తేటగీతి గర్భిత చంపకమాల

నా మొదటి గర్భకవిత.

చం||
కనుగొనఁ జక్కనౌ సిరియె గాదిలి పత్నియు సింహరూపియై
ప్రణతులఁ గాచునా హరికి; వాణియె భార్య మహాత్ములెన్నగా
ధునివలె యబ్ధికిన్ శతధృతుండు-విరించికి; సాంబమూర్తికి
న్ననయముఁ గూర్మిగా వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పెడిన్.

గర్భిత తేటగీతి:
సిరియె గాదిలి పత్నియు సింహరూపి
హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న
శతధృతుండు విరించికి; సాంబ మూర్తి
వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె.

పై పద్యాలు రెంటికీ "హరికి వాణియె భార్య మహాత్ము లెన్న" అన్న శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన సమస్య మూలం.

తేటగీతి గర్భిత చంపక/ఉత్పల మాల వ్రాయడానికి సూచనలు:
౧. మొదట తేటగీతి పద్యంతో ఆరంభించాలి.
౨. మామూలుగా తేటగీతిలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు కావాలి. గర్భిత తేటగీతి మాత్రం ప్రతిపాదమూ "న భ భ ర ల" గణాలతో ఉండాలి.
౩. రెండవ గణం "భ" మొదటి అక్షరం చంపక/ఉత్పల మాల తో యతిమైత్రి చెల్లించాల్సిన స్థానం. గుర్తుపెట్టుకోవాలి.
౩. పాదాంతంలో సమాసాలు కూరిస్తే ఇబ్బంది. ఉదా: "కామదహనుడు" - ఇందులో "కామ" పాదం చివర్లో వచ్చి తరువాతి పాదం "దహనుడు" అని మొదలెడితే ఇబ్బంది. అంచేత ఏ పాదానికాపాదం సులువుగా విడదీసుకొనేలా వ్రాసుకుంటే మేలు.
౪. గర్భిత తేటగీతి వ్రాసుకున్న తరువాత దానికి ప్రతి పాదం మొదట "భ ర", చివర్లో గురువు చేరిస్తే ఉత్పలమాల, ప్రతిపాదం మొదట్లో "నల ర", చివర్లో గురువు చేరిస్తే చంపకమాల వస్తుంది.


కామెంట్‌లు

  1. రవి గారూ,
    మీ మొదటి గర్భ కవిత్వం అన్నారు, కాని చూస్తే గర్భకవిత్వంలో ప్రావీణ్యత కనిపిస్తున్నది. మంచి వివరణతో, అందంగా ప్రకటించారు. సంతోషం.
    మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది పద్యం. గర్భ కవిత్వానికి మీరు చెప్పిన కిటుకులు మరీ బాగున్నాయి!

    రిప్లయితొలగించండి
  3. సాధనమున్నచో కవిత చక్కనఁ బల్కగఁ గల్గు శక్తి!కా
    దా! ధరపై మహా కవుల ధారణ చూచినఁ గాంచ వచ్చుగా.
    బోధనమే కదా కవుల పూజన భాజనుగా యొనర్చు స
    ద్వేదియు నౌన్.కవిత దివ్య ప్రభావము గాంచి తీవెగా!

    ధనమున్నచో కవిత చ
    క్కనఁ బల్కగఁ గల్గు శక్తి! కాదా! ధరపై.
    ధనమే కదా కవుల పూ
    జన భాజనుగా యొనర్చు సద్వేదియు నౌన్.

    కవిత చక్కనఁ బల్కగఁ గల్గు శక్తి.
    కవుల ధారణ చూచినఁ గాంచ వచ్చు.
    కవుల పూజన భాజనుగా యొనర్చు
    కవిత దివ్య ప్రభావము గాంచి తీవె.

    రిప్లయితొలగించండి
  4. రవిగారూ ! చాలా సుళువుగా చెప్పారు, ధన్యవాదాలు. ఇవ్వాళే చూశా...

    రిప్లయితొలగించండి
  5. చాలా చాలా బాగుంది. ఉదాహరణలతో పాటు నియమాలని చెప్పడం ఇంకా బాగుంది. తెలియని వాళ్ళకి తెలుసుకునే అవకాశం కూడా!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Disclaimer

అశోకుడెవరు? - 1

ధ్రువనక్షత్రం - శింశుమారుడు