ముకుందవిలాసః - కుంటిమద్ది శేషశర్మ.
ముకుందవిలాసః అని ఒక శతకం. మొత్తం అంతా సంస్కృతంలో ఉంది. ముందుమాట - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు వ్రాశారు. అదీ సంస్కృతంలోనే ఉంది.(ఇక్కడి తాత్పర్యాలు నావి) ఇది ముకుందుని లీలలను స్తుతిస్తూన్న స్తుతి కావ్యం. స్తుతికావ్యం కనుక గొప్ప వర్ణనలు, అనూహ్యమైన ఉపమలు, జిగేలుమనే పోకడలు లేవు. అయితే ఆశ్చర్యం గొలిపేదేమంటే - ఇంత సులభంగా, అనాయాసంగా సంస్కృతం వ్రాయవచ్చా అని ప్రతిశ్లోకమూ స్ఫురింపజేస్తుంది. పుస్తకంలో 7 విధాల విలాసాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ,దూత, ఆచార్య, సారథి, లీలాలోల, శరణ్యమని వివిధ ముకుందవిలాసాలు. శ్రీవత్సచిహ్న! అన్న నిర్దేశంతో మంగళకరంగా ఈ శతకం ఆరంభం అవుతుంది. బాలముకుందవిలాసం లో రెండవశ్లోకం చూడండి. కారాగృహం స్వతనుకోమలకాంతిపూరై రాపూరయంత మరవిందదళాయతాక్షమ్ ఆనందఖేదజనకం సకృదేవమాతుః గోపాలబాలకముకుందమహం నమామి. కోమలమైనకాంతులతో కూడిన తన గాత్రపు కాంతితో చెరసాలను నింపుతున్న, తామరపూరేకులవంటి వెడదకన్నులవాడు, పుడుతూనే అమ్మకు దుఃఖాన్ని, ఆనందాన్ని పంచిన - గోపాలబాలకుడైన ముకుందుని నమస్కరిస్తున్నాను. వసంతతిలకం ఇది. (శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం - అన్న వేంకటేశ్వరసుప్రభాతపు కోవ). ఈ బాలముకుందవిలాసంలో...