నైషధీయ చరితమ్ ద్వితీయ సర్గ - తాత్పర్యం - నా నోట్సు.

శ్రీహర్షుని నైషధీయచరితమ్ ద్వితీయ సర్గకు నేను వ్రాసుకున్న నోట్సు.

హంస చేష్టలు.


నలుని వలన విముక్తి పొందిన ఆ హంస మాటలచే వర్ణింపనలవి గాని ఆనందమును, లోకాధిపతియైన మహావిష్ణువు వలన మోక్షము పొంది వాగతీతమైన మహానందమును పొందిన ద్విజులవలెఁ బడసెను. అటుపైనది మహారాజు చేత నలుగుటవలన పైకి రేగిన ఈకలు గల తన శరీరమును విదల్చుకొన్నది. మిట్టపల్లములైన తన ఱెక్కలను ముక్కుచేత సరిచేసుకున్నది. నలుని వలన విముక్తి పొందిన క్షణమందే, ఒకపాదముచేత ఱెక్కలమూల యొక్క మధ్యభాగాన పైనకు జొనిపిన మోకాలుతో తొందరగ తలను గోకుకొనుచూ నివాస స్థలమునకు వెళ్ళినది. నేర్పుగా ఱెక్కలనే వనదుర్గమందు దాగి చుఱుకుగా కుట్టుతున్న పురుగులను తన వాడి ముక్కు కొసల చేత వారిస్తూ దురద (కండూతి)ను బాపుకొన్నది. ఆ హంసను ఇతర హంసలు చుట్టుముట్టినవి. మహారాజు చేత నలిగిన ఈ హంస శరీరమునందు కలిగిన మార్పులనవి గమనించి బిగ్గరగా కూజిస్తూ మింటికెగిరినవి.ఆ హంస నలుని వీడి సరస్సు వద్దకెళ్ళింది. అక్కడ నాచు చేత కప్పబడిన అడుగు భాగము కలిగి, శివభక్తుని లక్షణాలతో శోభిస్తూ, చేత తుమ్మెదలవంటి రుద్రాక్షలను మాలగా ధరించిన నలుని చేయిని చెంగలువగా భ్రమించి తిరిగి ఆ చేయి వద్దకేగినది. చాలాకాలము ఆ రాజువద్ద లాలనను పొందగా విశ్వాసమునందెనా యేమి? అన్నట్లు ఆతని భుజముపై వ్రాలి కుతూహలమును ప్రదర్శించినది. మానససరోవరప్రియయైన ఆ హంస రాజు మనసుకు సుఖం కలిగేలా, సంతోషసాగరాన మునిగిన ఆతని మనసునకు చెవులకు వ్రేలాడే కుండలములు ఆలంబన అగునట్లు ఈ విధముగా చెప్పదొడగినది.

హంస పలుకులు.


"ఓ రాజా! నృపులకు మృగయావినోదమధర్మము కాకపోయిననూ నన్ను విడిచిపుచ్చితివి. స్మరసుందరుడా! ఇది నీ దయాజనితమైన ఉత్కృష్టమైన ధర్మము. స్వజాతిని చంపు చేపలను, తనకాశ్రయమైన చెట్లను (రెట్టలు, గూళ్ళచే) పీడించే పక్షులను, నిరపరాధులైన గడ్డిపోచలను తినివేసే జంతువులను వేటాడే మృగయాధర్మం రాజులకు అధర్మం కాదు. ఇదివరకు నన్ను బట్టుకొన్నప్పుడు నిన్ను నిందించితిని. సూర్యుడు తరువులను యెండచే కాల్చిననూ, తిరిగి వర్షమనే అమృతముతో చల్లబరిచే విధంగా నేను నా అపచారమును ప్రియమైన కార్యనిర్వహణ ద్వారా తొలగించుకునే అవకాశమిమ్మని కోరుతున్నాను. అయాచితంగా వచ్చిన సంపద అని నీవు భ్రమపడవలదు. నేను చేయబోయే ఈ సహాయము దైవకృతము. అందు నేనొక సాధనము మాత్రమే. ప్రభువైన నీకు పక్షిమాత్రమైన నేను చేయునదేపాటి! ఐననూ ఇది మహోపకారమని నీవు ఎఱుఁగగలవు. సహాయమునకు ప్రతిసహాయము కొంచమైననూ, గొప్పదైననూ సరియే. పరిమాణముపై పండితులకు పట్టుదల యుండదు. నా ఈ వాక్యములు నీవు వినుటకు తగనివైనా, చిలుకపలుకుల వలె తీయనివని, వినోదము కలిగించునన్న నెపమున వినవచ్చును."

హంస దమయంతిని వర్ణించుట.


"ఇంద్రుని స్వర్గాన్ని కూడా పరిహసిస్తూ విదర్భ దేశమున్నది. దానిని సార్థకనామధేయుడై, అరివర్గములకు భీముడైన భీమమహారాజు యేలుచున్నాడు. ఆయన తన ఉపాసనచేత ముల్లోకాలలో, మూడు కాలాలలో సత్యవాక్కు కలిగిన దమనమహర్షిచేత సాటిలేని గుణములు కలిగిన కుమార్తెను, దముడను పుత్త్రుని వరములుగా బడసెను. ఋషి ప్రసాదలబ్ధయైన ఆ బాల ముజ్జగముల సౌందర్యరాశులను దమనము చేస్తూ, దమయంతి అనే తన నామధేయమును నిలుపుకున్నది. గుణవంతుడైన ధరాపతికి పుట్టినదైననూ ఆ కుమార్తె లక్ష్మియే. కళలకు దూరమైనా, శశి పరమేశ్వరుని శిగను అలంకరించుటలేదా యేమి? విదుషీమణి ఐన ఆ దమయంతి నెరులు అతిశయమైన అందంతో, చమరీ మృగపు తోక కుచ్చుల సామ్యమును తిరస్కరిస్తూ ఉన్నవి. జింకలు దమయంతి నేత్రశోభ తమ నేత్రశోభను ధిక్కరిస్తున్నందువలన గిట్టలతో గోకుతూ వాటికి సాంత్వన కలిగిస్తున్నవి. ఆ దమయంతి తల్లిదండ్రుల కులములు శ్రుతిగాములు (వేద కాలమునాటివి). ఆమె నేత్రములు శ్రుతిగాములు (ఆకర్ణాంతము వరకూ సాగినవి), ఆమె గుణములు శ్రుతిగాములు. (ప్రసిద్ధములై జనుల చెవిన బడినవి). ఇట్లు ఆమె చరిత్ర, నేత్రములు, శీలములు ఒకదానికొకటి అధిగమిస్తున్నవి. ఆమె నేత్రాలు నళినములను మలినం చేస్తూ, జింకలను అస్పృశ్యులను చేస్తూ, కాటుకచే అలంకరింపబడి కాటుకపిట్టను సౌందర్యశూన్యముగా చేయుచున్నవి. బింబ నామము (దొండపండు పేరు) ఆ దమయంతి అధరములకు బాగుగా నప్పుచూ, బింబఫలముకంటే యోగ్యమైన అన్వయమును పొందుచున్నవి. చంద్రుని మధ్యనుండి సారమును గ్రహించి బ్రహ్మ ఈమె వదనమును తయారు చేసినందున చంద్రునికొక కళంకము వచ్చినదాయెను. ఆయన చంద్రుడనే పళ్ళెరమును కళంకమనే గోమయమును కూర్చి దమయంతి ముఖమునకు హారము పట్టునట్లు ఆమె వదనము శోభిల్లుతున్నది. సౌందర్యపరీక్షలో పద్మములను దమయంతి జయించుటవలన ఆ నాటినుండి అవి నీటినాశ్రయించి యందు తేలుచూ ఉన్నవి. ఆమె కనుబొమ్మలు ప్రపంచవిజయమునకై జన్మించిన రతీమన్మథుల విల్లులై, ఆమె ఉచ్ఛ నాసిక నీపై ప్రయోగమునకిచ్ఛగించిన శరమన్నట్లుగా యొప్పుచున్నది. ఓ శూరుడా! జలదుర్గస్థమైన తామరతూండ్లు అనబడే శత్రువులను జయించిన భుజములు గలదియు, సూర్యమిత్రములైన తామరపూవుల శోభలను ధిక్కరించు భుజముల విలాసము కలిగినదియు ఐన ఆమె నీకు తగినది.
ఆమె యందు శైశవము, యౌవనము వ్యాప్తి చేయగోరుచుండగా బ్రహ్మ నూగారుచే వాటిని విడదీసెను. అలా ఎల్లలు నిర్దేశించినప్పటికీ అవి సంతోషమందుట లేదు. సౌందర్యప్రవాహముచేత లోతైన ఆమె దేహమందు యౌవనమూ, మన్మథుడూ తరించుటకు గానూ యేర్పడిన కుండలాయన్నట్లు ఆమె స్తనద్వయము అతిశయిల్లుచున్నది. చక్రభ్రమకారితా గుణము కట్టె వలన నిమిత్తకారణము. ఆ ధర్మము దండజన్యమైన ఘటమందు సంక్రమించినదా? ఏలననగా ఘటము దమయంతి కుచమై ప్రభాఝరచక్రవాకభ్రమను కూర్చుచున్నది. ఆ దమయంతి చికురములు నెమళ్ళ పింఛములను తిరస్కరించుటవలన అయ్యవి కుమారస్వామిని ఆశ్రయించినవి. అట్లే ఆమె కుచద్వయము ఐరావతమును ధిక్కరించుటచే ఆ ఐరావతము ఇంద్రుని ఆశ్రయించినది. ఆమె ఉదరము లోతైన నాభియుతమై, అరచేయి, అంగుష్టము మధ్యన స్పష్టముగా ఇముడుచున్నది. ఆ పట్టువలన ఏర్పడిన త్రివళి ఆమె నడుముపై భాసించినది. బ్రహ్మ తనపిడికిలిచేత ఆమె నడుమును ఇముడ్చుకొనగా ఆమె నడుమున వళిత్రయము బంగరుమొలనూలితో గూడి శోభించునా అన్నటు యుండెను. సూర్యుని రథచక్రమును నిర్మించిన అభ్యాసము చేత బ్రహ్మ అటువంటి మరొక చక్రమును మన్మథుని కొఱకు నిర్మింపదలపెట్టెనాయనునట్లు ఆమె నితంబములున్నవి.ఆమె ఊరుద్వయము కేవలము కదళీవృక్షమును పరిహసించుటకొఱకా? కాదు. కుబేరసూనుడు నలకూబరుని ప్రియురాలు రంభను ధిక్కరించుటకు కూడానూ.  సూర్యోపాసనచేత రెండు పద్మములు ఆమె పాదములను ప్రతిష్టనొందినవి. వాటిని బ్రహ్మ వాహనములైన హంసలు ఏతెంచి తమ కూజితములచేత అందెలతో (నహంసకములు) కూడినవిగా చేయుచున్నవనుట నిశ్చయము. అనేకమైన పుణ్యసరస్సులనాశ్రయించి, అనేకరాత్రుల ధ్యానముచేత గడించిన పుణ్యము కలిగి పద్మము దమయంతి వదనము అను మనోహరగతినొందినది.

రాజుకు హితోక్తి


సరస్సులను అన్వేషించుటకు బయలు దేరిన నా కనులకు మిథ్యామధ్య ఐన ఆ దమయంతి దర్శనమను ఆతిథ్యము కలిగినది. స్వర్గలోకపు సౌందర్యరాశులలో నొకటిగ నేను దమయంతిని భావించి ఆమె మనసులోనొకడు నివసించెనాయని ఆలోచించితిని.   పురుషులందరిలోకి అగ్రణియైన నిన్ను ఆమె పక్కన భావించి ఊహించితిని.చిరకాలము ఆమెను చూచియున్ననూ ఆమె స్ఫురణము నాకు కలుఁగక నిన్ను జూచినంత ఆమె గుర్తుకు వచ్చినదాయెను. మీరిరువురు తుల్యసౌందర్యలక్షణులు కదా! దమయంతీ కిలికించితము నీయందే శోభించును. రమణీయమైన మణిహారావళి రమణీకుచయుగ్మమందే భాసించును కదా. ఓ వీరుడా! దమయంతి లేని నీ రూపము గొడ్డుచెట్టు పూవు వలె నిరర్థకము. అట్లే సమృద్ధమైన ఈ భూమియునూ, మరి యీ కోకిలలున్నూ. వీరుడా! ఆ దమయంతి సాహచర్యము దేవతలచేతనూ కోరబడుచున్నందున, వర్షాకాలమున చంద్రకాంతి కుముదమును చేరు విధమున నతి దుర్లభము. తత్కారణముచేత ఆమె యెదుట నేను ఆయావిధములుగా నీ స్తవమును చేయుచూ ఇంద్రుడు కూడా తన మనసును మార్చలేని విధముగ జేయగలవాడను. ఓ రాజా! అనుచితమైనను నీ అనుమతి కోసమే ఇట్లు సంభాషించితిని. అదియును నొసంగిన, నీ కార్యమును సాధించగలను."

ఈ విధముగా అమృతోపమానమైన హంస వచనములను విని నలుడు తృప్తిగ నిడుచు త్రేనుపు వలె నొక్క తెల్లని మందహాసమును గావించెను. అటపై ఎఱ్ఱకలువ వంటి తన హస్తము చేత హంసను నిమిరి, తన సంతోషము కొఱకు, ప్రియములు మధురములునైన తన వాక్కులను చల్లెను.

నలుని సందేశము


"ఓ హంసా! నీ యాకారమును, సౌశీల్యమును సాటిలేనివి. ఆకృతికి తగిన గుణము గలదని జెప్పు సాముద్రికశాస్త్రమునకు నీవు తగిన యుదాహరణము. నీ దేహమే కాదు, వాక్కునూ సువర్ణమయమే. నీ పక్షపాతము ఆకాశమార్గమునందే కాదు, నా వంటి భూపతులయందును సమానముగ నున్నది. అత్యంత తాపమును భరించుచున్న నాకు నీవు తుషారసారమైన మలయస్పర్శ వలె తాకితివి. ధనదునకు శంఖపద్మాదులవలె నీవంటి జ్ఞానులకు, గుణవంతులకు సత్సాంగత్యమే యొక మహానిధి. ముల్లోకముల మోహములకు నౌషధమైన ఆ దమయంతిని గూర్చి ఇదివరకే వినియున్ననూ, నీ వచనము చేత కనులకు గట్టినట్టు తెలుసుకొంటిని. సుహృదుల చేతను, స్వహృదయము చేతనూ విషయములను పరిశుద్ధముగ నెఱుంగు వివేకులకు సూక్ష్మవిషవివేచన చేయజాలని కన్నులు అలంకారప్రాయములు మాత్రమే. హంసా! జనులచే ప్రామాణికముగా చేయబడి, నా చెవుల జేరిన మధుమధురమైన దమయంతీగుణవర్ణన, అధైర్యమును, మదనానలమును, ఋక్కులచే వ్రేల్చిన యగ్ని విధముగా ప్రజ్వలింపబడినది. ధిక్! ప్రతికూలమైన దక్షిణదిశామలయము మలయపర్వత సర్పసమూహఫూత్కారము వలె భరింపరానిది. ప్రతిమాసమున చంద్రుడు సూర్యుని సంగమించునెడ, సూర్యుని యొద్దనుండి తీక్ష్ణకిరణములను దెచ్చి నన్ను తపింపజేయనిచ్చగించుచున్నటులున్నది. మన్మథశరములు కుసుమములే కాని పిడుగులు కావు. అయిననూ విషలతాసంభవములవలె నా హృదయమును తపింపజేయుచున్నవి. కావున మన్మథబాణసంభవమైన నా తాపసముద్రమును తరింపజేయుటకు భగవత్కృతమైన పడవవలె నీవు నాకాలంబనయగుము. పిసికిన పిండిని తిరిగి పిసుకుట యను వ్యర్థకార్యము వలె నేను నిన్ను మరలమరల ప్రేరణ గావింపను. సత్పురుషులకు పరప్రయోజనమనునది (మీమాంసకులకు) స్వయముననుద్భవించు జ్ఞానము వంటిది కదా! నీ మార్గము మంగళకరమగుగాక! తిరిగి మనకు పునస్సమాగమమగుగాక! స్మరణీయమైన సమయములదు మమ్ము స్మరింతువు గాక!"                                                                                                           
ఇట్లు హంసను వదిలి ధైర్యవంతుడు, సత్యవాక్ బృహస్పతియునైన ఆ నలుడు కలహంస ధ్వనులను విని ఆశ్చర్యవిస్మితుడై ఉద్యానమును ప్రవేశించెను.

అంతటనా యండజము భీమసుతాదర్శనాపేక్షతో క్షితిమండలమండనాయితమైన కుండిననగగరమును గూర్చి యరిగెను. ఆవెంటనే మార్గమునందు తొలుతనే నేత్రప్రియము, కార్యార్థసిద్ధిసూచితమునైన జలముచే నిండిన పూర్ణకలశమును జూచినది. ఆపై పోవలసిన మార్గమును గుర్తెఱిగి నెమ్మదియైన గమనమును పొంది ఆ నలుని విలాసోద్యానవనమున రసభరితమైన చూతఫలమును విలోకించినది. అంతట గున్నయేనుఁగుల వంటి జలదములచేత వ్యాపింపబడి, క్రూరమృగములు, విషసర్పములకాలవాలమైన దట్టమైన వృక్షసమూహములతో నిండిన పర్వతమును గాంచెను. ఆ హంస ఒకపరి ఱెక్కలు విదల్చుచూ, మరియొక తడవ ఊర్ధ్వాభిగమనయై చూడశక్యము గాక, మరొక మారు రెక్కలను విస్తరించుచూ, ప్రేక్షణీయమై సాగెను. ప్రేక్షకుల దృష్టిని బొందిన యా హంస ఆకసమను యొరిపిడి రాయి తన హేమగాత్రమును ఱాచుచుండగా పుట్టిన కాంతిరేఖను వెదజల్లుచూ పయనించెను. ఆ హంస ఝంకారమును గూర్చుచూ మార్గమున యేగునెడ - డేగ తమపై బడుచున్నదా యని యల్పపక్షులు వితర్కించి భయమంది యొంటికంటితో మింటిని గనినవి. ఆ హంస ఛాయ భూమిపై బడి పాంథులా ఛాయను పరికించి తలయెత్తగా వారికి తన జాడలు కనబడనంతవేగమున వెడలినది. ఇలా కాంతిరేఖవలె సాగుచునున్న హంస మార్గమున యే ఉన్నతభూరుహమునైననూ ఆశ్రయింపలేదు. తన తోటి పక్షుల కూజితములను వినలేదు.

కుండిననగరవర్ణనము


అటపై కైలాసపర్వతతుల్యసౌధములు గలిగినదై, మనోహరమై, భీమరాజపాలితమైన నగరమును ఆ హంస సమీపించెను. ఆ కుండిననగరమందు స్ఫటికమణిమయమై, కళంకరహితములైన గోడలచే భాసించే సౌధములు, భూదేవి తన భర్త యైన భీమరాజును యొనర్చెడు రతిహాసములవలె నొప్పెను. ఆ రాజభవనములు ఇంద్రనీలమణిమయములై, సూర్యుని భయము వలన శరణందిన నిశలవలె, పగళ్ళయందు పునరావృత్తి లేని వసతిని పొందినవాయెను. భూమ్యాకాశములను తమయందు దాచుకొన్నవి వలె ధవళకాంతియుతములైన ఆ భవనముల యందు పౌర్ణమి తిథి తప్ప మరొకటి అగుపించుటలేదు. ఆ నగరమందలి వాపికలు (బావులు) సుందరస్త్రీలు మేననలదికొన్న లత్తుకలతో శోణవర్ణితములై, రాత్రియంతయు నూరడించిననూ తేటవడని మానిని కోపము వలె స్నిగ్ధత గాంచినవి. అర్ధరాత్రి యందా నగరము యోగపట్టను ధరించి ఆత్మధ్యానపరాయితయైన యోగి దర్శించు ఆత్మజ్యోతివలె ప్రాకారముల మధ్య నున్న గృహముల రత్నకాంతిచే శోభించును. పరిఖా (అగడ్త) మేఖలావృతమైన యా నగర మధ్యభాగము స్వర్గమునకు ప్రతిబింబముగను, అగడ్త యా ప్రతిబింబమును యేర్పరుచుటకై వలసిన యద్దమువలెను శోభించెను. గృహముల పైభాగమున వేగముగ చలించెడు ధ్వజముల తాడనము వలన ఆ మార్గమున నఱుగు సూర్యుని రథచోదకుడైన అరుణునకు విశ్రాంతి దొరకినది. మూడు మూడు యంతస్తులు గల ఆ భవనములు నిధ్యన్నపానస్రక్చందనాదికముల చిహ్నముల ధరించి పాతాళ, భూ, సువర్లోకములవలె భాసించుచు, అద్భుతముగ నొప్పినవి. మేఘముల నీలిమను తనయందు నిముడ్చుకుని యమృతము వలె శుద్ధము, ధవళమైన భీమసేనుని రాజభవనము చంద్రమండలవ్యాప్తశిఖరము గల్గిన చంద్రశేఖరత్వమును నొందదా యేమి? నగరమున మేడలముందరి సాలభంజికలను జింకలలో కళంకములను మేడపై భాగమునఁ జెక్కిన సింహప్రతిమలు మింగివేసినవా యన్నటులుండెను. బలిస్వర్గము మేరుస్వర్గముకంటే మహత్తరమని నుడివిన తథ్యవాక్కు నారదమహర్షి మాట ఈ కుండిననగరమును తలంపగా విపరీతమాయెను.  పథికులకాహ్వానమొనర్చు పిష్టముల (పేలాలు) సౌరభములు గల యా నగరపు యంగడివీధులందు తిరుగలి శబ్దములతో స్పర్థించుచూ మేఘములు తమ ఘుర్ఘురధ్వనులను విడచిపెట్టుటలేదు. సువర్ణప్రాకారమను మేరువు, తనయొడినుండి భూలోకమునకేతెంచిన కుండిననగరమను అమరావతిని రత్నఖచితమైన సౌధద్వారములను ఱెక్కలతో అనునయించుచున్నది. సూర్యకాంతిమణిమయప్రాకారసంయుతమైన ఆ నగరమునందు ఉదయాస్తకాలముల మధ్య వెడలునగ్ని జ్వాలలచే బాణాసురుని పట్టణమనిపించినది. శంఖములు,మణులు, గవ్వలు రాశులుగా పోసియున్న ఆ నగరపు యంగడి వీథులు, వానిని లెక్కింపబడు చేతులచే నెండ్రకాయలవలెనూ, కర్పూరధూళులు యిసుక వలెను తోపగా, నొక సముద్రమును తలపించుచున్నది. ప్రతిచంద్రోదయమందును ఆ నగరపు చంద్రకాంతశిలానిబద్ధభూములనుండి స్రవించు నుదకములచే యాకాశగంగ ప్రవృద్ధమగుచున్నది. సమృద్ధుడును, ఆకాశగంగయును ఒకే సమయమున ప్రవృద్ధమగుచూ, పతివ్రతాధర్మము పరిపాలింపబడుచున్నది. సాయంకాలమున యరుణుని నుండిన జారిన కిరణములాయన్నట్లు ఆ నగరి యందస్తమయ కాలమున విక్రయించు కుంకుమపువ్వులనెడు విలేపనద్రవ్యములగుపించుచున్నవి. మున్ను హరిగర్భమున ప్రవేశించి మార్కండేయుడు సమస్తప్రపంచమును జూచినట్లు, వైశ్యులచే విక్రయింపబడు సమస్తవస్తువులు ఆ పురి జనముచే చూడబడుచున్నవి. కస్తూరి సౌరభమునకాకర్షితమై మూగెడు తుమ్మెదల రొదను జనులు చేయు శబ్దములు మింగివేసినవి. శిశిరకాలపు రాత్రులందు ఆ పురజీవులపాదములను హిమము పీడించలేదు, యేలనన, అచ్చటి సూర్యకాంతిమణిమయమార్గములు రోజంతయూ జ్వలించుటవలన వేడిమి కలిగినది. కలికాలము వలె తీక్ష్ణమైన గ్రీష్మము, ఆ నగరవాసులను బాధింపలేదు. యేలనన, నలుని స్వభావమువలె శీతలమైన చంద్రకాంతశిలాజనితోదకము ఆ నగరమును శీతలమొనర్చుచున్నది. పరిఖావృతమై, శత్రు అభేద్యమైన ఆ కుండిన నగరి, జ్ఞానమునకు గోచరము గాని మహాభాష్యపు కుండలీగ్రంథము వలె గహనమైనది. 

ముఖము, హస్తములు, పదములు, కనులయందు తామరపువ్వును, మిగిలిన దేహాంగములయందు చంపకపుష్పములను పొందిన దమయంతి మన్మథపూజకవసరమగు పుష్పమాలశోభను పొందినది. కుచజఘనభారముచే ఆకాశముననెగురుటకు అసమర్థులైన నూర్గురు అప్సరసలు ఆమె చెలికత్తెలై ఆశ్రయించిరనుట నిశ్చయము. ఆశ్చర్యముకాలవాలమై, చిత్తరువులతో నిండిన ఆ కుండిననగరము మర్యాద, స్థిరత్వములచేత సమస్తవర్ణములు (జాతులు) కలిగి, అనేకముఖములు గల బ్రహ్మ, శివ, సుబ్రహ్మణ్యుల శబ్దముగలదై, ధ్వనిభేదమును ఎట్లు పొందదు? కుండిన నగరమునందలి పద్మరాగమణిమయరాజగృహములు సూర్యుని కిరణములచే తాపమునొంది దప్పిక తీరుటకై రాత్రి చంద్రమండలమునాస్వాదించినవి. నగరకూటాగారముపైని పసుపచ్చ ధ్వజము చంద్రునికళంకమును స్పృశించుటచేఅనది వలయాకారమైన ఆదిశేషునిపై పవళించిన విష్ణువు వలె భాసించినది. ఆ నగరమేడలపై పట్టువస్త్రపతాకలు, విశ్వామిత్రుడు నూత్నస్వర్గమును సృజించుపనుద్దేశించి పిదప బ్రహ్మ నిరంతరవేదపాఠములను వెలువరించగా ఆపివేయగా, మొదట సృజించిన యాకాశగంగ వలె భాసించినది. ఇంద్రనీలమణిమయభవనములపై తెల్లనికాంతితో ప్రకాశించు ధ్వజములు, సూర్యుని ఒడిలోనాడుకొను బాలయమున వలె పొరలుచుండినవి. ఆ నగర కామిని ప్రియుని మేడపై విశ్రాంతి పుచ్చుకొనుటకై మేఘమునెక్కి యేగగా, ఆ మేఘగమనము వలన ఱెప్పలు మూయక నిమేషరహితలైన దేవభామలను తలపించినది. దమయంతి క్రీడాశైలము నుండి వెలువడిన కిరణములనెడు దర్భలు దేవలోకమును జేరి అచ్చటి గోవుల నోట బడు చున్నవి. అందువలన ఆ నగరమునకు పరితినగోగ్రాసదానఫలమబ్బి పుణ్యవంతమైనది. ఆ నగరపు చెట్లకు చంద్రకాంతశిలావేదికలు కరుగగా నందిన నీటివలన నీరు పోయునవసరము లేకపోయెను.

బంగారు ఱెక్కలు గల హంస ఆ వనమందు తనసాటి అందముగల చెలులనడుమ, నక్షత్రములమధ్య చంద్రరేఖ వలె భాసించు దమయంతిని జూచినది. దిగుటకు అనువైన వసతి వెదకుచూ వలయముగ నా హంస జేయు వలయముల వలన చంద్రపరివేషము దమయంతీముఖ దర్శనమునకై తపించినట్లు యుండెను. వనమున చెలులతోనాడుకొను ఆ దమయంతిని జూచిన హంసకు స్వర్గమున శచీదేవికి నిట్టి భాగ్యము లేకపోయెనని చింతించెను.

కవిరాజచమూమకుటాలంకారుడైన శ్రీహీరసుతుడు, జితేంద్రియుడు, మామల్లదేవితో శ్రీహర్షుని కనగా నాతడు నైషధీయచరిత్రయను ప్రబంధమున కూర్చిన ఉజ్జ్వలమైన రెండవ సర్గ సమాప్తము.                                                       

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

అశోకుడెవరు? - 1

ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.