మూడవకన్నుకు మన్నన
ఓ ప్రాకృతకవి ఈశ్వరుని మూడవకన్నుకు ఇలా జయము చెబుతున్నాడు. రఇకేళిహిఅణిఅసణకరకిసలఅరుద్ధణఅణజుఅలస్స | రుద్దస్స తఇఅణఅణం పబ్బఈ పరిచుంబిఅం జఅఇ || (రతికేళిహృతనివసనకరకిసలయరుద్ధనయనయుగళస్య| రుద్రస్య తృతీయనయనం పార్వతీపరిచుంబితం జయతి||) (రతికేళిలో అపహరించిన వస్త్రములు గలవాడు, చివురుటాకుల చేతులతో నేత్రద్వయం కప్పబడినవాడు అయిన రుద్రునియొక్క - పార్వతిచే చుంబించబడిన ఫాలనేత్రము సర్వోత్కృష్టముగా ఉన్నది!) పై పద్యం యథాతథంగా కాకపోయినా, అదే అర్థంలో (అవే శబ్దాలతోనూ) నా తెనుఁగు పద్యం. కం || అతులితవిరహానంతర రతికేళిహృతనివసనకరకిసలయోన్మీ లితనయనయుగళుఁడౌ హరుఁ సతిపరిచుంబితతృతీయచక్షువు జయమౌ ఈ పద్యంలో చమత్కారం ఇది. సతి రతికేళి సమయంలో సిగ్గుతో ప్రియుని రెండుకళ్ళను, తన చివురుటాకుల చేతులతో మూసింది. అయ్యవారికి మూడుకళ్ళు! మూడవకన్ను తననే చూస్తోంది. ఆ కన్నునెలా మూయాలి? తన పెదవితో మూసింది. (చుంబించింది). ఆ రెండుకళ్ళకు పట్టని అదృష్టం మూడవకంటికి దొరికింది. ఆ కంటికి జయం చెప్పవలసిందే కదా! రుద్రుని ఫాలాక్షం ఎప్పుడూ కోపానికి ప్రతీక అయితే, ఈ కవి శృంగారానికి ఆలంబన చేశాడు!