14, నవంబర్ 2013, గురువారం

సంస్కృతసౌరభాలు - 6

ఈ యేడాది మా పెరడు కళకళలాడిపోతోంది. అరచేతిలో పట్టేంత జామకాయలు, బంగారు రంగులో గుమ్మడిపాదు నుంచి వేలాడుతున్న గుమ్మడికాయ, మొదటిసారి కాస్తున్న నిమ్మచెట్టు, గన్నేరుపూలు, బంతిపూలు, మందారం, గుత్తులుగా వేలాడుతున్న బాదంకాయలూ, కొబ్బరి చెట్టుపై నుండి క్రిందికి చూస్తున్న కొబ్బరిబొండాలూ..

బాదం గట్టుపై కూర్చుని బాదంకాయ కండ నములుతూ కొబ్బరి నీరు (గొట్టం అవసరం లేకుండా) త్రాగడం ఒక స్వప్నంలాంటి అనుభూతి.

భాసుడు వ్రాసిన స్వప్నవాసవదత్తం అనే సంస్కృతనాటకం చదవడమూ అలాంటి చిక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ వారం టాపిక్ అది కాదు. కొబ్బరినీళ్ళు త్రాగడానికి ముందు కాస్త ఘాటైనదేదైనా రుచి చూడాలి.

అలాంటి ఘాటైన శృంగారతిలకమ్ గురించి ఈ వారం.  కాళిదాసు కృతిగా చెప్పబడుతున్న శృంగారతిలకమ్ ఒక మిరపకాయబజ్జీల పొట్లం లాంటి ముక్తక కావ్యం. అయితే ఈ కావ్యం రచించినది కాళిదాసు కాదన్న సంగతి సులభంగానే కనుక్కోవచ్చు. ఎందుకంటే - కాళిదాసు కవిత్వంలో కనిపించే అనుపమానమైన ఉపమానాలు ఇందులో లేవు.

అలాగే కాళిదాసు కవితావైదగ్ధ్యం శృంగారతిలకమ్ లో లేదు.

వైదగ్ధ్యం అంటే తనకు మాత్రమే సాధ్యమైన ఒక నేర్పు.  ఆ వైదగ్ధ్యాన్ని ఒక చిన్న శ్లోకం ద్వారా కొండను అద్దంలో చూసే ప్రయత్నం చేస్తున్నాను.

కుమారసంభవంలో హిమాలయవర్ణన తాలూకు శ్లోకం ఇది.

కపోలకణ్డూః కరిభిర్వినేతుమ్ విఘట్టితానాం సరళద్రుమాణామ్ |
యత్రశ్రుతక్షీరతయా ప్రసూతం సానూనిగన్ధస్సురభీకరోతి ||

మదపుటేనుగులు మదజలం స్రవించడంతో వచ్చిన దురదను బాపుకోవడం కోసం చెక్కిళ్ళను దేవదారు చెట్ల బెరళ్ళకేసి రుద్దుకుంటున్నాయి. దాంతో ఆ చెట్ల బెరళ్ళు విచ్చి పాలు కారుతున్నాయి. అలా కారిన పాలు, మదజలం తాలూకు ఘాటైన సువాసన కలిసి పర్వతసానువులను గుబాళింపజేస్తున్నాయి.

పదచిత్రాలంటారు వీటిని. ఈ శ్లోకం ద్వారా ’చెట్టుబెరడుకేసి రుద్దుకుంటున్న ఏనుగు’ అనే చిత్తరువు లాంటి దృశ్యం కళ్ళకు కడుతుంది. కాళిదాసు విశిష్టత కేవలం చిత్రాన్ని చూపడంలో మాత్రమే లేదు. "సానూనిగంధస్సురభీకరోతి" - పరిమళ భరితమైన పర్వతసానువులను సామాజికుడికి "బోనస్" గా అందివ్వడంలో ఉన్నది. అంతేనా? ఇంకా ఉంది.

సురభి అన్న శబ్దానికి పరిమళం అన్న అర్థంతో బాటు వసంతం, కామధేనువు అన్న అర్థాలూ ఉన్నాయి. పై శ్లోకం ద్వారా హిమాలయా పర్వత సానువులు పరిమళభరితం అవడమొక్కటే కాదు, అక్కడ "వసంతం" ఎల్ల కాలాల్లో వెల్లివిరుస్తుందన్న "ధ్వని" కూడా ఉన్నది. సురభి అన్న ప్రవృత్త్యసహాయ శబ్దం ద్వారా శబ్దశక్త్యుద్భవవస్తుధ్వనిని ఉద్యోతించడం కాళిదాసు తాలూకు అచ్చెరువు గొలిపే వైదగ్ధ్యం.ఒక అడవిజంతువు కండూయనాన్ని ఏ మాత్రం క్లుప్తత చెడనివ్వకుండా అదనపు హంగులు అద్ది సౌందర్యానుభూతి అంచులకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం - ఆ పనిని సున్నితమైన, అందమైన శబ్దాలతో అలవోకగా నిర్వహించడం - విదగ్ధతాచిహ్నమని అని నా అనుకోలు. వస్తునిష్టమైన కవిత్వాన్ని (subjective poetry) ఈయన చాలా మామూలుగా శిఖరాగ్రానికి తీసుకెళతాడు.

*****************************

శృంగారతిలకమ్ అంతటి గొప్ప కావ్యం కాకపోవచ్చు, కానీ దేని దారి దానిదే.

ఇందులో అక్కడక్కడా ఘాటెక్కువైన సందర్భాలున్నాయి. శృంగారం పరిధిని దాటి అశ్లీలానికి దిగిన కొన్ని శ్లోకాలు ఇందులో ఉన్నాయి. కొన్ని శ్లోకాలు ఇక్కడ.

కిం మాం నిరీక్షసి ఘటేన కటిస్థితేన
వక్త్రేణ చారుపరిమీలితలోచనేన |
అన్యం నిరీక్ష్య పురుషం తవ భాగ్యయోగ్యం
నాऽహం ఘటాంకితకటిం ప్రమదాం భజామి ||

సత్యం బ్రవీషి మకరధ్వజబాణపీడ!
నాऽహం త్వదర్పితదృశా పరిచిన్తయామి |
దాసోऽద్య మే విఘటస్తవతుల్యరూపః
సోऽయం భవేన్న హి భవేదితి మే వితర్కః ||

31 శ్లోకాల ఈ ముక్తకంలో చివరి రెండు శ్లోకాలివి.

నీలాటిరేవు కాడ కోడెవయసులో ఉన్న ఒక కుర్రవాడు నుంచునున్నాడు. కడవను సంకనెత్తుకున్న ఒక అమ్మాయి. అమ్మాయి అతడినే చూస్తా ఉంది. ఆ అమ్మాయిని చూసి అతడు చెప్పిన శ్లోకం మొదటిది.

"ముఖాన చారెడేసి కళ్ళెట్టుకుని, చంకన కుండెట్టేసుకుని నాకోసం ఎందుకు ఎదురుచూస్తావు పిల్లా? నీ భాగ్యానికి తగిన వాణ్ణి ఎవణ్ణయినా చూసుకోరాదూ? నాకు కడవలు మోసే అమ్మాయిలు నచ్చరు."

దీనికి అమ్మాయి ఇచ్చిన కౌంటర్ రెండవది.

"ఓ మదనబాణపీడితుడా! సత్యం చెబుతున్నాను. నీపైన ఆశ పెట్టుకుని కళ్ళెట్టుకుని చూడలేదు. తప్పిపోయిన నా దాసుడు అచ్చం నీలానే ఉంటాడు. అతనే నీవా అని చూస్తున్నాను."

కాళిదాసుకు లఖిమ అనే విదుషీమణికి మధ్య ఈ సంభాషణ జరిగినట్టు ఒక కథ ఉన్నది. (బహుశా భోజరాజీయం కావచ్చును. ఆ పుస్తకం నేను చదవలేదు.)

ఈ శ్లోకార్థాన్ని జాగ్రత్తగా చూడండి. మొదటి శ్లోకంలో - అమ్మాయి పట్ల ఏ విధమైన ఆసక్తీ లేని ఆ యువకుడికి "వక్త్రేణ చారుపరిమీలితలోచనేన" అంటే "ముఖమంతా పరుచుకున్న కళ్ళతోటి" అని అమ్మాయిని వర్ణించే అవసరం ఎందుకు? ఏవో మాటలు పెట్టుకుని పరిచయం పెంచుకునేట్టుగా లేదూ అతని వాలకం? అలాగని ఆమెపై మోహం చూపించడమూ ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడాడు. ఆ అమ్మాయి కూడా తక్కువ తినలేదు. "మకరధ్వజబాణపీడ" - అనే సంబోధనతో అతని వాలకాన్ని బయటపెట్టింది. రేవు దగ్గర జరిగిన సరసమైన సంభాషణకు ఈ శ్లోకాలు దృష్టాంతం.

శ్లాఘ్యం నీరసకాష్టతాడనశతం శ్లాఘ్యః ప్రచణ్డాతపః
క్లేశః శ్లాఘ్యతరః సుపఙ్కనిచయైః శ్లాఘ్యోऽతిదాహాऽనలైః |
యత్కాన్తాకుచపార్శ్వబాహులతికాహిన్దోలలీలాసుఖమ్
లబ్ధం కుమ్భవర త్వయా నహి సుఖం దుఃఖైర్వినా లభ్యతే ||

ఓ కుంభశ్రేష్టా! జవరాలి నడుముపై కూర్చుని తీవెలాంటి ఆమె చేతిలో ఉయ్యాలలూగే అదృష్టం కొరకై మునుపు నీవు ఎండుకట్టెల తన్నులు తినడం బాగు. మంచి ఎండలో ఎండడం బాగు బాగు. మంచిరంగుకోసం క్లేశపడడం మరింత బాగు. నిప్పులో కాలడం మహా బాగు. సుఖమెప్పుడూ దుఃఖం లేకుండా లభించదు కదా!

ఇది సంస్కృత భాష తెలిసిన ఒకానొక రోమియో వ్యవహారం.

పచ్చిమిరపకాయల బజ్జీలలో ఒకానొక రకం ఉంది. మిరపకాయను నిలువునా కోసి అందులో గింజలను తీసి, బదులుగా ఉల్లికారం నింపిన వరైటీ. అలాంటిదీ ఒక శ్లోకం చూద్దాం.

అవిదితసుఖదుఃఖం నిర్గుణం వస్తు కిఞ్చి
జ్జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే |
మమ తు మతమనఞ్గస్మేరతారుణ్య ఘూర్ణ
న్మదకలమదిరాక్షీనీవీమోక్షో హి మోక్షః ||

ఇహ = ఈ లోకంలో, కశ్చిత్ = ఎవడో, జడమతిః = మందమతి, అవిదితసుఖదుఃఖం = తెలియబడని సుఖదుఃఖాలతో కూడిన, నిర్గుణం = గుణరహితమైనదానిని, కిఞ్చిత్ = ఒకదానిని, మోక్ష ఇత్యాచచక్షే = మోక్షమని చెప్పెను. మమ మతం తు = నాయొక్క నిర్ణయమైతే, అనఞ్గస్మేర = మన్మథుని చిరునవ్వురూపమైన, తారుణ్యఘూర్ణత్ = యవ్వనంతో మార్మోగుతున్న, మదకల = గుసగుసలతో, మదిరాక్షీ = మత్తుకన్నుల జవరాలి, నీవీమోక్షో = పోకముడికి (కలిగించే) మోక్షమే మోక్షః = మోక్షము.

ఒక కాముకుని (రసికుని) అభిప్రాయం ఇది.

సుఖదుఃఖాలకతీతమైన నిర్గుణమైన మోక్షం గురించి ఎవడో మందబుద్ధి చెప్పాడుట! నా మతమైతే మన్మథుని చిరునవ్వై, యవ్వనంతో మార్మోగుతూ, గుసగుసలాడే మదిరాక్షి పోకముడి మోక్షమే మోక్షము.

*****************************

శృంగారం సభ్యత హద్దుల్లోకి చెఋకున్న, కొండొకచో సభ్యత ఎల్లలు దాటిన ముక్తకకావ్యం ఇది. అయితేనేం, ఇందులోని శ్లోకాలను కొందరు తెలుగు కవులు ఉపయోగించుకున్నారు. తిరుపతి వేంకటకవులు దీనిని తెనుగు చేశారు.

*****************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.