సంస్కృతసౌరభాలు - 1


మధుద్విరేఫః కుసుమైకపాత్రే
పపౌ ప్రియాం స్వామనువర్తమానః |
శృంగేణ సంస్పర్శ నిమీలితాక్షీం
మృగీమకండూయత కృష్ణసారః ||

ద్విరేఫః = తుమ్మెద, కుసుమైకపాత్రే = పువ్వు అనే ఒక గిన్నెలోని, మధు = తేనెను, స్వాం ప్రియాం = తన ప్రియురాలిని, అనువర్తమానః= అనుసరించి, పపౌ = త్రాగినది.

కృష్ణసారః = దుప్పి,సంస్పర్శనిమీలితాక్షీం = తనస్పర్శతో మోహం పొంది కళ్ళు కాస్త మూసుకున్న,మృగీం = ఆడుజింకను, శృంగేణ = కొమ్ముతో, అకండూయత = గోకింది.

శివుడు తీక్ష్ణంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు చేస్తుండగా వసంతం వచ్చింది. అప్పుడు అడవిలో జంతువులను, ప్రకృతిని వర్ణిస్తున్నాడు కవి.

ఒక తుమ్మెద, పువ్వు అనే గిన్నెలో తన ప్రియురాలితో కలిసి తేనెను పంచుకుని త్రాగుతూందట. ప్రియురాలిని అనుసరించి - అంటే ప్రియురాలు త్రావిన తేనెను మగతుమ్మెద తాగుతూంది అని - చమత్కారం. అలాగే ఓ దుప్పి, ఇంకో ఆడజింకను గోకుతుందట. ఆ ఆడుజింక కళ్ళు సగం మూసుకుంది. అంటే ఇంకాస్త గోకనీ అని ఆ గోకుడు తాలూకు అనుభవాన్ని ఆస్వాదిస్తూంది. ఇంకా - ఒక ఆడుయేనుగు పుప్పొడితో సువాసన అలముకున్న కొలనులో నీళ్ళను మగయేనుగుకు తొండంలో పట్టి ఇస్తూందట. ఓ హంసేమో సగం కొరికిన తామరతూడును జంట హంసకిస్తూంది. ఒక తీవె చెట్టుకు అల్లుకుంది. ఎలాగ? తన చివురుటాకుల పెదవులను, తనలోని మాగినపళ్ళగుత్తుల పయోధరాలను ప్రియుడైన చెట్టుకు అందిస్తో.

ఇలాంటి వాతావరణంలో ఆయన తపస్సు చేస్తున్నాడు!

*******************************************

కావ్యం సుకుమారము, విచిత్రము, ఉభయము అని కుంతకుడు అనే ఒక అలంకారికుడు చెబుతాడు. వీటిని రీతులు అంటారు. ఈ రీతులకు ఇతర అలంకారికులు వైదర్భి, గౌడి, పాంచాలి అని వేరే పేర్లు పెట్టుకున్నారు. ఈయన పేర్లు మాత్రం ఇవి. ఇందులో సుకుమారము అనే రీతి (method) లో కావ్యం ఉండాలంటే వాటికి కొన్ని లక్షణాలు చెప్పాడతను. ఆ లక్షణాలలో ఒక లక్షణం ఏవంటే - చెప్పే భావంలో స్వభావప్రధానమై ఉండాలి. ఎక్కడెక్కడివో పోలికలు తీసుకొచ్చి ముడి పెట్టకూడదు. కవి తన వ్యుత్పత్తితోటి కల్పితమైన కౌశలం చూపిస్తే అది సుకుమారం కాజాలదు.

ఈ రీతికి ఉదాహరణగా కుంతకుడు ఇచ్చిన ఉదాహరణ పై శ్లోకం. ఎంత స్వభావసుందరంగా ఉందో కదా!

********************************************

పై శ్లోకాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
ఓ సందర్భాన ప్రస్తావించారు. ఇలాంటిది రామాయణంలో వాల్మీకి కవి శ్లోకమొకటుంది. దాన్నే కాళిదాసు పైన శ్లోకంలో అనుసరించాడని అన్నారు.

ఇదం మృష్ట మిదం స్వాదు ప్రఫుల్లమిదమిత్యపి |
రాగమత్తో మధుకరః కుసుమేష్వేవ లీయతే ||

"ఇదుగో ఈ పువ్వులో తేనె నిండుగా ఉంది, ఇందులో తేనె రుచికరంగా ఉంటుంది, అర్రె ఈ పువ్వు బాగా వికసించిందే!" అనుకుంటూ రాగమత్త మైన ఒక తుమ్మెద పువ్వు పువ్వు మీదా వాలుతూ పోతూంది.

ఇక్కడా సహజసుందరమైన వర్ణనే. ఈ వర్ణనకు తోడు వాల్మీకి చేసిన గమ్మత్తు - "రాగమత్తః" అన్న శబ్దం. రాగ అంటే అనురాగము అని ఒక అర్థం, ఎరుపు అని మరొక అర్థం, సుందరమైన నాదమని మరొక అర్థం.

రాగమత్త అయిన తుమ్మెద అంటే - అనురాగ పరవశ అయిన తుమ్మెద. తుమ్మెద అనురాగవశ ఎందుకు అయింది (అయి ఉంటుంది?) - అంటే - పక్కన మరో జంటతుమ్మెద ఉండాలి కాబట్టి అని సమాధానం రావాలి.

అలాగే రాగమత్త - ఎరుపురంగుకు పరవశం ఎందుకంటే పుప్పొడి తాలూకు ఎరుపు, పసుపు వర్ణాల కలయికకు అలవాటు పడింది కనుక. రాగమత్త - నాదానికి పరవశ - ఏ నాదానికి? తన తోటి తుమ్మెద చేసే ఝుంకార నాదానికి. ఇక్కడా తుమ్మెదకు తోడు ఉందని ప్రతీయమానార్థం.

వాల్మీకి రచన సహజసుందరమూ, ధ్వని భరితమూ అయితే కాళిదాసు రచన శృంగారరసోపవిష్టమూ, సహజమూ.దేని త్రోవ దానిదే. ఆచార్యులు మాత్రం కాళిదాసు కవిత వాల్మీకి కవితను అనుసరించబోతే భాష బరువు అడ్డుపడిందన్నారు. ఏమో, కావచ్చు! మన బోంట్లకు ఆ విషయం నిర్ణయించే అధికారం, అణేబారం లేదు.

********************************************



కామెంట్‌లు

  1. సంతోషమండి. ఏదో ఇంతకాలానికి కరుణించినారు. ఎదురుచూస్తుంటాం.
    స్వంతంగా చదవలేక మీలాంటి వారేదైనా చెపుతారేమో అని చూస్తుంటాము.

    రిప్లయితొలగించండి
  2. అణేబారం - ఈమాటని ఇంతకుముందెన్నడూ నేను వినలేదు. నిఘంటువులోనూ అర్థం కనిపించలేదు.వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  3. అణేబారం అన్నది రాయలసీమ మాండలికం. యోగ్యత అని అర్థం.

    రిప్లయితొలగించండి
  4. అణే బారం అనేది హణెయ బరహ అనే కన్నడ పదానికి తెలుగు రూపాంతరం.
    హణె = నుదురు/నొసలు
    బరహ= రాత
    హణెయ బరహ= నొసటి రాత

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.