మూడవకన్నుకు మన్నన


ఓ ప్రాకృతకవి ఈశ్వరుని మూడవకన్నుకు ఇలా జయము చెబుతున్నాడు.

రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స |
రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ ||

(రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య|
రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||)

(రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది!)

పై పద్యం యథాతథంగా కాకపోయినా, అదే అర్థంలో (అవే శబ్దాలతోనూ) నా తెనుఁగు పద్యం.

కం ||
అతులితవిరహానంతర
రతికేళిహృతనివసనకరకిసలయోన్మీ
లితనయనయుగళుఁడౌ హరుఁ
సతిపరిచుంబితతృతీయచక్షువు జయమౌ

ఈ పద్యంలో చమత్కారం ఇది. సతి రతికేళి సమయంలో సిగ్గుతో ప్రియుని రెండుకళ్ళను, తన చివురుటాకుల చేతులతో మూసింది. అయ్యవారికి మూడుకళ్ళు! మూడవకన్ను తననే చూస్తోంది. ఆ కన్నునెలా మూయాలి? తన పెదవితో మూసింది. (చుంబించింది). ఆ రెండుకళ్ళకు పట్టని అదృష్టం మూడవకంటికి దొరికింది. ఆ కంటికి జయం చెప్పవలసిందే కదా!

రుద్రుని ఫాలాక్షం ఎప్పుడూ కోపానికి ప్రతీక అయితే, ఈ కవి శృంగారానికి ఆలంబన చేశాడు!

కామెంట్‌లు

  1. ఇదీ లెక్ఖ ....బాగుంది! చాలా బాగుంది!
    కవులు కవులే, కపులు కపులే!
    తేడా తెలిసిపోటల్లా?

    రిప్లయితొలగించండి
  2. @మూడవకన్నుకు మన్నన
    బాగా రాసారు రవిగారు. అలా వచ్చింది అన్నమాట నుదురు చుంబనం.

    ఇంతకీ, ప్రాకృతకవి అంతె పురాతన కవి అనా లేక పేరులేని(అనగా ఎవరు రాశారో తెలియని) కవి అనా? హ్మ్.. నా ప్రశ్నతో మీకు ఇబ్బంది కలిగిస్తే క్షంతవ్యుడిని.

    రిప్లయితొలగించండి
  3. కేతన వినాయకుని తొండంతో మూయిస్తే, ఈ కవి ఏకంగా పార్వతి ముద్దుతోనే మూయించాడు మూడో కన్నుని! ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది! మూడు కళ్ళూ మీసేస్తే సృష్టి స్థితి లయాలు లేనట్టే! శివపార్వతులు ఒకటయ్యేది అలాంటి సందర్భంలోనే కాబోలు!

    రిప్లయితొలగించండి
  4. @వంశీ మోహన్ గారు: బాగా అన్నారు. ఏదో మూల ఇబ్బందిగా కూడా ఉంది. :-) (కోపగించుకోను లెండి. :-))

    @రాజేష్ గారు: ప్రాకృత కవి అంటే, ప్రాకృతభాషలో పద్యం చెప్పిన వాడు. ఈ కవి పేరు నాకు తెలియదు.

    @కామేశ్వర రావు గారు: "అంకముఁ జేరి శైలతనయ.." మీరు ఈ పద్యం గురించి చెబుతున్నారా? మీరు ఈ పద్యం గురించి తెలుగుపద్యం లో వివరించండి మరి.

    @వేణూ శ్రీకాంత్ : ఏదో పుస్తకంలో చూడగానే ఆహా అనిపించిందండి. పైగా సంస్కృతసమాసం తెలుగుకందంలో ఇమిడింది! అదీ విచిత్రం.

    రిప్లయితొలగించండి
  5. రవిగారూ, "నివసన" సాధారణంగా ఇల్లు అన్న అర్థంలో వాడుతారనుకుంటానండీ. వస్త్రము అన్న అర్థంలో వాడవచ్చో కూడదో నాకు తెలియదు. ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  6. @రాఘవ గారు: మీ వ్యాఖ్యకు చాలా సంతోషిస్తున్నాను. మీరన్నట్టు నివసన అంటే ఇల్లు అని అమరం వెతికితే కనిపించింది. అయితే సంస్కృతపాఠం "రతికేళిహృతనివసన.." అనే ఉంది. పుల్లెల రామచంద్రుడు గారు (కావ్యాదర్శం పేజి ౨౨౦) ప్రతిపదార్థంలో "వసన" అన్న పదానికి మాత్రమే అర్థం చెప్పారు. "ని" - ని ఎక్కడ అన్వయించుకోవాలో తెలియట్లేదు.

    ఏది ఏమైనా, "హృతనివసన" బదులుగా "ముషితవసన" అంటే సరిపోతుందంటారా?

    కం||
    అతులితవిరహానంతర
    రతికేళిముషితవసనకరకిసలయోన్మీ
    లితనయనయుగళుఁడౌ హరుఁ
    సతిపరిచుంబితతృతీయచక్షువు జయమౌ.

    రిప్లయితొలగించండి
  7. రవిగారూ

    ని అన్న ఉపసర్గ ఎక్కడ వాడుతారో నాకూ స్పష్టంగా తెలియదండీ. ముషిత అంటే దొంగిలించబడిన అని అర్థం. హృత నేరుగా ఆ అర్థాన్ని ఇవ్వదనుకుంటాను (హృత-అపహృత). ఈ ఉపసర్గల సంగతి కనుక్కోవాలి.

    పోనీ రతికేళీహృతవసన అని వాడుకోవచ్చు అనుకుంటే కేళీ అన్నది వ్యాకరణసిద్ధరూపం కాదనుకుంటానండీ. (మాక్స్ మ్యూలర్, విలియం జోన్స్, మోనియర్ విలియమ్స్, హేమన్ విల్సన్ ఇత్యాది అప్రాచ్యపండితులూ పండితబ్రువులూ వారి ఆధునికనిఘంటువులలో ఇచ్చినది ప్రామాణికం కానేరదు. ఆధునికనిఘంటువులు కూర్చినవారిలో వామన్ శివరాం ఆప్టే గారిది మనం ప్రామాణికంగా గ్రహించవచ్చు.)

    మూలంలో హృతనివసన అనే ఉందీ అన్నారు కాబట్టి ప్రస్తుతానికి అలాగే వదలివేయండి. ఈ పదాలకు సంబంధించి కొంత అవగాహన అవసరం.

    రిప్లయితొలగించండి
  8. రవిగారూ ! చాలా చాలా బాగున్నది. అనువాదముకూడా...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comments ridiculing, abusing, bullying and forcing to agree in any form, if objectionable to the blog owner will be removed.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు - శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు.

Disclaimer

అశోకుడెవరు? - 1