విద్యానగర విహారం
అనుకోకుండా లైఫ్ లో కొన్ని అవకాశాలు వస్తుంటాయి. అలాంటిదే హఠాత్తుగా ఓ పొద్దున తగిలిన హంపి జర్నీ. (జూలై 2016) మా ఆవిడ కొలీగ్ కారు అనుకోకుండా దొరికింది. డ్రైవరూనూ. ఓ గంటలో అంతా అయిపోయింది. మా వూరి నుంచి బళ్ళారి 100 కి.మీ. అక్కడ నుంచి హంపి 60 కి. మీ. అయితే దరిద్రమైన రోడ్డు! ఆహ్లాదకరమైన వాతావరణం. ఆషాఢస్య ప్రథమ దివసే..... ఆషాఢం మొదట్రోజు పడమర సూర్యాస్తమయాన మేఘాలు కమ్ముకుంటే ఆ యేడాది వర్షాలు విరివిగా పడతాయట! ఆ రోజంతా అలానే వుంది. బళ్ళారి దాటాక, సండూరు కొండల దగ్గర మరీ అద్భుతంగా వుంది. తెనాలి రామకృష్ణ పండితుడు వర్ణించిన స్వామిమల నే సండూరు అంటారు. ఇక్కడ ప్రముఖమైన కుమారస్వామి దేవాలయం ఉంది. 1. హంపి! ఓ జీవిత కాలపు అనుభవం. రాయలసీమకు నీళ్ళు దొరికి సస్యశ్యామలమైతే అచ్చం హంపి కి ఛాయలా వుంటుంది. అలా ఒకప్పుడు వుండేది కూడా. ఎందుకంటారూ? నేటి పెనుగొండ - నాడు విజయనగరరాజుల రెండవ (చలువ) రాజధాని. రాయలవారి దండ నాయకులు పెమ్మసాని వారు. వారిది తాడిపత్రి. (పెమ్మసాని వారి దేవాలయాలు తాడిపత్రిలో నేటికీ ఉన్నాయి. ఈ దేవాలయాల వల్ల తాడిపత్రిని రెండవ హంపి అంటారు) వారి వద్దకూ విజయనగర రాజుల రాకపోకలు ఉండేవి. ప్రబంధకావ...