హిందూరాయ సురత్రాణ - ఇస్లామీయకరణ
“ రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం ” ఫిలిప్ వాగ్నర్ వ్రాసిన వ్యాసం యొక్క సారాంశాన్ని ఖండిస్తూ ఇదివరకటి వ్యాసానికి ప్రస్తుత వ్యాసం పొడిగింపు. వాగ్నర్ పైకి చాలా ఓపెన్ గా రచించినట్టు కనిపించినా, ఆయన ఉద్దేశ్యం - విజయనగర సామ్రాజ్య సారథులైన హరిహర బుక్కరాయలిద్దరున్నూ నాటి ఢిల్లీ సులతానుకు సామంతులనీ, వారిమీద, ఆపై విజయనగరాన్ని పరిపాలించిన సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజులపై మహమ్మదీయ మత ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పటమేనని గ్రహించవచ్చు. ఆ నేపథ్యంలో వాగ్నర్ - ’హిందూరాయ సురత్రాణ’ శబ్దాన్ని తన వ్యాసంలో ప్రతిపాదించిన విషయానికి అనుగుణంగా (అతి) తెలివిగా మలుచుకున్నాడు. వాగ్నర్ - సురత్రాణ శబ్దాన్ని గురించి చేసిన ప్రతిపాదన చూద్దాం. నేను ఈ విధంగా ప్రతిపాదిస్తున్నాను: సుల్తాను, హిందూరాజుల్లో సుల్తాను – ఈ రెండు బిరుదులు ఉపమానాలుగా కాక మాటకు మాటగా, ముఖ్యార్ధంగానే వాడబడ్డాయి. అంటే విజయనగర రాజులు తమని తాము సుల్తానులుగానే ప్రకటించుకున్నారు: అయితే ఈ సుల్తానత సాపేక్షికమైన రాచరికపు హోదాకు సంబంధించింది కాదు. ఇది సుల్తానులకున్న ఇస్లామీయ సాంస్కృతిక దృక్పథం ఆధారమైనది. ముఖ్యంగా,...