సంస్కృతసౌరభాలు - 8


శూన్యం వాసగృహం విలోక్య శయనాదుత్థాయ కించిచ్ఛనైః
నిద్రావ్యాజముపాగతస్య సుచిరం నిర్వర్ణ్య పత్యుర్ముఖమ్ |
విస్రబ్ధం పరిచుంబ్య జాతపులకామాలోక్య గండస్థలీం
లజ్జా నమ్రముఖీ ప్రియేణ హసతా బాలా చిరం చుంబితాః ||

బాలా = ఆ జవ్వని
శూన్యం వాసగృహం విలోక్య = శయనగృహం నిర్మానుష్యముగా ఉండటం చూచి,
కించిత్ శనైః = మెల్లగా
శయనాదుత్థాయ = నిద్రనుండి లేచి,
నిద్రావ్యాజముపాగతస్య = దొంగనిద్దురపోవుచున్న
పత్యుర్ముఖమ్ = పతి ముఖాన్ని
సుచిరం నిర్వర్ణ్య = చాలా సేపు చూసి
విస్రబ్ధం పరిచుంబ్య = జంకు లేకుండా ముద్దుపెట్టుకుని
గణ్డస్థలీం = అతని చెక్కిలియందు
జాతపులకామాలోక్య = అంకురించిన పులకింతలను కనుగొని
లజ్జా నమ్రముఖీ = సిగ్గుతో తలదించుకున్నదై
ప్రియేణ హసతా = ప్రియునిచేత పరిహాసము చేయబడినదై
చిరం చుంబితా = చాలా సేపు ముద్దుపెట్టుకొనబడినది (అయినది)

***************************************

నిదురిస్తున్న ప్రియురాలి పెదవిపైని అందమైన ముద్దును గాలిబ్ దొంగిలిస్తే, అమరుకుడనే సంస్కృతకవి ప్రియుని చెక్కిలిపై ముద్దు ద్వారా ఏకంగా అందమైన దోపిడీకి దిగాడు.

అమరుకుడని ఒక కవి. ఆయన వ్రాసిన పుస్తకం పేరు అమరుశతకం. ఈయనపై ఒక విచిత్రమైన కథ ఉంది.

ఆదిశంకరాచార్యునికి మండనమిశ్రునికి వాదం వచ్చింది. వారు వాదనకు దిగినప్పుడు మండనమిశ్రుని భార్య శృంగారపరమైన ప్రశ్నలు సంధించిందట. అప్పుడు శంకరులు ఆమెతో కొంతకాలం వ్యవధి కోరి, ఆ వ్యవధిలో అమరుకుడనే మహారాజు మరణించి ఉండడం కనుగొని అతని దేహంలోనికి పరకాయప్రవేశ విద్య ద్వారా ప్రవేశించాడు. శంకరుని నిజశరీరాన్ని ఆయన శిష్యులు ఒక గుహలో ఉంచి కాపు కాస్తున్నారు.

ఈలోగా అమరుకుని భార్యకు అనుమానం కలిగింది. తన పతి శరీరంలో ఉన్న ప్రాణం పతిది కాదు, మరెవరో మహాత్ముడిదని ఆమె గ్రహించింది. ఆ యోగిని శాశ్వతంగా అధీనం చేసుకోవాలని ఆమె సంకల్పించింది. రాజ్యంలో ఉన్న మృతకళేబరాలన్నిటిని దహించమని భటులను పురికొల్పగా వాళ్ళు ఆ పని చేస్తూ శంకరుల శరీరం ఉన్న గుహను చూచారు. శంకరుని శిష్యులు ఆ భటులను బతిమాలుకుని, రాజు అమరుకుని ఆస్థానానికి వచ్చి "తత్త్వమసి, తత్త్వమసి" అని సంకేతభాషలో విన్నవించుకున్నారు. అమరుకుని వేషంలోని శంకరులు విషయం గ్రహించి, తన మిథ్యాదేహం చాలించి తిరిగి తన నిజదేహానికి పరకాయప్రవేశం ద్వారా పునఃప్రవేశించడంతో కథ ముగిసింది.

అలా శంకరులు అమరుకుని దేహంలో ఉన్నసమయంలో వ్రాసిన కావ్యం అమరుశతకం అని కథ. తగినట్టుగానే ఈ శతకం శృంగారభరితమైనది. ఆ కావ్యంలో భాగంగా అమరుకుడు పై పద్యాన్ని వ్రాశాడు.

అదే అతడు చేసిన తప్పు.

***************************************

అమరుకుని శతకంలోని పద్యాలను అలంకారికులు ఉదాహరణలుగా స్వీకరించారు. పై పద్యాన్ని కూడా. అందులో భాగంగా ఒక వివాదం ఏర్పడింది. ఆ ఉదంతం ఇది.

కావ్యం అంటే ఏమిటి? అని తర్కిస్తూ అలంకారికులు రకరకాల నిర్వచనాలను చెప్పారు.
శబ్దార్థౌ సహితౌ కావ్యమ్ - భామహుడు (శబ్దార్థసహితమైనది కావ్యము)
శబ్దార్థౌ కావ్యం - రుద్రటుడు
అదోషౌ, సగుణౌ, సాలంకారౌ చ శబ్దార్థౌ కావ్యమ్ - హేమచంద్రుడు

వగైరా వగైరా.. స్థూలంగా కావ్యం అంటే దోషాలు లేనిది, అలంకారాలు కలిగినది, గుణయుతమైనది అని ఒక అవగాహన. ఈ నేపథ్యంలో పై పద్యాన్ని పరిశీలిస్తే -

ఆ పద్యంలో శబ్ద, అర్థ అలంకారాలేవీ కనబడడం లేదు. మధుర్య, ప్రసాద, ఓజాది గుణాలు ఉత్కృష్టంగా కనబడడం లేదు. కొద్దో గొప్పో దోషాలు కూడా ఉన్నాయి. కానీ భావం మాత్రం రసాత్మకంగా ఉన్నది. ఇలా వితర్కించుకుని విశ్వనాథకవిరాజు అన్న అలంకారికుడు తన సాహిత్యదర్పణం అన్న గ్రంథంలో ఒక కొత్త కావ్యనిర్వచనప్రతిపాదన చేశాడు. అది చాలా ప్రముఖమైనది.

- వాక్యం రసాత్మకం కావ్యం.

ఆ నిర్వచనానికి ఉదాహరణగా ఆ అలంకారికుడు ఇదే పద్యాన్ని ఉటంకించాడు.

పైని పద్యాన్ని చూస్తే ఆ పద్యం దాదాపు ఒక వాక్యంలాగానే ఉంది. అక్కడ నాయకుడు ఆలంబన విభావం. శూన్యవాసగృహం, పతి నిద్ర ఉద్దీపన విభావాలు. ముఖాన్ని తదేకంగా చూడ్డం, ముద్దాడటం అనుభావాలు. లజ్జ వ్యభిచరీభావం. సంభోగశృంగారం రసం. ఇలా వివరించి ఆయన దీనిని ఉత్తమకావ్యానికి నిర్వచనంగా ప్రతిపాదించాడు. మమ్మటుడు (కావ్యప్రకాశ కర్త) దీనిని సమర్థించినాడు.

వీరితో విభేదించినది రసగంగాధరకర్త జగన్నాథపండితరాయలు. ఈయన objections ఇవి.

సున్నితమైన శృంగారానికి నెలవైన ఈ పద్యంలో
- ఉత్ థాయ అన్నచోట చాలాకటువుగా వినిపిస్తున్నది.
- శనైర్నిద్రే, పత్యుర్ముఖ - ఇక్కడ రేఫఘటిత సంయోగం ఉన్నది.


(శషౌ రేఫఘటిత సంయోగౌ, ఢకారశ్చ భూయసా
విరోధినః స్యుః శృంగారే తేన వర్ణాః రసచ్యుతాః |

అని ధ్వన్యాలోకం. అంటే శృంగారానికి చెందిన పద్యాలలో శషలు, రేఫ సంయోగాలూ, ఢ కారమూ ఉండరాదు. ఇది రసవిరోధకాలు. "ట" కారం కూడా శృంగార రసవిరోధమని ఒక వాదం)


- విస్రబ్ధ ఇక్కడ "బ్ధ" మహాప్రాణం.
- లజ్జే - సవర్ణ ద్వయఘటితం


ఇలా అడుగడుగునా కటువైన, అశ్రవ్యమైన శబ్దాలతో ఈ పద్యం (కావ్యం) కవి తాలూకు నిర్మాణసామగ్రిదారిద్ర్యాన్ని నిరూపిస్తున్నాయని ఘాటుగా విమర్శించాడు.

ఇలా అలంకారికుల తర్కపాటవానికి పై పద్యం గురయ్యి మౌనవేదన పడింది.

***************************************

అమరుక కవి చేసిన మరొక తప్పు ఇది.

నిశ్శేషచ్యుతచన్దనం స్థనతటం నిర్మృష్టరాగోऽధరో
నేత్రే దూరమనఞ్జనే పులకితా తన్వీ తవేయం తనుః |
మిథ్యావాదిని దూతి బాన్ధవజనస్యాజ్ఞాత పీడాగమే
వాపీం స్నాతుమితో గతాసి న పునస్తస్యాధమస్యాన్తికమ్ ||

ఒకానొక నాయకురాలు తన ప్రియుణ్ణి పిలుచుకు రమ్మని తన దూతిని అతని కడకు పంపింది. ఆ దూతి తిరిగి రాగా, ఆమె వంటిపై చిహ్నాలను చూసి నాయకు రాలు వ్యంగ్యంగా అంటున్న మాటలివి.


నీ స్థనపైభాగంమీద ఇదివరకు అలదుకున్న చన్దనం పూర్తిగా లేదు. పెదవిపై లత్తుక ఎరుపు తుడిచిపెట్టుకుపోయింది. కళ్ళపైన కాటుక చెదిరింది. నీ స్నేహపాత్రురాలైన నన్ను బాధపెట్టిన ఓ అబద్ధాల కోరుదానా! నీవు బావిలో స్నానం చేయడానికి వెళ్ళావు. ఆ అధముని దగ్గరకు వెళ్ళనే లేదులే.

- అమరుక కవి తాంబూలాలివ్వడంతో మరో జగడం మొదలయ్యింది. పై పద్యంలో నిశ్శేష, నిర్మృష్ట,దూర, తవేయం - ఈ శబ్దాలు విశేషంగా రతికేళి జరగడాన్ని సూచిస్తూ, వ్యంగ్యాన్ని ఉద్దీపిస్తున్నాయి. అందుచేత ఇది ధ్వని కావ్యమని అప్పయ్యదీక్షితుల వారు. అలా కాదనిన్నీ, అప్పయ్య దీక్షితుల వారికి అలంకారిక సాంప్రదాయం తెలియదనిన్నీ జగన్నాథ పండితరాయల వారు. ఈ పద్యానికి సంబంధించి పండితరాయల వారి తర్కం మరీ శ్రుతి మించి పాకాన బడుతుంది. అర్థం కాదు కూడా. (అప్పయ్యదీక్షితులంటే పండితరాయల వారికి సరిపడదు.) వారిద్దరి మధ్యనా ఈ పద్యం తాలూకు చన్దనసౌరభం నిశ్శేషంగా చ్యుతం అయే ప్రమాదం ఏర్పడింది.

వస్తువును కాకుండా వ్యాఖ్యాతను దృష్టిలో పెట్టుకుని కత్తులు నూరేవాళ్ళు ఆ కాలం నాడూ ఉన్నారల్లే ఉంది.

సరే. అవన్నీ తర్క విషయాలు. వాటిని వదిలి ఒక స్నిగ్ధమైన శృంగారభరితమైన పద్యం - చాలా మత్తుగొలిపే పద్యం ఒకటి చివర్న.

గాఢాలిఙ్గనవామనీకృతకుచప్రోద్భిన్న రోమోద్గమా
సాన్ద్రస్నేహరసాతిరేకవిగళత్కాఞ్చీప్రదేశామ్బరా
మా మా మానద! మాతి మామలమితి క్షామాక్షరోల్లాపినీ
సుప్తా కిన్నుమృతా ను కిం మనసి మే లీనా విలీనా ను కిమ్?

బిగికౌగిలింతలతో గాఢంగా పీడింపబడి కురచములైన కుచములతో, అనురాగం మిక్కుటమై తనంతటగా వీడిన పోకముడి కలదై, వద్దు, వద్దు, నా మానం తీయకు, చాలు చాలు మని ఆనందపారవశ్యంచేత గుసగుసలు వోయిన సఖి కడకు నిద్రించినదో, మూర్ఛవోయినదో, మనసున దాగినదో, మనసున ఐక్యమైనదో అన్నట్లుగా నిశ్చేష్టితమైనది.

***************************************
 
అమరుకుని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కావ్యంతో సమానమని ఒక అభాణకం.

కవిరమరః కవిరమరుః కవిర్హి చోరో మయూరశ్చ |
అన్యే కవయః కపయః చాపలమాత్రం పరం దధతే ||

కవి అంటే అమరసింహుడు, అమరుకుడు, చోరకవి, మయూరుడూనూ. మిగతా కవులంతా కపులు. ఏదో పోనీ అని భరించదగినవారు.

నిజమా? ఏమో! :)

***************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు