శంకరాభరణం బ్లాగులో ఈ సమస్య ఆ రోజు ఉదయాన్నే చూశాను. నిజం చెప్పాలంటే కాస్త చప్పగా అనిపించింది. కాలకృత్యాలవీ తీర్చుకుని, రెడీ అయి ఆఫీసుకు బయలుదేరే ముందు పూరణ ముగిద్దాం అన్న ఆలోచన వచ్చింది - సినిమాలలో బృందగానంలో మందతో ఆడుతూ హీరో గొడుగు ఉన్నా తడిచిపోయాడు అని. మొదట సమస్య రాసుకుని, బృంద-మంద అనే ప్రాసతో మొదటిపాదం చేకూర్చాను. చూస్తే, రెండవపాదంగా సమస్య(నాలుగవ పాదాన్ని)నే వాడుకోవచ్చని అనుమానం వచ్చింది. అది ఆలానే ఉంచాను. (కాసిన్ని మార్పులతో) ఇక మూడవపాదం తేలికగానే కుదిరింది. అలా పద్యం తయారయ్యింది. బృంద నాట్య మందు మంద యాడిరి చేత గొడుగు కలిగి; కూడ తడిసినాడు చలన చిత్ర నటుఁడు లలన సరసఁ జేరి. గొడుగు కలిగి కూడ తడిసినాఁడు. ఈ సోది అంతా ఎందుకంటే - ఇలా శ్లోకంలో రెండవపాదం, నాలుగవపాదం ఒకే రకంగా కూర్చిన ప్రయోగం శిశుపాలవధమ్ అన్న సంస్కృత కావ్యంలో, ఆరవ సర్గలో మాఘకవి చేశాడు. కాన్తాజనేన రహసి ప్రసభం గృహీతః కేశే రతే స్మరసహాసవతోషితేన | ప్రేమ్ణా మనస్సు రజనీష్వపి హైమనీషు కే, శేరతే స్మ రసహాస వతోషితేన || స్మరసహ = మన్మథ వికారం కలిగించు ఆసవ = మద్యముతో తోషితేన = సంతసించిన వారలై రసహాసవతా = హాస్యానురాగ బద...