వీచిక - 7
()... భాషలో ఈ బ్రాకెట్ ల వాడకం ఎప్పుడొచ్చిందో భాషాశాస్త్రజ్ఞులే చెప్పాలి. ఒక అప్రధానమైన విషయాన్ని చెప్పడానికి వీటిని ఉపయోగించటం రివాజు. కుండలీకరణము - అని ఆ ప్రక్రియ పేరు. ఈ గుర్తుకు తెలుగులో ఒక అందమైన పేరును రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ప్రతిపాదించారు. ఆ పేరు - "చిప్ప గుర్తులు". టెంకాయ చిప్పలను పక్కపక్కన పెట్టి ఊహించుకుంటే ఎంత అందంగా ఉందో కదా! భాషలోని ఈ సంజ్ఞార్థకాన్ని శ్రీహర్షుడనే సంస్కృతప్రౌఢకవి తెలివిగా ఉపయోగించుకుని ఒక శ్లోకం చెప్పాడు. శ్రీహర్షనైషధమ్ లో మొదటి అధ్యాయంలో నలుని కీర్తి, ప్రతాపాలను వర్ణిస్తున్నాడు. తదోజసః తద్యశసః స్థితావిమౌ వృథేతి చిత్తే కురుతే యదా యదా | తనోతి భానోః పరివేషకైతవాత్ తదా విధిః కుణ్డలానాం విధోరపి || తదోజసః = అతని ప్రతాపానికి, తద్యశసః = ఆతని కీర్తికిన్నీ, ఇమౌ = ఈ సూర్యచంద్రులిద్దరూ, వృథా ఇతి = సరికారు అని, చిత్తే = మనసులో, యదా యదా కురుతే = ఎప్పుడు (భావం) కలుగుతుందో, తదా = అలాంటప్పుడు, విధిః = బ్రహ్మ, భానోః, విధోరపి = సూర్య చంద్రుల, పరివేష కైతవాత్ = వలయములు అన్న మిషతో, కుణ్డలానాం = కుండలరేఖను, తనోతి = చేయుచున్నాడు. తాత్పర్యము: ఆ...