సంస్కృతసౌరభాలు - ౩


కలశే నిజహేతుదండజః కిము చక్రభ్రమకారితాగుణః |
స తదుచ్ఛకుచౌ భవన్ ప్రభాఝరచక్రభ్రమ మాతనోతి యత్ ||

నిజహేతుదండజః
నిజ = తనదైన
హేతు = నిమిత్తకారణమైన
దండజ = కట్టెవలన బుట్టిన
చక్రభ్రమకారితా= కుమ్మరి చక్రము త్రిప్పుటను చేసెడి
గుణః = ధర్మము
కలశే = కుండయందు
కిము సంక్రాంతః = సంక్రమించినదా ఏమి?
యత్ = ఏలనన
సః = ఆ కుండ
తదుచ్చకుచౌ = ఆ దమయంతి యొక్క ఉన్నతమైన పయోధరములుగా
భవన్ = అగుచు
ప్రభాఝరచక్రభ్రమమ్ = కాంతిప్రవాహమందు చక్ర(వాక పక్షులా అను) భ్రమను
ఆతనోతి = కలిగించుచున్నది.

******************************************

శ్లోకం తాత్పర్యం వ్రాసినా సాధారణంగా అర్థం కా(లే)దు. ఖంగారు పడకండి. ఇదొక నారికేళపాకం. ఈ నారికేళానికి పీచు కూడా పీకాలి. నిదానంగా చూద్దాం.

******************************************


సంస్కృతాధ్యయనంలో పంచమహాకావ్యాల వరుస ఇది. కాళిదాసు రఘువంశం, కుమారసంభవం, భారవి కిరాతార్జునీయం, మాఘుని శిశుపాలవధమ్, శ్రీహర్షుని నైషధీయచరితమ్.

కాళిదాసు కమనీయకవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. శబ్దమూ, అర్థమూ మహా స్వారస్యంతో కూడి జిలుగులు చిమ్మే కవిత్వం అది. భారవి కవిత్వం కాస్త ప్రౌఢం. భారవేరర్థగౌరవమ్ అని ఒక ఉక్తి. కాళిదాసు కవితలోలాగా ఏ పాదంలో అన్వయం ఆ పాదంలోనే కనబడదు. నాలుగు పాదాలను గాలించి అన్వయాన్ని సాధించవలసి ఉంటుంది. తక్కువ మాటలలో ఎక్కువ అర్థం పొదగడం, పైకి సాధారణంగా చెబుతున్నట్టుగా ఉంటూ, ఆలోచిస్తే లోతైన భావాలు స్ఫురించటం, ఏ మాత్రం ఊహించని విధంగా శ్లోకాలు వాటికి అర్థాలు పొదగగలగటం వగైరాలు ఈయన కవిత్వ విశేషాలు.

న నోననున్నో నున్నోనో నానా నానాననా నను |
నున్నో నున్నో అననున్నేనో నానేనా నున్ననున్ననుత్ ||

కోడ్ లాంగ్వేజీ లాగా ఉన్న ఈ శ్లోకం కిరాతార్జునీయంలోనిది. (౧౫ వ సర్గ ౧౪ వ శ్లోకం). అర్థం మీరే వెతుక్కోగలరు.

మాఘుని కవిత్వంలో కాళిదాసు తాలూకు ఉపమ, భారవి అర్థగౌరవం, దండి తాలూకు పదలాలిత్యం మూడు పెనవేసుకున్నాయని ఒక అభాణకం.

వీరందరిని మించిన కవి...కాదు కాదు పండిత మాన్యుడు శ్రీహర్షుడు. నైషధం విద్వదౌషధం అని ఒక సూక్తి. కవిత్వం వ్రాయడానికి కావలసిన దినుసులు ఏవి అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, కావ్యజ్ఞుల దగ్గర శిక్షణ, అభ్యాసం అని మన అలంకారికులు చెప్పారు. రసగంగాధరకర్త మాత్రం ప్రతిభ ఒక్కటే చాలునంటాడు. కానీ సూక్ష్మంగా గమనిస్తే ప్రాచీన సంస్కృతకవులే కాక, తెలుగు ప్రబంధరచయితలతో సహా ఏదో ఒక శాస్త్రంలో వ్యుత్పత్తి సాధించకుండా రచనలు చేసినట్టు కనబడదు. కొంతమందిలో ఈ వ్యుత్పత్తి మరీ ఎక్కువగా కనబడుతుంది. శ్రీహర్షుడు అలాంటాయనే.

ప్రస్తుతానికి వస్తే ఈ శ్లోకానికి అన్వయం కష్టపడి కుదుర్చుకున్నా అర్థం తెలియ(రాలే)దు. శ్రీ రాజన్నశాస్త్రి గారి "మంజూష" అన్న పుస్తకంలో ఈ శ్లోకార్థం వివరించారు. తర్కశాస్త్రాన్ని, కవిసమయాన్ని అందంగా ఉపయోగించుకున్న శ్లోకం ఇది.

కలశాల అందాన్ని అందిపుచ్చుకున్న దమయంతి స్థనసౌందర్యం చక్రభ్రమను అంటే చక్రవాకపక్షులా అన్న భావనను కలిగిస్తూ ఉన్నవని స్థూలంగా అర్థం. (స్తీ పయోధరాలను చక్రవాక పక్షులతో పోల్చటం ప్రాచీన కవిసమయాలలో ఒకటి).

******************************************

సూక్ష్మమైన అర్థం తెలియాలంటే తర్కశాస్త్రంలోకెళ్ళాలి.

కుమ్మరి కుండ చేయటానికి రెండు బంకమట్టిముద్దలను చక్రం మధ్యలో పెడతాడు. ఆ చక్రాన్ని తిప్పుతాడు. అలా తిప్పడానికి ఆ చక్రంపై బిగించిన కర్ర ఊతంగా కావాలి. అలా తిప్పడం వల్ల కుండ ఏర్పడుతుంది. అంటే కుండ (అనే కార్యం) తయారు కావడానికి

- రెండు మట్టి ముద్దలు తప్పనిసరి, ఇవి ప్రత్యక్ష కారణం (సమవాయి కారణం అంటారు) . మట్టి ముద్దలు యే రంగులో ఉంటే కుండ ఆ రంగులోనూ, మట్టి ఎంత నున్నగా ఉంటే కుండ అంత చక్కగాను వస్తుంది కాబట్టి మట్టి ముద్ద ప్రత్యక్షకారణం.

- దండం - అంటే చక్రం త్రిప్పడానికి ఉపయోగించే కర్ర - నిమిత్తకారణం. నిమిత్తకారణం అంటే - నామ్ కే వాస్తే పరోక్షకారణం - అంటే కుండ తయారీకి కర్ర కావాలి కానీ కర్ర తాలూకు లక్షణాలు చివరన కుండలో చేరవు.

సంస్కృత తర్కశాస్త్రంలో దీన్ని చెప్పడానికి సూత్రం ఉంది. "సమవాయికారణగుణాః కార్యే సంక్రామంతి న నిమిత్తకారణగుణాః" - ఏవైతే ప్రత్యక్షకారణాలో వాటి లక్షణాలే ఫలితంలోనూ వస్తాయి.

(ఈ సూత్రం కవిత్వలక్షణాలకు అన్వయిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి! :))

******************************************

పైన వివరణ చదివారు కదా. ఇప్పుడు శ్లోకానికి వస్తే - తర్కశాస్త్రం మాట ఎలా ఉన్నా దమయంతి కుచములు అనే కలశాలలో మాత్రం (ఆ కలశం తిప్పడానికి ఉపయోగించిన) కర్ర లక్షణాలు ఉన్నాయి(ష). ఆ లక్షణమేది? చక్రభ్రమ (చక్రాన్ని త్రిప్పుట) అనే లక్షణం. చక్రభ్రమ - "అంటే చక్రవాకపక్షులా అనే ఒక భ్రమ" అని దమయంతి విషయంలో శ్లేష!

******************************************

ఇంకా అర్థం కాకపోతే ఏమీ చేయడానికి లేదు. ఈ నైషధీయచరితాన్ని శ్రీహర్షుడు మొదట రాసిన వర్షన్ కు అర్థం తెలియకపోతే తేలికగా మళ్ళీ, మళ్ళీ అర్థం కాకపోతే తిరిగి తేలికగా మళ్ళీ, ఇలా మళ్ళీ మళ్ళీ ఆరుసార్లు తిరగవ్రాశాడుట. ఇన్ని సార్లు తేలికపర్చినా ఇలా ఉందిది!

అడుగు అడుగునా అమృతాంజనము రాచుకొను భావములకు హర్షుఢు భోషాణము - అని పుట్టపర్తి నారాయణాచార్యులు చమత్కరించారు కొంత నిజం, చాలా అబద్ధం. చక్కని అందమైన కవిత్వానికీ శ్రీహర్షుడు పెట్టింది పేరు. అలాంటి ఒక శ్లోకం ఇదే ఘట్టం నుండి. (పైన తల్నెప్పికి పరిహారం :))

ధృతలాంచనగోమయాంచనం విధుమాలేపనపాండురం విధిః |
భ్రమయత్యుచితం విదర్భజాऽనననీరాజన వర్ధమానకమ్ ||

బ్రహ్మ చంద్రుడనే తట్టను చంద్రునిలోని మచ్చ అనే గోమయంతో శుద్ది చేసి, కాంతిపుంజమనే దీపకళికను (కర్పూరం ముక్కను) పెట్టి ఆ అమ్మాయి మోముకు నీరాజనం పడుతున్నాడట. గోమయంతో శుద్ధి చేసి నీరాజనం పట్టటం మనకు ఒకప్పటి దేశాచారం.

ఎంత బావుందో కదా!

దమయంతి తాలూకు ఈ రెండు వర్ణనలూ హంస నలునితో ఆమెను వర్ణిస్తూ చెప్పినవి. ఇలాంటి హంస ఒకటి నా దగ్గర ఉంటే ఎంత బావుండు?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.