సంస్కృతసౌరభాలు - 9

సీతారాములు sweet nothings చెప్పుకుంటున్నారు.

కిమపి కిమపి మందం మందమాసక్తియోగాత్
అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ |
అశిథిలపరిరంభవాపృతేకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రిరేవ(వం) వ్యరంసీత్ ||


ఆసక్తియోగాత్ = సాన్నిహిత్యంగా మెలగుటవలన
అవిరళితకపోలమ్ = ఒకరి చెక్కిలి మరొకరితో కలిపి
అక్రమేణ = అసంబద్ధముగా
మందం మందం కిమపి కిమపి = మెల్లమెల్లగా ఏదేదో
జల్పతోః = గుసగుసలు పోవుచూ
అశిథిలపరిరంభ = వీడని కౌగిలిలో
వ్యాపృత = కుదిరిన
ఏకైక దోష్ణోః = ఒకే చేయికలిగినవారలమైన మనకు
అవిదితగతయామా = జాములు తెలియకుండగనే
రాత్రి: ఏవం = రాత్రి ఆ విధముగా
(రాత్రిః ఏవ = రాత్రి కూడా)
వ్యరంసీత్ = గడిచెను.

భావం:
సీతా! మనమిద్దరం చెక్కిలితో చెక్కిలి చేర్చి, మెలమెల్లగా ఏవేవో మాట్లాడుకుంటూ, క్రమంగా పారవశ్యంతో గుసగుసలు వోతూ, కౌగిలిలో మన ఇద్దరి చేతులు ఒకటై జాములు కూడా తెలియకుండా ఆ రాత్రిని కూడా అలానే గడిపాము. గుర్తున్నదా?

అప్పటికి రాముని పట్టాభిషేకం గడిచి ఒక యేడాది అయింది. ఆప్తులు, బాంధవులు వారి వారి ఊళ్ళకు తరలి వెళ్ళారు. తల్లులు జనక మహారాజు నిర్వహించే యజ్ఞకార్యానికై వెళ్ళారు. సీత నిండు గర్భిణి. రాముడు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

ఈ సందర్భంలో అర్జునుడు అనే చిత్రకారుడు (బహుశా త్రేతాయుగపు బాపు) రాముని జీవితఘట్టాలను చిత్రించాడు. ఆ చిత్రాలను రాముడు, లక్ష్మణుడు,సీత కలిసి తిలకిస్తున్నారు. రాముడు వనవాసంలో సీతతో గోదావరి వద్ద ప్రస్రవణగిరి పై గడిపిన రోజులను తలుచుకుని పులకిస్తున్నాడు.

అందమైన నేపథ్యానికి సున్నితమైన శృంగారం జోడించి మధురమైన ఘట్టంగా తీర్చిన మహాభావుకుడైన పండితకవి భవభూతి దృశ్యకావ్యం - ఉత్+తర రామచరితమ్ లోని పద్యం ఇది. ఈ సున్నితమైన శృంగారాన్ని కరుణరసం వైపుగా కదిలించి కరిగింపజేస్తాడు కవి.

ఈ పద్యానికి సంబంధించిన కల్పితకథ ఒకటి ఉన్నది.

 తన సఖి ఇంటి వద్ద ఏకాంతంలో ఉన్న కాళిదాసుకు - ఇంటి బయట గుమ్మం దగ్గరే కూర్చుని భవభూతి శిష్యుడు ఈ కావ్యాన్ని వినిపిస్తూ, పై పద్యం పఠించాడు. చివరిపాదం వద్ద "రాత్రిరేవం" అనగానే కాళిదాసు తన సఖికి ఆకులో సున్నం ఎక్కువయ్యిందని "సున్నం (చూర్ణం)" అన్నాడుట. అంటే - సున్నం ఎక్కువయ్యిందని సఖికి సందేశం మాత్రమే కాదు, రాత్రిరేవం అన్నచోట "ఏవం" లో అనుస్వారం ఎక్కువయ్యిందని శిష్యునికి ఉపదేశం కూడా. భవభూతి శిష్యుడు పద్యాన్ని సవరించాడు.

రాత్రిరేవం వ్యరంసీత్ = రాత్రి ఆ విధముగా గడిచినది.
రాత్రిరేవ వ్యరంసీత్ = రాత్రి కూడా అలా గడిచినది. (అంటే పగలంతా మధురమైన తలపులతో గడిచి, రాత్రి కూడా అలాగే గడిచిందని ధ్వని).

***************************************

సంస్కృతనాటకపరిణామక్రమంలో భాసశూద్రకాది కవులది ఒకబాట. కాళిదాసభవభూత్యాదులది మరొకబాట.

భాసకవి నాటకాలు సన్నివేశప్రధానాలు. నాటకీయత లక్ష్యంగా కనబడుతుంది. పద్యాలను మనోజ్ఞంగా తీర్చినప్పటికీ, అవి దృశ్యాన్ని రక్తి కట్టించడానికి ప్రధానంగా ఉపకరించబడినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల మౌనాన్ని, మరికొన్ని చోట్ల పూర్తిగా వచనాన్ని ఉపయోగించాడు భాసకవి. స్వప్నవాసవదత్తంలో రెండు అంకాలలో పూర్తిగా ప్రాకృతవచనాన్ని ఉపయోగించి స్త్రీపాత్రలతో తీర్చాడు కవి. అలా అని వర్ణనలు లేక కాదు. ప్రాధాన్యత తక్కువని మాత్రమే దీని అర్థం.

అస్తాద్రిమస్తకగతః ప్రతిసంహృతాంశుఃసంధ్యానురఞ్జివపుః ప్రతిభాతి సూర్యః |
రక్తోజ్జ్వలాంశుకవృతే ద్విరదస్యకుంభే జాంబూనదేన రచితః పులకోయథైవ ||


అస్తాద్రిపైన కిరణాలను వెనక్కు తీసుకుని సంధ్యారాగంచేత రంజింపబడిన సూర్యబింబం - ఏనుగుకుంభస్థలంపై ఎర్రటి వస్త్రాన్ని అలంకరించి, దానిపై పెట్టిన బంగారుపాత్రలాగా ఉన్నది.

అభిషేకం అనే నాటకంలోని అసమానమైన ఈ వర్ణన - వర్ణన మాత్రమే కాదు, యుద్ధభూమి తాలూకు వాతావరణాన్ని ఏనుగు ద్వారా ప్రేక్షకుని మనసులో స్థాపించడానికి కవి చూపించిన నేర్పు. భాసకవిలాగానే శూద్రకుడు అద్భుతమైన వర్ణనలు చేశాడు. అయితే ఈయన విషయంలోనూ సన్నివేశానికి ప్రాధాన్యత ఎక్కువ.

కాళిదాసభవభూత్యాదులది గొప్ప కావ్యగౌరవం.అద్భుతమైన పద్యరచనాప్రక్రియ వీరిసొంతం. అయితే పద్యం పూర్తిగా సన్నివేశనిష్టం కానవసరం లేదు. బహుశా అందుకనేమో భాసకవి రచనలు చదివిన వారికి సన్నివేశాలు మనసులో మెదిలితే కాళిదాసభవభూత్యాదుల కావ్యాలు అనుశీలించిన వారికి పద్యాలు లేదా పద్యపాదాలు గుర్తుండడం కద్దు అనిపిస్తుంది. ఈ క్రింది పద్యపాదాలు గమనించండి.

"పురాణమిత్యేవ న సాధుసర్వమ్, న చాపి కావ్యం నవమిత్యవద్యమ్"
"మూర్ఖః పరప్రత్యయనేయబుద్ధిః"
"ఏకో రసః కరుణ ఏవ"
"వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి
లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి?"
"ఉత్పస్యసే మమతు కోపి సమానధర్మాః
కాలోహ్యయం నిరవధిః విపులా చ పృథ్వీ"


పై పద్యపాదాలన్నీ కాళిదాసభవభూతుల కావ్యాలలోనివి. ఇవి సంస్కృతం నేర్చుకున్న వారి నోట సామాన్యంగా మెదులుతాయి.

భవభూతి రచించిన మూడు నాటకాలలో ఉత్కృష్టమైనది ఉత్తరరామచరితమ్. అద్భుతమైన పద్యాలు, అందమైన భావుకత, స్నిగ్ధమైన వర్ణనలతో కలిపిన కరుణరసమంజూషిక ఈ కావ్యం. ఈ కావ్యంలో వర్ణనలను ఉటంకించాలంటే దాదాపుగా అన్ని పద్యాలను లేదా కనీసం ౮౦ శాతం పద్యాలను చెప్పవలసి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి ఒకట్రెండు.

ఏతస్మిన్ మదకలమల్లికాక్షపక్షవ్యాధూతస్ఫురదురుదణ్డపుణ్డరీకాః |
భాష్పాంభః పరిపతనోద్గమంతరాళే సందృష్టాః కువలయినో భువో విభాగాః ||

సీతా! ఈ (పంపా) సరోవరంలో మల్లికాక్షములు అనే జాతి కలహంసలు కూజితాలు చేస్తూ విహరిస్తూ ఉండేవి. అవి రెక్కలను కదపడం వల్ల తెల్లటి తామరపూలు వాటి తూళ్ళతో సహా నీటిపైభాగానికి వచ్చి తేలేవి. అయితే నిన్ను పోగొట్టుకుని అశ్రుపూరితమై మసకబారిన కనులతో ఉన్న నాకు ఇవి నీలితామరల్లా కనిపించేవి.

భ్రమిషుకృత పుటాంతర్మండలావృత్తి చక్షుః
ప్రచలిత చటుల భ్రూతాండవైర్మండయంత్యా |
కరకిసలయతాళై ర్ముగ్ధయా నర్త్యమానం
నుతమివ మనసా త్వాం వత్సలేన స్మరామి ||


ఓ మయూరీ! నీకు సీతాదేవి కదూ నాట్యం నేర్పినది? ఆమె తన నల్లటి కనుపాపలు తిప్పుతుంటే చూచి నీవు వర్తులాకారంలో భ్రమించడం నేర్చావు.ఆమె తన చివురుటాకుల చేతులతో తాళం వేస్తుంటే నీవు నాట్యం చేశావు. నా మనసు వాత్సల్యంతో నిన్ను కన్నకొడుకుగా తలుస్తూంది.

జనకుడు సీతను తలుస్తూ:
అనియతరుదితస్మితం విరాజత్
కతిపయ కోమలదంతకుడ్మలాగ్రమ్ |
వదన కమలకం శిశోః స్మరామి
స్ఖలదసమంజస మంజు జల్పితం తే ||


అకారణమైన ఏడుపూ, నవ్వూ,. అప్పుడే పుట్టిన ఒకట్రెండు చిన్ని చిన్ని దంతాలూ. ముద్దుముద్దుగా తొట్రుపడేమాటలూ ఉన్న పాపాయీ! నీ ముఖకమలాన్ని ఇప్పటికీ మరువలేకున్నాను.

***************************************

సాధారణంగా పాండిత్యానికి, భావుకత్వానికి కాస్త చుక్కెదురు. అయితే ఈ రెండూ పరస్పరదోహదకారకాలుగా అమరిన కవులు అరుదు. భవభూతి అటువంటి పండితకవి.

చివరగా - ఒక కవి రచన తాలూకు ఇతివృత్తం నచ్చకపోయినా(సీతాపరిత్యాగం,శంబూకవధ ఇత్యాదులు) ఆ కవి రచనను ఆస్వాదించడం సాధ్యమా? అంటే అసాధ్యం కాదు కానీ దుస్సాధ్యం అని నా అవగాహన. ఆ అవగాహన నుండి వెలుపలికి రావడానికి నేను వేసిన తప్పటడుగు ఈ కావ్యాన్ని చదవడానికి చేసిన ప్రయత్నం. అలాంటి ప్రయత్నానికి భవభూతి వంటి కవి తప్పక సహకరించగలడు.

***************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అశోకుడెవరు? - 1

Disclaimer

విద్యానగర విహారం