వీఁడటే....
శ్రీ కృష్ణుడు మొట్టమొదటి సారి పల్లె వదిలి నగరానికి బయలుదేరాడు. కంసుని పిలుపు మీద అక్రూరుని తోడుగా మధురానగరానికి బలరాముని జోడుగా సాగింది పయనం. నగరం చేరాడు. నగరంలో వింతలు విశేషాలు చూసుకుంటూ అన్నదమ్ములు వెళుతున్నారు. ఆ ఊళ్ళో అమ్మాయిలు కూడా అప్పుడే యౌవనంలో అడుగుపెట్టి మిసమిసలాడుతున్న మనవాడిని చూశారు.
కం||
వీటఁ గల చేడె లెల్లను
హాటకమణిఘటితతుంగహర్మ్యాగ్రములం
గూటువలు గొనుచుఁ జూచిరి
పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.
రత్నాలు తాపడం చేసిన ఎత్తయిన బంగారుమేడలమీద బాల్కనీల నుండి గుంపులుగా చేరి ఈ అందమైన కృష్ణుణ్ణి చూశారుట.
ఇప్పుడే అందిన వార్త. “పాటించి” చూశారుటండి. అంటే కళ్ళప్పగించి కాబోలు!
ఇప్పుడే
సీ||
వీఁడటే రక్కసి విగతజీఁవఁగ జన్నుఁ
బాలు ద్రావిన మేటిబాలకుండు |
వీఁడటే నందుని వెలఁదికి జగతిని
ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు !
వీఁడటే మందలో వెన్నలు దొంగిలి
దర్పించి మెక్కిన దాఁపరీఁడు!
వీఁడటే యలయించి వ్రేతల మానంబు
సూఱలాడిన లోకసుందరుండు!
గీ ||
వీఁడు లేకున్న పురమటవీ స్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగతఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగరుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు !
(దాపరీడు = దొంగ, విగతఫలము = నిరుపయోగం, విహగరుతము = పక్షిపలుకు)
(తాత్పర్యం: వీడేనేంటే పూతన చనుబాలు త్రాగి ప్రాణం తోడినవాడు! వీడేనా యశోదకు నోట్లో ముల్లోకాలనూ చూపించినవాడు! వీడేనటే గొల్లపిల్లలతో చేరి వెన్నలు దొంగతనం చేసి మెక్కినవాడు! వీడేనేంటే గోపభామల మనసుదోచిన సుందరాకారుడు! వీడు లేని వూరుకన్నా అడవి మేలు. వీణ్ణి పొందకపోతే జన్మకు నిరుపయోగం. ఇతనితో మాట్లాడకపోతే మాటలు అనవసరం. వీడిని చూడకపోతే కన్నులెందుకు!)
అదండి సంగతి. పోతనామాత్యుని భాగవతంలో దశమస్కందములో 1250 వ పద్యం ఇది. ఒక్కసారి ఓణీపరికిణీ వేసుకున్న అమ్మాయిలు నలుగురు చేరి, జడకుచ్చులు అల్లల్లాడుతుంటే, కాటుకకన్నుల్లో ఆశ్చర్యం తొణికిసలాడుతుంటే, బెల్లం ముక్కలాంటి గడ్డం మీద చేయి వేసుకుని అందగాడు శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టు ఊహించండి!
బాబోయ్, పోతన్న కాదు పోతరాజాయన!
*********************************************************************************
స్వోత్కర్ష:
నేనూ మార్గదర్శిలో చేరాను. పై పద్యానికి నా నూరుపాళ్ళూ పచ్చి కాపీ ఈ క్రింది పద్యం. రామునికి అన్వయించేను. ఈ సారి అమ్మాయిలు కాకుండా పెళ్ళికొచ్చిన మిథిలానగర ముసలమ్మలు మాట్లాడుకుంటున్నట్టు చదువుకొమ్మని ప్రార్థన.
సీ ||
వీఁడటే దశరథు పెద్దభార్యకుఁ గడు
అర్మిలిఁ గల్గిన అర్భకుండు !
వీఁడటే బువ్వకుఁ బిలువ రాతిరిఱేని
తెమ్మని బిగిసిన తెంపరోఁడు !
వీఁడటే గౌతముఁ వెలఁదికి శాపఁపు
యంకిలి దీర్పిన అందగాఁడు !
వీఁడటే కొండొక విల్లును తెగ ద్రుంపి
జానకి నందిన సక్కనోఁడు !
గీ ||
వీఁడు ఈ భువి నసలైన వీరవరుడు !
వీఁడు మాయమ్మ కుఁ దగిన పెండ్లికొడుకు !
వీఁడు సూర్యవంశమునకు వెలుగుఱేఁడు !
వీఁడు మమ్మేల వచ్చిన విమలయశుఁడు !
(ఈ కాపీ పద్యం పలికిన వాడు నేనైనా, పలికించిన వారు శంకరులు).
good
రిప్లయితొలగించండిబాగు బాగు.
రిప్లయితొలగించండిపైన కృష్ణుణ్ణి గురించి అమ్మలక్కల సీసపద్యం చదవుతుండగానే మిథిలానగర ప్రవేశం చేసిన రాముణ్ణి చూసి మరి మిథిలానగరపు అమ్మలక్కలు కూడా ఇలాగా చెక్కిళ్ళు నొక్కుకుని చెవులు కొరుక్కున్నారు కదా అనుకున్నాను - ఇంతలో ఆ రూముడి వర్ణన మీరే రాసేశారు. కాకపోతే అప్పటికే పనిలోపనిగా శివధనుర్భంగాం కూడా కానిచ్చేసి మరీనూ. బాగుంది. "విల్లును తెగ ద్రుంపి" మరీ బాగుంది.
రవీజీ !మీ
రిప్లయితొలగించండిరచన !
పోతరాజు పద్యానికి
పోత పోసినట్టుంది !
అనుకరణ ఐనా అద్భుతంగా ఉంది రవీ! అభినందనలు.
రిప్లయితొలగించండి