ధ్రువనక్షత్రం - శింశుమారుడు
రాత్రి పూట ఆకాశంలో సరిగ్గా ఉత్తరదిక్కున సన్నగా, మిణుకుమిణుకుమంటూ ఓ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ వలయంగా తిరుగుతూ ఉంటాయి. ఇది ధ్రువనక్షత్రమని ఇదివరకు వ్యాసంలో ప్రస్తావనగా ఒకచోట చెప్పుకున్నాం. ధ్రువం - అంటే స్థిరము, నిశ్చలము. ఈ ధ్రువనక్షత్రాన్ని Polaris (α-Ursa Minor) అని పిలుస్తారు. ధ్రువనక్షత్రం ఉదయించినప్పుడే దానికి క్రిందుగా సప్తర్షి మండలం కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో "Big Dipper" అన్నారు. ఈ సప్తర్షులు ఏడుగురని మనకు తెలుసు. వీరిలో ముగ్గురు ఒకే సరళరేఖలో, మిగిలిన నలుగురు కలిసి ఒక పెట్టె/గరిటె/శకటం రూపంలో అమరి ఉండటం మనకు తెలుసు. మండలం ధ్రువ నక్షత్రం క్రిందుగా ఉదయించి రాత్రి గతించి తెల్లవారు ఝాము వేళకు ఆ ధ్రువుని పైకి చేరుకుంటుంది. అప్పుడు ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుందో - మాఘుడనే కవి శిశుపాలవధ కావ్యంలో వర్ణించాడు. స్ఫుటతర ముపరిష్టా దల్పమూర్తేః ధ్రువస్య స్ఫురతి సురమునీనాం మండలం వ్యస్తమేతత్ | శకటమివ మహీయః శైశవే శార్ఞపాణేః చపల చరణకాబ్జ ప్రేరణోऽత్తుంగితాగ్రమ్ || (శిశుపాలవధమ్ - 11. 3) బాల్యంలో శ్రీకృష్ణయ్య తన చిట్టిపాదాలలో శకటాసుర...