సంస్కృత సౌరభాలు - 23
 
    కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు వేల సంవత్సరాల నుండి సమాధానం శోధింపబడుతూనే ఉంది. ఆ ప్రశ్ననే తిరిగి వేసుకోవడం అర్థం లేని పని. కాకపోతే ఈ నిర్వచనాలను తరచి చూస్తే కవిత్వపు నిర్వచనాలు ఆయా మానసిక సంస్కారాలను బట్టి విభిన్న తలాలలో ఏర్పడినట్టు అనిపిస్తుంది.    అందమైన శబ్దజాలం, చమత్కారం - .  అలంకారాలు, రీతి, శయ్య, పాకం ... -  ఔచిత్యం, అర్థవ్యక్తి...  వక్రోక్తి, గుణీభూతవ్యంగ్యం, వ్యంగ్యం -  రసప్రతీతి -   ఎన్నో కొలతలున్నా ఇంకా ఏదో వెలితి. పైని కొలతలన్ని మరచిపోయే కవిత్త్వం చాలా కొలది సందర్భాలలో మాత్రమే వెలువడుతుంది. అలాంటి సంస్కృతకవిత్త్వం అశ్వఘోషకవి రచించిన బుద్ధచరితం ఆరవ ఆశ్వాసంలో పలుకు పలుకునా కనిపిస్తుంది.   ***********   నాలుగు దుఃఖకారకమైన విషయాలను చూసిన గౌతముడు, యశోధరను, శిశువు రాహులుణ్ణి వదిలి మహాభినిష్క్రమణం చేశాడు. ఛన్నుడనే ఒక యువకుడు కంథకమనే అశ్వం ద్వారా గౌతముణ్ణి రాజ్యం బయట తీసుకుని వచ్చి దింపాడు. ఆ తర్వాత -   అవతీర్య చ పస్పర్శ ’నిస్తీర్ణ’మితి వాజినమ్ |  ఛందకం చాబ్రవీత్ ప్రీతః స్నాపయన్నివ చక్షుషా ||   కిందకు దిగి, ఆ గుర్రాన్ని ఆప్యాయంగా నిమిరి "దాటాము" అన్నాడు. ఆపై ఛందకుని...