వీచిక - 3
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా | నరేన్ద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః || కాళిదాసు రఘువంశం ఆరవసర్గలో ప్రసిద్ధికెక్కిన శ్లోకం ఇది. స్వయంవరంలో దీపశిఖ లాంటి అమ్మాయి - క్రింది బొమ్మలో కేవలం వెలుగు ఉన్న దీపం తాలూకు ఆకారం - ఎదరకు వస్తుంటే రాకుమారుల ముఖాలు ఆ వెలుగులో కాంతివంతమవడం, అమ్మాయి రాకుమారుని వరించకుండా దాటిపోగానే రాకుమారుని ముఖం చీకటిలో కలిసిపోవడమూ (చిన్నబుచ్చుకోవడం) ఎలా ఉందో అలా ఉంది రాకుమారి ఇందుమతి నడక అక్కడ. ఈ శ్లోకం నుండీ కాళిదాసుకు దీపశిఖాకాళిదాసు అన్న పేరు వచ్చిందని ఐతిహ్యం. చక్కని శ్లోకం చెబితే ఆ శ్లోకాన్ని కవికి బిరుదుగా తగిలించడం సంస్కృతంలో సకృత్తుగా కనబడుతుంది. దీపశిఖాకాళిదాసు, ఘంటామాఘుడు, ఆతపత్రభారవి, రత్నఖేటదీక్షితులు, వక్షఃస్థలాచార్యులు....ఇలా. తెలుగులో మాత్రం - ఆలోచిస్తే - ఒక్క ముక్కుతిమ్మన మాత్రం కనబడుతున్నాడు, ముక్కు గురించిన పద్యం ఆయనది కాకపోయినా.నిజానికి ఆ ముక్కు పద్యం కూడా సంస్కృతం నుండీ దిగుమతి అయినది. ఇందుమతి - చంద్రుని వంటి దీపశిఖ - సూర్యవంశజుడైన అజుడిని వరించింది. అజుడు - న జాయతే ఇతి అజః - జన్మ లేని వాడు అని ...