నీరస చంద్రుడు
చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సుర సౌర భేయీ కరీషైకపిండ మనగ బహు చకోరక దంశ పరిపీత చంద్రికా క్షౌద్రనీరస మధుచ్ఛత్ర మనగ బ్రత్యఙ్ముఖోచ్ఛల ద్రాత్రి వర్షీయసీ పలిత పాండుర కేశబంధమనగ గగన సౌధాలేపకర కాలశిల్పి ని ర్ముక్త సుధావస్త్రముష్టి యనగ సుమహిత జ్యోత్స్నికాలతా సుమగుళుచ్చ మనగ నతిధూసరచ్ఛాయ నబ్జవైరి చెలువు వోనాడి బింబావశిష్టుడగుచు నల్ల నల్లన వ్రాలెడు నంబుజాక్ష! సుర సౌరభేయి = ఆవు కరీషం = పిడక ఆవుపిడక ఎటువంటిదంటే - చరమాద్రి దావాగ్ని సంప్లుష్టము(కాలినది) - ఎర్రటి ఎండకు పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాలినది. అలా కాలికాలి గట్టిబడింది, పొద్దుటి నుంచి అలానే, ఎవరూ కదిలించకుండా పడి ఉంది కాబట్టి గుండ్రంగా ఉంది(కరీషైక "పిండం"). ఆ ఎండిన పిడక లాగా - మధుక్షత్రం - తేనెపట్టు. ఎలాంటిది - క్షౌద్రనీరసం - క్షౌద్రం అంటే తేనె(ట). క్షౌద్రనీరసం - తేనెలేకుండా వట్టిపోయినటువంటిది. (ఈ క్షౌద్రానికి ఒక ఉపమ - చంద్రికా క్షౌద్రం - అంటే వెన్నెల అనే తేనె.) ఎందుకలా వట్టిపోయింది? చకోరక దంశ = వెన్నెల పునుగుల గుంపులు(దంశ). ఈ చకోరాలు, వెన్నెల పునుగులు అనేవి కావ్యాలలో మాత్రం కనిపిస్తాయి. ఇవి గుంపులు గుంపులుగా బ...