సంస్కృతసౌరభాలు - ౩
కలశే నిజహేతుదండజః కిము చక్రభ్రమకారితాగుణః | స తదుచ్ఛకుచౌ భవన్ ప్రభాఝరచక్రభ్రమ మాతనోతి యత్ || నిజహేతుదండజః నిజ = తనదైన హేతు = నిమిత్తకారణమైన దండజ = కట్టెవలన బుట్టిన చక్రభ్రమకారితా= కుమ్మరి చక్రము త్రిప్పుటను చేసెడి గుణః = ధర్మము కలశే = కుండయందు కిము సంక్రాంతః = సంక్రమించినదా ఏమి? యత్ = ఏలనన సః = ఆ కుండ తదుచ్చకుచౌ = ఆ దమయంతి యొక్క ఉన్నతమైన పయోధరములుగా భవన్ = అగుచు ప్రభాఝరచక్రభ్రమమ్ = కాంతిప్రవాహమందు చక్ర(వాక పక్షులా అను) భ్రమను ఆతనోతి = కలిగించుచున్నది. ****************************************** శ్లోకం తాత్పర్యం వ్రాసినా సాధారణంగా అర్థం కా(లే)దు. ఖంగారు పడకండి. ఇదొక నారికేళపాకం. ఈ నారికేళానికి పీచు కూడా పీకాలి. నిదానంగా చూద్దాం. ****************************************** సంస్కృతాధ్యయనంలో పంచమహాకావ్యాల వరుస ఇది. కాళిదాసు రఘువంశం, కుమారసంభవం, భారవి కిరాతార్జునీయం, మాఘుని శిశుపాలవధమ్, శ్రీహర్షుని నైషధీయచరితమ్. కాళిదాసు కమనీయకవిత్వానికి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. శబ్దమూ, అర్థమూ మహా స్వారస్యంతో కూడి జిలుగులు చిమ్మే కవిత్వం అది. భారవి కవిత్వం కాస్త ప్రౌఢం. భారవేరర్థగౌరవమ్ ...