రాజశేఖరుని కర్పూరమంజరి
ఈ వ్యాసాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి? తెనుగు కవితో మొదలుపెడతాను. "అటజని కాంచె భూమిసురుడంబరచుంబి..." "ఎందేడెందము కందళించు రహిచే.." "ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక!" "తరుణి ననన్యకాంత నతిదారుణ.." ... రాయలవారు అల్లసాని పెద్దనకు కర్పూర తాంబూలం అందించి, "శిరీషకుసుమపేశలసుధామయోక్తుల" తో కావ్యం రచించమన్నారు. శిరీషకుసుమపేశల సుధామయ ఉక్తులు = దిరిసెన పువ్వు (కాగితపు పువ్వు) లా సుకుమారమై ఉండి, అమృతాలు చిందే వచనములు; అల్లసాని పెద్దన కవిత్వం అలా ఉంటుంది! సంస్కృతప్రాకృతాలలో అల్లసాని పెద్దన కు సమాంతరంగా - మధురమైన సుకుమారమైన వాక్కులను కలిగిన "కావ్యకవి" ఎవరున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం రాజశేఖరకవి. జయదేవుడు, దండీ కూడా పదలాలిత్యంలోనూ, శబ్దసౌకుమార్యంలోనూ తీసిపోరు కానీ వారిద్దరిలో దండి - వచన కావ్యకవి, జయదేవుడు - గీతకారుడు, స్తోత్రకవి. రాజశేఖరుని శైలి లలితమనోహరమైనది. ఈ కవి సూక్తులు అమృతాలను చిందుతాయని కృష్ణశంకరశర్మ అన్న ఒక కవి నిండుసభలో కీర్తించాడట. పాతుం శ్రోతరసాయనం రచయితుం వాచః సతాం సమ్మతాః వ్యుత్పత్తిం పరమామవాప్తుమవధిం లబ్ధుం రసశ్రోతస...