సమాసోక్తి అలంకారం


"యత్ర ఉక్తౌ గమ్యతే అన్యః అర్థః సా సమాసోక్తిరుదితా" అని సమాసోక్తి లక్షణనిర్వచనమ్.
 
ఉక్తి - అంటే చెప్పిన మాట. అది ఇంకొక అర్థాన్ని ఆశ్రయిస్తే అది సమాసోక్తి అలంకారం.


ఉదా:-
రాగ మెసఁగ చకిత రాణి నిశ ముఖము
నందుకొనియె ఱేడు చందురుండు.
రాలెనంతట తిమిరాంశుకమ్ము. చెలఁగి
నిశయుఁ దానిని గమనింప దయ్యె.

(నా అనువాదానికి మాతృక క్రింద)

ఉపోఢరాగేణ విలోల తారకం తథా గృహీతం శశినా నిశాముఖమ్ |
యథా సమస్తం తిమిరాంశుకం తయా పురోऽపి రాగాద్గలితం న లక్షితమ్ ||

- నిశ అనేది అమ్మాయి పేరు. ఆమె మగని పేరు చందురుడు.చంద్రుడు ఆమె ముఖాన్ని ముద్దాడాలని చేతిలోకి తీసుకోగానే పరవశంతో ఆమె నీలి మేలిముసుగు (నీలజాలికా అన్న వస్త్రాన్ని నవోఢలు ధరిస్తారని కామశాస్త్రం) జారిపోయింది. ఆ అమ్మాయి మైమరపుతో దాన్ని పట్టించుకోలేదు.
 
తిమిరాంశుకం = నల్లటి వస్త్రము అని ఇక్కడ అర్థము.
ముఖము = మోము

కానీ ఈ పద్యం చదవగానే స్ఫురించే అర్థం ఇలా ఉంటుంది.
ఎఱుపు రంగు చంద్రుడు రాత్రి ఆరంభంలో ఉదయించగానే ఆయన వెలుగుకు తిమిరంతో మిశ్రితమైన నక్షత్రాలు చెదరినై. రాత్రి మాత్రం చందురుడు వచ్చిన ఆనందంతో ఆ విషయం పట్టించుకోలేదు.
 
ఇక్కడ తిమిరాంశుకమ్ము = తిమిరంలో మునిగిన నక్షత్రాలు
ముఖము = ప్రారంభము

ఒక ఉక్తి ఇంకో అర్థాన్ని స్ఫురింపజేస్తున్నది. రెండు అర్థాలు సమానంగా చమత్కారంగా ఉన్నై. కాబట్టి ఇది సమాసోక్తి అలంకారం. 

"చంద్రముఖి" - చంద్రుని వంటి ముఖము గలది - ఇది ఉపమాలంకారం. దీనిని సమాసోక్తిలో చెప్పాలంటే - "ముఖము నయనమనోహరము, స్మితజ్యోత్స్నోపశోభితము" అని చెప్పవచ్చు. (చిత్రమీమాంస)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.