సంస్కృతసౌరభాలు - 7


శరత్కాలం. నిర్మలమైన ఆకాశంలో కొంగలబారు వెళుతూంది. ఆ దృశ్యాన్ని విదూషకుడు (నాయకుని సహాయకుడు), రాజు (నాయకుడు), చేటి (నాయిక యొక్క పరిచారిక) చూసి వర్ణిస్తున్నారు.

**********************************

విదూషకః : శరత్కాల నిర్మలాంతరిక్షే ప్రసారిత బలదేవ బాహుదర్శనీయాం సారసపఙ్త్కిం యావత్సమాహితం గచ్ఛన్తీం పశ్యతు తావద్భవాన్ .

రాజా: వయస్య, పశ్యామ్యేనామ్

ఋజ్వాయతాంచ విరలాంచ నతోన్నతాంచ
సప్తర్షివంశకుటిలాంచ నివర్తనేషు |
నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య
సీమామివామ్బర తలస్య విభజ్యమానామ్ ||

చేటీ: పశ్యతు పశ్యతు భర్తృదారికా. ఏతాం కోకనదమాలాపాండురరమణీయాం సారసపంక్తిం యావత్సమాహితం గచ్ఛన్తీమ్.

**********************************

విదూషకుడు:శరత్కాలంలో స్వచ్ఛమైన ఆకాశంలో చాపినబలరాముని బాహువుల లాగా దర్శనీయంగా ఉన్న కొంగలబారును వెళ్ళేంతలో చూడు రాజా.

రాజు: మిత్రమా, సరళంగా ఉన్నవి, విడివిడిగా ఉన్నవీ, ఎత్తుపల్లెములు కలిగినవి, మలుపులు తిరిగేప్పుడు సప్తర్షి మండలంలా వంకరగా అయినవి, కుబుసం విడిచిన పాములా స్వచ్ఛంగా ఉన్న గగనతలానికి సరిహద్దురేఖ గీచినట్లుగా ఉన్నవీ అయిన ఆ సారసపంక్తిని చూశాను.

చేటి: మహారాణీ, ఎర్రకలువలమాలవలే రమణీయంగా ఉన్నవీ, దగ్గరదగ్గరగా కూర్చబడినవీ అయిన ఈ కొంగలబారును చూద్దువుగానీ.

**********************************

సంస్కృత మహాకవులలో అత్యంతసంయమనశీలిత్వాన్ని, కవిత్వంలో అత్యంత పొదుపునూ, సన్నివేశకల్పనలో అనాయాసమైన నాటకీయతనూ, ఔచిత్యంలో గొప్పపరిణతినీ సాధించిన కవి భాసమహాకవి. ఈయన రచించినవన్నీ దృశ్యకావ్యాలే (నాటకాలే). భాసకవిలో మహోన్నతమైన లక్షణం ఏమిటంటే చివరివరుసన కూర్చున్న ఒక అత్యంత సామాన్యుడైన సామాజికుని దృష్టిలో పెట్టుకుని ఈయన సన్నివేశాలను కల్పిస్తాడు. అందుకు తగినట్లు కవిత్వాన్ని సృజిస్తాడు. పైని సన్నివేశం స్వప్నవాసవదత్తం అన్న నాటకం లోనిది.

చాలా సామాన్యమైన దృశ్యం. వత్సరాజు ఉదయనుడి భార్య వాసవదత్త. మంత్రి యౌగంధరాయణుడు - కొన్ని రాజకీయకారణాల వల్ల తనూ, వాసవదత్తా చనిపోయినట్లుగా కల్పిస్తాడు. ఆపై మారువేషంలో వాసవదత్తను మగధరాకుమారి పద్మావతికి పద్దకు చేర్చి ఆమెకు సఖిగా అమరుస్తాడు. ఆ పద్మావతిని ఉదయనుడు ద్వితీయవివాహం రాజకీయకారణాలవల్ల చేసుకొన్నాడు. కానీ రాజు హృదయంలో అంతా వాసవదత్తయే నిండి ఉంది. ఈ నేపథ్యంలో రాజు ఉద్యానవనానికి వస్తాడు. అక్కడ ఒక చిన్న దృశ్యం - ఆకాశంలో కొంగలబారు. పైకి చూస్తే ఏమీ లేదు, కానీ మూడు భిన్నమైన జతల కళ్ళతో కవి చూచిన దృశ్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించాలి.

విదూషకుడు రాజుకు సహాయకుడు. హాస్యకారీ విదూషకః అని ఉక్తి. ఈ పాత్రను నాటకాలలో సామాన్యంగా బ్రాహ్మణపాత్రధారి పోషించడం కద్దు (శ్రీకృష్ణతులాభారం సినిమాలో పద్మనాభం). ఆ పాత్రధారికి పౌరాణిక పాత్రలపట్ల అపేక్షా, భోజనప్రీతీ, స్వారస్యం లేని వర్ణనలపై ప్రీతి - లక్షణాలు. కొంగలబారు బలరాముని భుజాల్లా ఉంటాయన్న వర్ణన అతని మనస్తత్వాన్ని సూచిస్తున్నది.

అపైన మహారాజు వర్ణన. ఆకసం కుబుసం విడిచిన సర్పంలా ఉన్నది అనటంలో శరత్కాలంలో స్వచ్ఛతను, కొంగలబారు సరిహద్దులా ఉంది అనటంలో రాచమనస్తత్వానికి చెందిన స్వాభావికతనూ, ఆ పంక్తిని పలువిధాలుగా ఉద్యోతించడంలో రాజు మనసులో ఉన్న భావశబలత (రాజ్యాన్ని పోగొట్టుకున్న బాధ, వాసవదత్తను పోగొట్టుకున్న విరహం, పద్మావతిని పొందిన ఊరట) నూ చిత్రించాడు భాసుడు. ఈ శ్లోకం ఛందస్సు - "వసంతతిలకం".

ఇంతలో చేటి (పద్మావతి చెలికత్తె) కూడా ఆ దృశ్యాన్ని చూసింది. తన యజమానికి పూలమాలలు కట్టటం, చందనాది లేపనాలు సిద్ధం చేయటం చేటి పనులు. ఆమె స్వభావానికి తగినట్టు చేటికి కొంగలబారు ఒక ఎర్రకలువలదండలా అగుపడింది.

చేటి పైన ఆకసంలో ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు దింపగానే ఆమెకు ఉద్యానవనంలో అడుగుపెడుతున్న మహారాజు కనిపించాడు. పద్మావతితో "ఓ! మహారాజు గారు వచ్చారు" అంది.

అదే ఉద్యానవనానికి అప్పటికే పద్మావతి, ఆమె సఖిగా ఉన్న వాసవదత్త (మారు పేరు అవంతిక), చేటి వచ్చి ఉన్నారు. వాసవదత్త పరపురుషులను చూడనని నియమం పెట్టుకుంది. ఆమె నియమాన్ని మన్నిస్తూపద్మావతి అక్కడి నుండి వైదొలగింది. ఇది ఆ ఘట్టం.

పైకి చాలా చిన్నదిగా కనబడిన ఆ వర్ణన వెనుక అనాయాసంగా నాటకాన్ని తీర్చిదిద్దగల అసమానమైన నైపుణ్యత కనిపిస్తుంది.

**********************************

పైని వర్ణనలో సూచనాత్మకంగా భాసమహాకవిలోని క్లుప్తత కనిపిస్తుంది. ఆయన కొన్ని సందర్భాలలో మౌనాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు. మరికొన్ని చోట్ల అద్భుతమైన ఒక చిత్తరువు లాంటి దృశ్యంతో మాటల్లో చెప్పలేని భావాన్ని చెప్పగలుగుతాడు. స్వప్నవాసవదత్తంలో ఒకచోట పద్మావతి ఉదయనుణ్ణి వీణావాదన నేర్పమని అడుగుతుంది. అప్పుడా రాజు ఒక నిట్టూర్పుతో మౌనంగా ఉండిపోతాడు.

విషయమేమంటే ఉదయనుని ప్రథమకళత్రం వాసవదత్త ఉదయనునికి ప్రియురాలే కాదు, వీణావాదనలో శిష్యురాలు కూడా. ఆమె స్థానాన్ని పద్మావతి ఆపేక్షిస్తే మహారాజు ఏమని చెబుతాడు? అదే ఆ నిట్టూర్పులోని భావం.ఆ మౌనభావాన్ని సామాజికులలో ప్రతిక్షేపించిన నాటకకర్త మరొక దృశ్యంలో వాసవదత్తను గుర్తు చేసుకుంటాడు.

బహుశః అప్యుపదేశేషు యయా మామీక్షమాణయా |
హస్తేన స్రస్తకోణేన కృతమాకాశవాదితమ్ ||

మాం = నన్ను, ఈక్షమాణయా = చూస్తున్నట్టి, యయా = ఏ వాసవదత్తచేత, ఉపదేశేషు = వీణావాదన శిక్షణయందు, బహుశః = పెక్కుమార్లు,స్రస్తకోణేన = జారిన తీవెకలవీణియగల, హస్తేన = చేతితో, ఆకాశవాదితం = శూన్యంలో వీణావాదన చేయబడినదో తన్యాః = ఆ వాసవదత్తను, స్మరామి = తలుచుకుంటూనే ఉన్నాను.

ఉదయనుడు వాసవదత్తకు వీణ నేర్పిస్తున్నాడు. ఇద్దరూ కలిసి వీణావాదనం చేస్తున్నారు. అతనివైపే తదేకంగా చూస్తూ తనను తాను మరచిన వాసవదత్త చేతి నుండి తీవె జారిపోయింది. అయినా ఆమె శూన్యంలో వేళ్ళను కదుపుతూంది. అయితే ఉదయనుడు కూడా వీణియను మ్రోగిస్తున్నాడు కాబట్టి అపశ్రుతి వినిపించలేదు. అలా తనను చూస్తూ ఒడలు మర్చిపోయిన తన శిష్యురాలిని, ప్రియురాలిని ఉదయనుడు స్మరిస్తున్నాడు.

ప్రేయసీప్రియుల హృదయనాదం ఒక్కటేనన్న ఒక అపూర్వమైన సౌందర్యభావయుక్తమైన ధ్వని ఈ శ్లోకంలో కాస్త సూక్ష్మంగా వివేచించే వారికి కనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకునికి కూడా ఉదయనుని విరహం అపూర్వంగా కనబడుతుంది. ఇలా ఒకే శ్లోకంతో భిన్నసామాజికులను ఆకట్టుకోవడం భాసనాటకకళ.

ఇలా ఈ కవి గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు

**********************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.