పాదచతుష్టయములో దుష్టచతుష్టయము
శంకరాభరణం బ్లాగులో ద్రౌపదీవస్త్రాపహరణం, శ్రీకృష్ణుని ఆర్తరక్షణ ఘట్టానికి నా పద్యము. సీ || రాలె - సితయశము రారాజమకుటశో భాయమానోజ్జ్వలితాంశుకమ్ము, తునిగె నల విపులఘనభుజావేష్టిత శూరత - మార్తాండసుతుని గుణము, ఈగె నిశ్శేషము రాగకల్మాషయు తాక్షదృష్టి శకునిపక్షశక్తి, వ్రయ్య లవదె నిజభ్రాతప్రబలపరి ష్వంగిత్యురుతరదుశ్శాసనురము, గీ || కౌరవాదులకుఁ దొడరె కాలవశము, దమనమాయెనట ధరణి ధర్మ మెల్ల, నిదురవోయె కొలువునందు నీతి నియతి, కలియుగమ్మునకును నాంది కలిగె సుమ్ము. సీసపద్యములో మొదటిపాదము లో దుర్యోధనుడు రెండవపాదము లో కర్ణుడు మూడవ పాదము లో శకుని నాలుగవ పాదములో దుశ్శాసనుడు ప్రస్తావింపబడినారు. అంశుకమ్ము = కిరణసముదాయం అని ఒక అర్థం, వస్త్రము అని మరొక విశేషము. గుణము = అల్లెత్రాడు, శీలము (character) అని అర్థా...