29, జూన్ 2012, శుక్రవారం

పాదచతుష్టయములో దుష్టచతుష్టయము

శంకరాభరణం బ్లాగులో ద్రౌపదీవస్త్రాపహరణం, శ్రీకృష్ణుని ఆర్తరక్షణ ఘట్టానికి నా పద్యము.


సీ ||

రాలె - సితయశము రారాజమకుటశో
            భాయమానోజ్జ్వలితాంశుకమ్ము,
తునిగె నల విపులఘనభుజావేష్టిత
           
శూరత - మార్తాండసుతుని గుణము,

ఈగె నిశ్శేషము రాగకల్మాషయు
            తాక్షదృష్టి శకునిపక్షశక్తి,
వ్రయ్య లవదె నిజభ్రాతప్రబలపరి
            ష్వంగిత్యురుతరదుశ్శాసనురము,
 

గీ ||
కౌరవాదులకుఁ దొడరె కాలవశము,
దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల,
నిదురవోయె కొలువునందు నీతి నియతి,
కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము.


సీసపద్యములో 

మొదటిపాదము లో దుర్యోధనుడు
రెండవపాదము లో కర్ణుడు
మూడవ పాదము లో శకుని
నాలుగవ పాదములో దుశ్శాసనుడు 

ప్రస్తావింపబడినారు. 
 
అంశుకమ్ము = కిరణసముదాయం అని ఒక అర్థం, వస్త్రము అని మరొక విశేషము.
గుణము = అల్లెత్రాడు, శీలము (character) అని అర్థాలు.
అక్షము = పాచిక, కనులు అని రెండు అర్థాలు.
పక్షము = రెక్క, side వైపు అని అర్థాలు.
శకుని = గాంధారరాజు, పక్షి అని అర్థాలు.


శ్లేషలు
౧. మొదటిపాదము - రాలినది ద్రౌపది చీర కాదు, రారాజు కిరీటములో శోభాయమానమైన ఉజ్జ్వలమైన కిరణసమూహము, ధవళకీర్తి అనుట.
౨. రెండవపాదము - తునిగినది. సూర్యపుత్రుని విశాలమైన భుజములలో ఆవరించిన శూరత్వము అను శీలము, శ్లేషార్థంలో ఆతని అల్లెత్రాడు అని.
౩. తొలగినది కుటిలమైన పాచికల ప్రభావము, శ్లేషార్థంలో కుటిలమైన చూపు. శకుని పక్షశక్తి అంటే శకుని బలగం తాలూకు శక్తి, శకుని రెక్కల శక్తి అని రెండు అర్థాలు.


సీసపద్యంలో ప్రతిపాదంలో సంస్కృతసమాసాలకు క్రియ తెలుగులో కూర్చబడినది. (రాలె, తునిగె, ఈగె, వ్రయ్యలు). సంస్కృతసమాసాలు ఇవి.

సితయశము = ధవళకీర్తి
రారాజమకుటశోభాయమానోజ్జ్వలితాంశుకమ్ము = రారాజు కిరీటంలో శోభాయమానమై, ప్రకాశిస్తున్న కిరణసముదాయం.
విపులఘనభుజావేష్టిత
శూరత = విశాలమైన, ఘన భుజములను ఆవరించిన శూరత్వము

రాగకల్మాషయుతాక్షదృష్టి = కుటిలత్వముచే ఎరుపెక్కిన కంటిచూపు

శకునిపక్షశక్తి = శకుని రెక్కల బలము
నిజభ్రాతప్రబలపరిష్వంగిత్యురుతరదుశ్శాసనురము = అన్న చేత గాఢంగా కౌగిలించబడిన శ్రేష్టమైన దుశ్శాసనుని రొమ్ము.



ఈ పద్యానికి ప్రేరణ ఇచ్చిన శంకరయ్య గారికి ప్రణామాలు.



2 కామెంట్‌లు:

  1. స్తవనీయ మైన యత్నము ,
    చవియగు పద్యమును గూర్చె , చతుర శ్లేషా
    కవితా రవియై , కవి , తా -
    రవి - సంస్తవనీయుడు తనర విబుధ నుతులన్ .
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  2. రాజారావు గారు, కమనీయమైన పద్యం చెప్పారు. చాలా చిన్నవాడినైన నాకు పెద్దప్రశంస! ప్రణామాలు.

    రిప్లయితొలగించండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.