
విషాణాగ్రం అవశిష్టమ్ ఇవ = కొమ్ము చివర వలే
తిమిరావకాశం= చీకటికి అవకాశం
దత్వా = ఇచ్చి
అసౌ ఇందుః = ఈ చందమామ
ఉన్నతకోటిః = పొడవైన కొసకలిగినవాడై
అస్తం వ్రజతి = అస్తమిస్తున్నాడు.

ఓ బహుళాష్టమి నాడు. కారుచీకట్లు వ్యాపించడానికి అవకాశం ఇస్తున్న నెలవంక నీటిలో పూర్తిగా మునిగిన ఏనుగు తాలూకు కొమ్ము పైకి తేలితే ఎలా ఉందో అలా ఉంది!

**************************************

సరిగ్గా అదే రోజు రాత్రి ఒకానొక ఇంట ఒక దొంగ కన్నం వేయదల్చుకున్నాడు. అతడిలా అనుకుంటున్నాడు.

కృత్వా శరీరపరిణాహసుఖప్రవేశం శిక్షాబలేన చ బలేన చ కర్మమార్గమ్ |
గచ్ఛామి భూమి పరిసర్పణ ఘృష్టపార్శ్వో నిర్ముచ్యమాన ఇవ జీర్ణతనుర్భుజంగః ||

చోరవిద్య తాలూకు మేధాశక్తితో, నా భుజబలంతో నా శరీరం సుఖంగా ప్రవేశించడానికి అనుగుణంగా నా వృత్తికి తగినట్టు కన్నం వేస్తాను. ఈ కన్నం ద్వారా ముసలిపాము తన కుబుసం నుండీ ఎలా బయటకు వస్తుందో అలా నేనూ నా పక్కభాగాలు రాచుకొని పోయేట్టు కన్నం అవతలికి వెళతాను.

ఇలా సంకల్పించుకున్నాడు. ఆ రేయి నల్లగా, చల్లగా అతణ్ణి రాజభటులనుండి కాపాడుతున్నది.అందుకా రేయికి మంగిడీలు చెప్పాడా దొంగ.

అంతలో అంతర్మథనం! ఈ వృత్తి నీచం అని అందరంటారు కదా. నిద్రిస్తున్న వారి ఇళ్ళల్లో కన్నం వేయడం తప్పు కదూ? కాదు, కానే కాదు. ఇతరుల క్రింద పనిచేయడం కంటే ఇది ఉన్నతమైన వృత్తే. ఒకవేళ దొరికినా చేసిన తప్పుకు దండన అనుభవిస్తాను కాబట్టి తప్పేమీ లేదు. అయినా నాడు అశ్వత్థామయే సౌప్తికవధకోసం దొంగపని చేశాడు. నాకేమిటి?

ఇంతకూ కన్నం ఎక్కడ వేద్దాం? ఆడవాళ్ళు నిద్రించే శయనగృహం పనికి రాదు. కాస్త చప్పుడైతే లేస్తారు కాబట్టి. ఇనప్పెట్టె లేని గదుల్లో కన్నం వేసి ప్రయోజనం లేదు. కాస్త గోడ కూడా వదులుగా ఉండి సహకరించాలి మరెక్కడ? ఇదుగో ఇంటి యజమాని సంధ్యావందనం చేసి నీరు విడిచీ విడిచీ ఈ కొస కాస్త వదులుగా ఉంది. ఇక్కడ కన్నం వేస్తా.

అన్నట్టు -

పద్మవ్యాకోశం భాస్కరం బాలచంద్రం వ్యాపీ విస్తీర్ణం స్వస్తికం పూర్ణకుంభమ్ |
తత్ కస్మిన్ దేశే దర్శయామాత్మశిల్పం దృష్ట్వా శ్వ అయం యద్విస్మయం యాన్తి పౌరాః ||

పద్మ,వ్యాకోశం, భాస్కరం, బాలచంద్రం, వ్యాపీవిస్తీర్ణం, స్వస్తికం పూర్ణకుంభమ్ - ఇలా ఏడు రకాల కన్నాలున్నాయిగా? ఏ విధంగా కనబడే కన్నం వేద్దాం? ఈ కన్నాన్ని చూచి రేపు ఉజ్జయినీనగర పౌరుల దిమ్మతిరిగిపోవాలి.

ఈ పండుఇటుకల గోడలో పూర్ణకుంభాకారంలో కనబడే కన్నం సబబు.

ఇదుగో యోగరోచనమనే లేపనాన్ని వళ్ళంతా పూసుకుంటానిక. దీనితో రక్షకభటులకు కనిపించను. దీనివల్ల శరీరానికి గాయాలూ అవవు. ఇదుగో చోరుల దైవం కార్తికేయునికి వందనాలు.
ఇంతకూ నా చుట్టుకొలత కోసం ప్రమాణసూత్రం ఏదీ? అయ్యో! మర్చిపోయానే!
అబ్బే! పర్లేదు. జందెం ఉందిగా.

ఏతేన మాపయతి భిత్తిషు కర్మమార్గేన ఏతేన మోచయతి భూషణసంప్రయోగాన్ |
ఉద్ఘాటకో భవతి యంత్రధృఢే కపాటే దష్టస్యకీటభుజగైః పరివేష్టనం చ ||

కన్నం చుట్టుకొలతను జందెంతో కొలవచ్చు. దీనితో నిత్యకర్మ చేయవచ్చు. కొక్కేలూడదీయవచ్చు. గడియలు తీసుకోవచ్చు. తేళ్ళేవైనా కుడితే బిగించి కట్టుకోవచ్చు. అన్నివిధాలుగా ఈ జందెం మా దొంగలకు ఉపకరిస్తుంది.

ఇలా ఆలోచించి కన్నం వేశాడు. చివరి ఇటుక మిగిలింది. దాన్ని తొలగిస్తుంటే - ఆ దొంగ వ్రేలిపై పాము కాటువేసింది. పాముకుట్టినదొంగ జందేన్ని వ్రేలికి బిగించికట్టేడు. అక్కడ గదిలో ఒక దివ్వె నిశ్చలంగా వెలుగుతోంది.

శిఖాప్రదీపస్య సువర్ణపింజరా మహీతలే సంధిముఖేన నిర్గతా |
విభాతి పర్యంత తమస్సమావృతా సువర్ణరేఖేన కషే నివేశితా ||

గదిలో వెలుగురేఖ కన్నం ద్వారా ఇవతల నేలపైకి ప్రసరించింది. చుట్టూ కారునలుపు. మధ్యన కాంతిరేఖ. ఇది నల్లని గీటురాయి మీద పెట్టిన బంగరు గీటులా ఉంది!

( కాళిదాసుది సంచారిణీదీపశిఖ అయితే పైది నిశ్చలదీపశిఖ.
సంచారిణీ దీపశిఖేవరాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేన్ద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం సస భూమిపాలః ||
 
రాకుమారి వరమాల పట్టుకుని రాజకుమారులను దాటుకుని వస్తూంది. కదులుతున్న దీపశిఖలా. ఆమె ఎదరకు వస్తుంటే రాకుమారుల ముఖాలు వెలిగిపోతున్నాయి. వెనుకాతల ఆమె దాటి వచ్చిన రాకుమారులముఖాలు చీకటి లా అయిపోతున్నాయి.- ఇది కాళిదాసు వర్ణన. ఈ వర్ణన ద్వారా ఆయనకు దీపశిఖాకాళిదాసు అన్న పేరు వచ్చిందని ఐతిహ్యం.)

దొంగ కన్నంలోనికి ఒక దిష్టి బొమ్మను జొనిపాడు. ఎవరైనా"దొంగ దొంగ" అని కేకలు వేస్తే తప్పించుకొందుకు ఆ ఏర్పాటు. ఎలాగైతేనేం చివరికి గదిలోనికి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నిద్దరోతున్నారు. వారి ఉచ్ఛ్వాసనిశ్వాసలను, కనుపాపలను, శరీరభంగిమలను గమనించాడు.అది దీర్ఘనిద్ర అని నిర్ధారించుకున్నాడు. తన గుప్పిట్లో ఉన్న దీపపు పురుగును వదిలేడు. అది వెళ్ళి దీపంలో పడి దానిని ఆర్పివేసింది.

అలా చీకట్లో దొంగతనం చేసుకు వెళ్ళిపోయేడు.

*******************************************

ఆ దొంగ పేరు శర్విలకుడు. ఆ నాటకం మృచ్ఛకటికమ్. ప్రపంచంలో అద్భుతాలు అప్పుడప్పుడూ జరుగుతాయి. సంస్కృతసాహిత్యరంగంలో అలాంటి ఒకానొక అద్భుతం ఈ నాటకం.

*******************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.